యాప్ ద్వారా సబ్సిడీ యూరియా కొనుగోలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. యూరియా సరఫరాను మరింత సులభతరం చేయడం చేస్తూ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీ-సేవ కేంద్రాల్లో కూడా యూరియా బుకింగ్ చేసుకునేలా రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతులకు ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఐటీ, పరిశ్రమలశాఖ, వ్యవసాయశాఖలతో మీసేవా కేంద్రాలను అధికారులు అనుసంధానం చేశారు. ఈమేరకు ఎలకా్ట్రనిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) మీ-సేవ కమిషనర్ వివరాలు వెల్లడించారు.
మీసేవలో యూరియా బుకింగ్ పద్దతి..
మీ సేవలో యూరియా బుకింగ్ కోసం రైతు తన పట్టాదారు పాస్‌పుస్తకం నెంబరుతో సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించాలి. మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలను సేకరించి నమోదు చేస్తారు.రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేస్తారు.రైతు నమోదుచేసిన మొబైల్ నెంబరుకు పంపిన ఓటీపీ ధ్రువీకరించిన తర్వాత వెంటనే బుకింగ్ ఐడీ వస్తుంది.ఈ ఐడీ బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఓటీపీ చూసుకోవటానికి రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరును మనుగడలో ఉంచుకోవాలి.
బుకింగ్ గడువు ముగిసేలోపు రైతులు ఎంపిక చేసిన డీలర్ వద్ద యూరియాను కొనుగోలు చేయాలి. యూరియా బుకింగ్‌ను అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, మీ సేవ కేంద్రాల ద్వారానే చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.
సహాయం కోసం సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారులను, మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.
