Ande Sri | ప్రముఖ గేయ ర‌చ‌యిత‌ అందెశ్రీ కన్నుమూత

Ande Sri | ప్ర‌ముఖ గాయ‌కుడు అందెశ్రీ( Ande Sri ) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున ఇంట్లో కుప్ప‌కూలిపోయారు.

  • By: raj |    telangana |    Published on : Nov 10, 2025 8:21 AM IST
Ande Sri | ప్రముఖ గేయ ర‌చ‌యిత‌ అందెశ్రీ కన్నుమూత

Ande Sri |

అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ గాయ‌కుడు అందెశ్రీ( Ande Sri ) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున ఇంట్లో కుప్ప‌కూలిపోయారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు గాంధీ వైద్యులు నిర్ధారించారు. సోమ‌వారం ఉద‌యం 7.20 గంట‌ల‌కు ఆయ‌నను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌గా, 7.25 గంట‌ల‌కు చ‌నిపోయిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.

ప్ర‌జాక‌వి, ప్ర‌కృతి క‌విగా సుప్ర‌సిద్ధుడైన డాక్ట‌ర్ అందెశ్రీ జ‌న‌గాం జిల్లాలోని రేబ‌ర్తి అనే గ్రామంలో జులై 18, 1961లో జ‌న్మించారు. అందెశ్రీ అస‌లు పేరు అందె ఎల్ల‌య్య‌. ఆయ‌న‌కు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయ‌న అనాథ‌గా పెరిగారు. అక్ష‌ర‌జ్ఞానం లేన‌ప్ప‌టికీ.. సామాజిక స్థితిగ‌తులు, తెలంగాణ ఉద్య‌మంపై అనేక పాట‌లు రాశారు. అందెశ్రీ రాసిన జ‌య జ‌య‌హే తెలంగాణ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విష‌యం తెలిసిందే. కాక‌తీయ యూనివ‌ర్సిటీ నుంచి గౌర‌వ డాక్ట‌రేట్ పొందారు.

గొడ్ల కాప‌రిగా ప‌ని చేస్తున్న అందెశ్రీని శృంగేరి మ‌ఠానికి సంబంధించిన స్వామీ శంక‌ర్ మ‌హారాజ్ చేర‌దీసి.. ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాడు. ఎర్ర‌స‌ముద్రం సినిమా కోసం మాయ‌మైపోతుండ‌మ్మా మ‌నిష‌న్న‌వాడు అనే పాట‌ను రాశాడు. అందె శ్రీ ర‌చించిన జ‌య‌జ‌య‌హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు ముక్కోటి గొంతుక‌ల‌తో ఆల‌పిస్తున్నారు.

2006లో గంగ సినిమాకు నంది అవార్డును అందుకున్నారు అందెశ్రీ. 2014లో అకాడ‌మి ఆఫ్ యూనివ‌ర్స‌ల్ గ్లోబ‌ల్ పీస్ డాక్ట‌రేట్, 2015లో దాశ‌ర‌థి సాహితీ పుర‌స్కారం, 2015లో రావూరి భ‌ర‌ద్వాజ సాహితీ పుర‌స్కారం, 2022లో నక‌మ్మ జాతీయ పుర‌స్కారం, 2024లో దాశ‌ర‌థీ కృష్ణ‌మాచార్య సాహితీ పుర‌స్కారం, లోక్ నాయ‌క్ పుర‌స్క‌రాం అందుకున్నారు అందెశ్రీ.

అందెశ్రీ రాసిన పాట‌లు ఇవే..

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం (తెలంగాణ మాతృగీతం)
పల్లెనీకు వందనములమ్మో
మాయమై పోతున్నడమ్మో మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు
గలగల గజ్జెలబండి
కొమ్మ చెక్కితే బొమ్మరా…
జన జాతరలో మన గీతం
యెల్లిపోతున్నావా తల్లి
చూడ చక్కని
ఆవారాగాడు (సినిమా)