విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఖజనాకు మద్యం విక్రయాల కిక్కు కొత్త ఊపునిచ్చింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ చరిత్రలో తొలిసారిగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.44,557 కోట్ల ఆదాయం సాధించి సరికొత్త రికార్డు అందుకుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు అన్ని మార్గాల ద్వారా కలిపి మొత్తం రూ.44,557 కోట్ల ఆదాయం లభించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒకే ఏడాదిలో ఇంత భారీ మొత్తంలో ఎక్సైజ్ ఆదాయం రావడం ఇదే ప్రథమం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.40,209 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. దీని ద్వారా ప్రభుత్వానికి ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.39,368 కోట్ల ఆదాయం లభించింది.
అదనంగా రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.1,771 కోట్లు, 1,214 బార్ల ద్వారా రూ.549 కోట్లు ఆదాయం కూడా లభించడం గమనార్హం.కొత్తగా ఏర్పాటు చేసిన దుకాణాల లైసెన్స్‌ల కోసం వచ్చిన దరఖాస్తుల రూపంలో నాన్-రిఫండబుల్ ఫీజు కింద మరో రూ.2,869 కోట్లు ఖజానాకు సమకూరాయి.
గత ఏడేళ్ల కాలంలో ఎక్సైజ్ ఆదాయం రెట్టింపు కావడం గమనార్హం. 2018-19లో రూ.20,859 కోట్లుగా ఉన్న రాబడి, 2025-26 నాటికి రూ.44 వేల కోట్లకు చేరింది. 2025 డిసెంబరులో పంచాయతీ ఎన్నికలు, నూతన సంవత్సర వేడుకల కారణంగా రికార్డు స్థాయిలో రూ.5,051 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. లిక్కర్ విక్రయాలు పెరిగినా, బీర్ల అమ్మకాలు మాత్రం తగ్గినట్లుగా గణంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే బీర్ల విక్రయాలు 9 శాతం తగ్గి 387.34 లక్షల కేసులకు పరిమితమవ్వడం విశేషం.
ఇవి కూడా చదవండి :
Revanth Reddy : రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సందేశం!
Decomposed Meat | హైదరాబాద్‌లో ఘోరం.. 14 టన్నుల కుళ్లిన మాంసం సీజ్
