- రాష్ట్రంలో పేద గుడిసెవాసులందరికీ పట్టాలు ఇవ్వాలి
- ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులు
- వారి మద్దతు ఉంటేనే ప్రభుత్వాలకు మనుగడ
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుంటే తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు జీవో 58 ప్రకారం పట్టాలు ఇస్తామని చెప్పి అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా పేదవారి జీవితం ఇంకా మార లేదని అన్నారు. పేదలు సిపిఐ ఆధ్వర్యంలో అనేక చోట్ల భూపోరాటాలు నిర్వహించి గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. హనుమకొండలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూనంనేని మాట్లాడుతూ పాలకులు పేదల అనుకూల విధానాలను అవలంబించడం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనవద్దంటూ పేదలకు నీతులు చెబుతూ పెద్దలకు అనుకూలంగా మెదులుతున్నారని విమర్శించారు.
కమ్యూనిస్టుల మద్దతు ఉంటేనే ప్రభుత్వాలు మనగలుగుతాయని అన్నారు. కమ్యూనిస్టులు లేకుంటే తెలంగాణాకు విముక్తి జరిగేది కాదని అన్నారు. గుండ్ల సింగారంలో ఎంతో దీక్ష, పట్టుదలతో కాలనీ నిర్మించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారని, కాలనీలో నివసిస్తున్న పేదలందరికీ ఇండ్ల పట్టాలు వచ్చేలా తాను అధికారులతో, స్థానిక ఎమ్మెల్యేతో అవసరం అయితే సీఎంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గుడిసెవాసులకు సీపీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కాలనీలో కరెంట్, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, నాయకులు మద్దెల ఎల్లేష్, అదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, వలీ ఉల్లాఖాద్రి, స్టాలిన్, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, బత్తిని సదానందం, మునిగాల బిక్షపతి, మాలోత్ శంకర్, శనిగరపు రాజు కుమార్, కొట్టే వెంకటేష్, వేల్పుల సారంగపాణి, అనుకారి అశోక్, రాసమల్ల దినా, గుంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
