రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం

జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రోజే రైతు బంధు వేసినట్లు, తామేదో జాప్యం చేస్తున్నట్లు చేసిన తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రోజే రైతు బంధు వేసినట్లు, తామేదో జాప్యం చేస్తున్నట్లు చేసిన తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఐదారు నెలల పాటు ఆలస్యంగా రైతుబంధు ఇచ్చారని వివరాలు మంత్రి సీతక్క వివరాలు వెల్లడించారు. కేసీఆర్ హ‌యంలో రైతు బంధు నిధులు ఏనాడూ ఒక రోజు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రైతు బంధు ఇచ్చేందుకు నెలల తరబడి సాగ తీసి చెల్లింపులు చేశారని విమర్శించారు. ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 యాసంగిలో రైతు బంధు వేసేందుకు ఏకంగా 161 రోజులు ప‌ట్టిందంటే 5 నుంచి 6 నెల‌లు పట్టిందని గుర్తుచేశారు. రైతులు పంట పండించ‌డానికి కూడా అంత స‌మ‌యం ప‌ట్టదన్నారు.

2022 , 20 -23 యాసంగిలో రైతు బంధును148 రోజులు పాటు వేశారని వివరించారు. అంటే 5 నెలలు ప‌ట్టిందని గుర్తుచేశారు. గ‌తంలో ఒకే రోజులో వేశాను అంటూ గొప్పలు చెప్పుకోవ‌డం కాదు..ఒక సారి తాము చేసిన నిర్వాకం పై డేట్స్ చెక్ చేసుకోవాలంటూ చురుకవేశారు. ఇదిలా ఉండగా ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ ఘనత కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు. మేం గ‌త వానా కాలం కేవ‌లం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్ల రైతు భ‌రోసా నిధులు రైతుల ఖాతాల్లో వేశామని వివరించారు. ఇదిలా ఉండగా కేసీఆర్ చేసిన అప్పుల వల్లే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అయినప్పటికీ వెసులుబాటును చూసుకొని అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని ఆమె వివరించారు. పది సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉచిత బస్సు ప్రయాణం పై వెటకారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం స్కీంను ఎత్తేయాలన్న కుట్రతోనే అలా వ్యవహరిస్తున్నారని, వారి కుట్రలను మహిళాలోకం అర్థం చేసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు.

Latest News