వ్యవసాయ రుణమాఫీయే ప్రధాన అజెండా.. 21న తెలంగాణ క్యాబినెట్‌ భేటీ

రుణమాఫీతో పాటు ఇతర అంశాలను చర్చించడానికి ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం కానున్నట్టు సమాచారం. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అనేకసార్లు చెబుతున్నారు.

వ్యవసాయ రుణమాఫీయే ప్రధాన అజెండా.. 21న తెలంగాణ క్యాబినెట్‌ భేటీ

హైదరాబాద్‌: రుణమాఫీతో పాటు ఇతర అంశాలను చర్చించడానికి ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం కానున్నట్టు సమాచారం. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అనేకసార్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులతో సీఎం వరుసగా భేటీ అవుతున్నారు. రుణమాఫీకి అర్హతలు, నిధుల సేకరణ, విధివిధానాలపై కసరత్తు కొలిక్కి వస్తున్నది. కిసాన్‌ సమ్మాన్‌ నిధి అర్హతలనే ప్రాతిపదికగా తీసుకోవడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమాకు కూడా ఇవే అర్హతలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటన్నింటిపై క్యాబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

హైదారాబాద్‌లోని ఏపీ ఆస్తులతోపాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, బడ్జెట్‌ పద్దులపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉన్నది. బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెలాఖరున ప్రారంభం కానున్నందున రైతు రుణమాఫీ విధివిధానాలపై చర్చించేందుకు అవసరమైతే ఈ నెలాఖరున ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం.

రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు నడిచాయి. మాజీ సీఎం కేసీఆర్‌ ఏకకాలంలో రుణమాఫీ సాధ్యం కాదని అన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికలు పూర్తి కాగానే రైతులకు మాట ఇచ్చాను నిలబెట్టుకోవాలి అని ఉన్నతాధికారలతో సమావేశాలు నిర్వహించారు. బ్యాంకర్లతోనూ మాట్లాడాలని సూచించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ రంగానికే తమ ప్రభుత్వం ప్రాధ్యాన్యం ఇస్తున్నదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అనుబంధ రంగాలకు వ్యవసాయ రుణాలు పెంచాలని కోరారు. ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించుకన్నట్టు తెలుస్తోంది. రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విషయాన్నిప్రస్తావించి వారి మద్దతు పొందాలని చూస్తున్నది