హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు!

సల్కం చెరువులో అక్రమ నిర్మాణాల కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులకు తెలంగాణ హైకోర్టు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసి ఈ నెల 11కి విచారణ వాయిదా వేసింది.

తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సల్కం చెరువులో అక్రమ నిర్మాణాల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్(ఒవైసీ కాలేజ్) అక్రమ నిర్మాణాల కేసులో పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. రంగనాథ్ తో పాటు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌కు, విద్య, రెవెన్యూ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులకూ నోటీసులు చేసింది.

సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలు అమలు కాలేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అధికారులపై పిటిషనర్ ఆరోపణలు చేశారు. సర్వే నంబర్ 62 భూమి చెరువుకే చెందుతుందని పిటిషనర్ వాదించారు. నిషేధిత జాబితాలోని భూమిలో రిజిస్ట్రేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా అధికారులు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. అధికారులు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే, కోర్టు ధిక్కరణ చట్టం-1971 ప్రకారం సివిల్ లేదా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Latest News