Telangana AI Data Center | భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్

దావోస్‌లో తెలంగాణ జోరు! ఫ్యూచర్ సిటీలో రూ. 5,000 కోట్లతో భారీ ఏఐ డేటా సెంటర్. యూపీసీ వోల్ట్ ఒప్పందంతో 4,000 మందికి ఉపాధి.

Telangana AI Data Center | భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్

విధాత: దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల సాధన ప్రయత్నాలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక పురోగతి సాధించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం దావోస్​లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్​ హబ్​గా తీర్చిదిద్దడంతో ఈ ఒప్పందం దోహదం చేయనుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్ తో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఒప్పందంపై చర్చించారు. నెదర్లాండ్స్‌ కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ వోల్ట్ సంస్థగా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్‌ నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్​ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్​ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలుంటాయి.

ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనలో డిజిటల్ ప్రగతి కీలకం: రేవంత్ రెడ్డి

2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధిని సాధించడమే రాష్ట్ర లక్ష్యమని స్పష్టం చేశారు.

ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అధునాతన ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నెట్ జీరో సిటీ అభివృద్ధే తెలంగాణ విజన్ లో భాగమని అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దావోస్ లో తెలంగాణకు పెరుగుతున్న పెట్టుబడులు

దావోస్ పర్యటలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇప్పటివరకుతెలంగాణ రాష్ట్రానికి 20 వేల కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకుంది. వాటిలో రష్మీ గ్రూప్ తో 12,500 కోట్ల భారీ డీల్ తో పాటు, మూసీ పునర్జీవనంలో టాటా భాగస్వామ్యం తో కూడిన పెట్టుబడుల ఒప్పందాలు ఉన్నాయి.

హైదరాబాదులో స్టేడియాల అప్గ్రేడేషన్ ,పర్యాటక రంగంలో టాటా పెట్టుబడులకు ముందుకొచ్చింది. క్లీన్ ఎనర్జీలో భాగంగా 6000 కోట్లతో మాడ్యులర్ రియాక్టర్ విద్యుత్ ప్రాజెక్ట్, ఏవియేషన్ రంగంలో 1000 కోట్ల పెట్టుబడికి సర్గాడ్ సంస్థతో తెలంగాణ సర్కారు ఎంవోయూ చేసుకుంది.

వార్డ్ రాష్ట్ర సీఎం క్రిస్టల్ లూసియార్ తో భేటీలో హైదరాబాదులో స్విస్ మాల్ ఏర్పాటు చేయాలని క్రిస్టల్ లూసియార్ కు సీఎం ప్రతిపాదనలు చేశారు. ఫుట్ బాల్ నేపథ్యం ఉన్న ఇద్దరు నేతల మధ్య క్రీడా శిక్షణ పై చర్చలు జరిగాయి, హాస్పిటాలిటీ రిటైల్ రంగాల్లో స్విస్ నైపుణ్యాల వినియోగం, భారత్ స్విస్ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అంశాలపై ఒప్పందాలు దావోస్ పర్యటనలో కీలకంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

Naini Coal Block | నైనీ కోల్​ బ్లాక్​ టెండర్​ రద్దు : ఆరోపణల నేపథ్యంలో వెనక్కితగ్గిన సింగరేణి
Anant Ambani Vantara Watch | అనంత్‌ అంబానీ ‘వంతారా’ థీమ్‌తో లగ్జరీ వాచ్‌.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..!