CM Revanth Reddy | సుప్రీంకోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణలు..

బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత BRS MLC Kavitha)కు బెయిల్‌ విషయంలో న్యాయ వ్యవస్థ పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం క్షమాపణలు చెప్పారు

CM Revanth Reddy | సుప్రీంకోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణలు..

CM Revanth Reddy | బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత BRS MLC Kavitha)కు బెయిల్‌ విషయంలో న్యాయ వ్యవస్థ పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం క్షమాపణలు చెప్పారు. న్యాయ వ్యవస్థ పట్ల తనకు గట్టి విశ్వాసం ఉన్నదని పేర్కొన్నారు. కవితకు బెయిల్‌ ఇవ్వడాన్ని రేవంత్‌రెడ్డి ప్రశ్నించడాన్ని సుప్రీంకోర్టు గురువారం తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. దీనిపై ఎక్స్‌ వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. భారతీయ న్యాయ వ్యవస్థ (Indian Legal System)పై తనకు పూర్తి విశ్వాసం, అత్యున్నత గౌరవం ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టుకు బేషరతుగా క్షమాపణ (Apologizes) చెబుతున్నానని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని పేర్కొన్నారు. తాను భారత న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత విషయంలో బేషరతు గౌరవం ఉన్న వ్యక్తినని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాజ్యాంగం, దాని నీతిని నమ్ముతానని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ పట్ట అత్యున్నత గౌరవాన్ని కొనసాగిస్తానని తెలిపారు.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు (Delhi Liquor Case)లో బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కవితకు బెయిల్ రావడంపై రేవంత్‌రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ‘2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి బీఆరెస్‌ కృషి చేసిందనేది వాస్తవం. బీఆరెస్‌, బీజేపీ మధ్య కుదిరిన డీల్‌ ప్రకారమే కవితకు బెయిల్‌ వచ్చిందని అంటున్నారు’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి (Justice BR Gavai), జస్టిస్‌ పీకే మిశ్రా (Justice PK Mishra), జస్టిక్‌ కేవీ విశ్వనాథన్‌ (Justice KV Viswanathan) ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది. కోర్టులను రాజకీయాల్లోకి లాగడంపైనా సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వెలిబుచ్చింది. ‘రాజకీయ పార్టీలను సంప్రదించి మేం ఉత్తర్వులు జారీ చేస్తామా? రాజకీయ నాయకుల గురించి లేదా మా ఉత్తర్వులపై విమర్శలు చేసేవారి గురించి మేం పట్టించుకోం’ అని వ్యాఖ్యానించింది.