Kalvakuntla Kavitha : హరీశ్, సంతోష్‌తోనే కేసీఆర్‌కు చెడ్డపేరు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొన్ని వ్యక్తుల వల్ల కేసీఆర్ కు చెడ్డపేరు వచ్చిందని ఆరోపించారు

Kalvakuntla Kavitha : హరీశ్, సంతోష్‌తోనే కేసీఆర్‌కు చెడ్డపేరు

మాజీ ఎంపీ సంతోష్(MP Santosh), హరీశ్ రావు(Harish Rao), ఓ కాంట్రాక్టు సంస్థ కారణంగా కేసీఆర్ కు చెడ్డపేరు వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.

ఎవరి వల్ల, ఎందుకోసం కేసీఆర్ కు అవినీతి మరక అంటిందని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్(KCR) పక్కనున్న కొందరు చేసిన పని వల్లే ఆయనకు చెడ్డపేరు వచ్చిందన్నారు. ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్ రావు పాత్ర లేదా అని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరంలో(Kaleshwaram) చిన్నభాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు కుంగిపోయినట్టు చేస్తున్నారని ఆమె అన్నారు. కేసీఆర్ జనం కోసం పనిచేస్తే వాళ్లు స్వంత ఆస్తులు పెంచుకోవడం పనిచేశారని ఆమెఆరోపించారు.

తనపై ఎన్ని కుట్రలు చేసినా ఏం మాట్లాడినా నోరు మెదపని విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ పై సీబీఐ(CBI) దర్యాప్తునకు ఆదేశించినందకు ఆయన బిడ్డగా బాధపడుతున్నానని ఆమె అన్నారు. హరీశ్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉన్నారని ఆమె ఆరోపించారు. హరీశ్ రావు, సంతోష్ తనపై ఎన్నోసార్లు కుట్రలు చేశారని ఆమె చెప్పారు. రేవంత్ రెడ్డి, హరీశ్ రావు, సంతోష్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆమె అన్నారు. హరీశ్ రావు, సంతోష్ ను రేవంత్ రెడ్డి ఏమి అనరు… తన తండ్రిపైకి బాణం వేస్తారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు వేశాక తొక్కలో పార్టీ ఉంటే ఏంటీ, లేకపోతే ఏంటి అని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి వరకు వచ్చాక పార్టీ ఏంటి అని ఆమె అడిగారు. ఇది తన తండ్రి పరువుకు సంబంధించిన అంశమని ఆమె అన్నారు. తన లేఖ బయటకు వచ్చినా కూడా తాను ఎవరి పేర్లు బయటపెట్టలేదని ఆమె గుర్తు చేశారు. తనపై వ్యక్తిగతంగా దాడులు చేసినా వాళ్ల పేర్లు ఎప్పుడూ చెప్పలేదన్నారు. హరీశ్ రావు, సంతోష్ తనపై ఎన్ని కుట్రలు చేసినా భరించినట్టు ఆమె తెలిపారు. తన వెనుక బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) ఉందని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆమె చెబుతూ ఇది కేసీఆర్ బ్లడ్.. తాను ఇండిపెండెంట్ గా ఉంటానని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే తోలు తీస్తానని ఆమె వార్నింగ్ ఇచ్చారు. తాను నేరుగా పేర్లు చెప్పానని వారిపై విచారణ చేయాలని కవిత సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తన మాటలతో బీఆర్ఎస్ శ్రేణులకు కోపం రావచ్చన్నారు. కేసీఆర్ ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా ఆస్తులు సంపాదించుకోలేదని ఆమె అన్నారు. కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్ల వద్ద వందల కోట్లు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులను ఎందుకు విచారించడం లేదో చెప్పాలన్నారు. ఏసీబీకి చిక్కిన ఇంజనీర్ల వెనుక ఎవరెవరున్నారో విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

తాము కచ్చితంగా నిజాం బాటలోనే నడుస్తామని ఆమె అన్నారు. నిజాం కట్టిన నిజాంసాగర్ నీళ్లే కదా మనం తాగుతున్నామని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో హరీశ్ రావు, సంతోష్ కుమ్మక్కు అయ్యారని ఆమె ఆరోపించారు. అవినీతిలో హరీశ్ రావు పాత్ర ఉన్నందునే ఆయనను రెండోసారి మంత్రివర్గం నుంచి తప్పించారని ఆమె తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రీప్లాన్డ్ గా సీబీఐ పేరు చెప్పారని ఆమె ఆరోపించారు. ఈ వయస్సులో కేసీఆర్ సీబీఐ విచారణ ఎందుకు ఎదుర్కోవాలని ఆమె ప్రశ్నించారు. సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల కోసం తెలంగాణలో బీసీలను బలిపశువులు చేస్తున్నారని ఆమె విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై(BC Reservation) సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలన్నారు.