• Telugu News
  • /Telangana

Revanth Reddy : రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సందేశం!

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రత్యేక సందేశం అందించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా ఈరోజు గ్రామ సభలు జరుగుతున్న క్రమంలో ఆ సభల్లో అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Apr 02, 2026, 12:23 pm IST
Read Time: 5 mins
Revanth Reddy : రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సందేశం!

విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రత్యేక సందేశం అందించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా ఈరోజు గ్రామ సభలు జరుగుతున్న క్రమంలో ఆ సభల్లో అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు.

సందేశం వివరాలు :

మిత్రులారా !… ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడునెలలు పూర్తయ్యింది. ఆర్ధిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ… సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా మన ప్రభుత్వం పని చేస్తోంది. మేం పాలకులం కాదు… సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం.ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజా పాలనకు మీ ఆమోదం, మద్ధతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు.

ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు… ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే “ప్రజాపాలన – ప్రగతిప్రణాళిక” పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు.

మహాలక్ష్మి… ఉచిత బస్సుసౌకర్యం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలన్నారు.

“తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ తో ఆర్థికంగానే కాక, అన్నీ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. CURE, PURE, RARE గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు – ఒక దీక్ష. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై… దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కల. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలని.. ఇందుకు మీ అందరి సహకారాన్ని కోరుతున్నానని రేవంత్ రెడ్డి తన సందేశంలో తెలిపారు.