• Telugu News
  • /Telangana

Tummala Nageswara Rao : సెప్టెంబర్‌లో మెరుగైన యూరియా సరఫరా

సెప్టెంబర్‌లో తెలంగాణకు యూరియా సరఫరా మెరుగ్గా, రైతులు సంతృప్తి. రబీ సీజన్ కోసం ముందస్తు సరఫరా కోరిన మంత్రి తుమ్మల.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Sep 26, 2025, 4:27 pm IST
Read Time: 5 mins
Tummala Nageswara Rao : సెప్టెంబర్‌లో మెరుగైన యూరియా సరఫరా

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విధాత): సెప్టెంబర్ నెలలో రాష్ట్రానికి యూరియా సరఫరా గత నెలల కంటే మెరుగ్గా రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి మొత్తం 7.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందగా, వీటిలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే 1.84 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా కావడం ముఖ్యమైన పరిణామమని తెలిపారు. గత నెలలో ప్రతి సారి కేటాయించిన యూరియా కంటే తక్కువగా సరఫరా అవడం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, ఆయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పదే పదే కేంద్రాన్ని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం వలన ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా జరిగిందని అన్నారు.

ఎప్రిల్ నెలలో 1.71 లక్షల మెట్రిక్ టన్నులకు 1.21, మే నెలలో 1.61 లక్షల మెట్రిక్ టన్నులకు 0.88, జూన్ నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నులకు 0.98, జులై నెలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నులకు 1.43, అగస్టు నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నులకు 1.55 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయిన విషయాన్ని గుర్తుచేశారు. దిగుమతి టెండర్లలో ఆలస్యం, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడటం, దాని వల్ల కేంద్రం కూడా రాష్ట్రాలకు సరిపడా యూరియాను అందించలేకపోవడం రైతులను ఇబ్బందులకు గురి చేసిందని వివరించారు.

ఇప్పటికే అందిన యూరియాతో పాటు ఈ రోజు, రేపు వరుసగా మరో 9864 మెట్రిక్ టన్నులు, 9674 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. ఈ యూరియా రైల్వే రేక్ పాయింట్లయిన వరంగల్, మంచిర్యాల, గద్వాల, కరీంనగర్, పందిళ్లపల్లి, జడ్చర్ల, తిమ్మాపూర్ ప్రాంతాలకు చేరుకుంటుందని, అక్కడి నుండి జిల్లాలకు సరఫరా అవుతుందని వివరించారు. అంతేకాక వివిధ కంపెనీల నుంచి మరో 34,700 మెట్రిక్ టన్నుల యూరియా రేక్ ప్లాన్ ఉందని, ఇది ఈ నెలాఖరు వరకు రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉందన్నారు.

రానున్న రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ప్రతి నెలకు 2 లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు. రబీ సీజన్ కు వాస్తవ ప్రణాళిక 10.40 లక్షల మెట్రిక్ టన్నులు అని, ఖరీఫ్ లో జరిగినట్టుగా రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలంటే రబీ సీజన్ మొదటి 3 నెలలలో 6 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా యూరియాను సరఫరా చేయాలని మంత్రి కోరారు. రైతుల అవసరాల దృష్ట్యా సరఫరా విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.