Meenakshi Natarajan : ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటాం
ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని మీనాక్షి నటరాజన్ ప్రకటించారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో జూబ్లీహిల్స్ బై పోల్స్‌పై దృష్టి.

ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ అన్నారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నటరాజన్ భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్ధేశం చేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న మహేశ్ కుమార్ గౌడ్ ను ఆమె అభినందించారు. తాను ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు నెలలకు ఓసారి సమావేశం నిర్వహించడం శుభ పరిణామంగా చెప్పారు. జిల్లాల్లో పార్టీ విస్తృస్థాయిసమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తామని ఆమె అన్నారు. పార్టీ కమిటీల్లో సామాజిక న్యాయాన్ని పాటించాలని ఆమె సూచించారు. పార్టీ కమిటీల్లో 70 నుంచి 80 శాతం పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికి ఇవ్వాలని ఆమెకోరారు. మిగిలిన 20 శాతం పదవులు కొత్తగా చేరిన వారికి కట్టబెట్టాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థలకు వెళ్లాలని పార్టీ భావిస్తోందని ఆమె చెప్పారు. రేవంత్ రెడ్డి ఓసి సామాజిక వర్గానికి చెందినవాడైనా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ తో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఆమె అభినందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో 90 శాతం ప్రజలకు లబ్ది కలుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. వచ్చే నెల నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై పూర్తిగా దృష్టి పెడతామని ఆమె తెలిపారు. వచ్చే వారంలో డీసీసీ కమిటీలను పూర్తి చేస్తామని ప్రకటించారు. మూడు నెలల్లో గ్రామస్థాయి అధ్యక్షుల ఎంపికను పూర్తి చేస్తామని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరిగే సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారా?
జూబ్లీహిల్స్ బై పోల్స్, జీహెచ్ఎంసీ , స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసేలా కాంగ్రెస్ ప్లాన్ చేసినట్టుగా మీనాక్షి వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యనిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసి ఏదో కారణాలతో బయటకు వెళ్లినవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం పంపారనే చర్చ కూడా లేకపోలేదు.