తెలంగాణలో ఉద్రిక్తత..కాంగ్రెస్,బీజేపీల కొట్లాటలు!

హైదరాబాద్ లో నిన్న బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగాయి. గేటుకు నల్లరంగు పూశారు. ప్రతిగా బీజేపీ, యువమోర్చా శ్రేణులు గాంధీభవన్ పై దాడికి యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. రాజధాని హైదరాబాద్ నుంచి ఉద్రిక్తతలు క్రమంగా జిల్లాలకు పాకుతున్నాయి. నల్లగొండ, భువనగిరిలలో రెండు పార్టీల మధ్య ఘర్షణలు ఉద్రిక్తతలు రేపాయి.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. విద్యార్ధులపై పెల్లెట్ గన్ ప్రయోగించారని, మల్లిఖార్జెన్ ఖర్గేను అవమానిస్తున్నారంటూ… హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయంలోపై కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగాయి. గేటుకు నల్లరంగు పూశారు. ప్రతిగా బీజేపీ, యువమోర్చా శ్రేణులు గాంధీభవన్ పై దాడికి యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. రాజధాని హైదరాబాద్ నుంచి ఉద్రిక్తతలు క్రమంగా జిల్లాలకు పాకుతున్నాయి.

నల్లగొండలో ఉద్రిక్తత…

తమ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ నల్లగొండలో బీజేపీ కార్యకర్తులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడికి దిగారు. ఆ వెంటనే రెచ్చిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేసి..కుటుంబ సభ్యులను కొట్టి,ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.  బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.  దీంతో నల్లగొండలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నాగం కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలను హైదరాబాద్ లోనే అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాటలు నెలకొన్నాయి. 22ఏ నిషేధిత భూముల వ్యవహారం, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక దాడులకు దిగుతుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

భువనగిరి లోను.. హై టెన్షన్

హైదరాబాద్, నల్లగొండలలో మొదలైన బీజేపీ, కాంగ్రెస్ వర్గాల రాజకీయ ఘర్షణలు అనూహ్యంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి విస్తరించాయి. భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కార్యాలయంపై దాడికి యత్నించిన బీజేపీ శ్రేణులు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఫ్లెక్సీపై నల్లరంగు చల్లారు. ప్రతీగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడికి దిగి పూల కుండీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ సందర్బంగా పరస్పరం ఇరువర్గాల పార్టీ కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడ్డారు. పోలీసులు లాఛార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశాయి. ఈ పరిణామాలతో భువనగిరిలో ఉద్రిక్తత నెలకొంది.

 

Latest News