సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు..పోరుపై కాంగ్రెస్ 15న నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది

- స్థానిక’ పోరుపై 15న నిర్ణయం!
- భేటీ కానున్న కాంగ్రెస్ పీఏసీ
- సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు
- ముంచుకొస్తున్న కోర్డు డెడ్‌లైన్
- ఎన్నికల్లేకుంటే గ్రాంట్స్ రావు
- కీలకంగా మారిన రిజర్వేషన్లు
- కేంద్రంలో బిల్లులు పెండింగ్
- రేవంత్ సర్కార్ మల్లగుల్లాలు
హైదరాబాద్, ఆగస్ట్ 9 (విధాత): స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది. బీసీలకు రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లకూడదనే భావనతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. దీంతో ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి గ్రాంట్స్ విడుదలయ్యే పరిస్థితి లేదు. గత ఏడాది, ఈ ఏడాది కలిపితే రూ.3 వేల కోట్లు రాష్ట్రానికి కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు గ్రాంట్స్ రావాల్సి ఉంది. మరో వైపు ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోపుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశించింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఏం చేయనుంది?
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. ఈ బిల్లుల విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. ఇక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. ఈ నెల 15న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదనే భావనలో రేవంత్ సర్కార్ ఉంది. అయితే, ఒకవేళ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. 2019లో బీసీలకు 23 శాతం మాత్రమే రిజర్వేషన్ అమలు చేశారు. అలా చేస్తే రాజకీయంగా తమకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆ పార్టీ అనుమానిస్తోంది. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించే అవకాశం ఉంది. ఇతర పార్టీలు కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేయవచ్చు. అయితే రిజర్వేషన్ల అంశంపై ఇచ్చిన హామీని అమలు చేయకుండా పార్టీ పరంగా 42 శాతం టికెట్లు బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ పై ఇతర పార్టీలు కాంగ్రెస్ పై విమర్శలు చేసే అవకాశం ఉంది. దీన్ని ఎలా తిప్పికొట్టాలనే దానిపై కూడా హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రిజర్వేషన్లను అమలు చేస్తామని హామీ ఇచ్చినందున ఈ అంశం తేలేవరకు ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టును కోరే అవకాశం కూడా ఉంది. ఏ నిర్ణయం తీసుకొంటే ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బంది ఉండదనే విషయాలపై ఈ నెల 15న జరిగే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.
రూ.3 వేల కోట్లు కేంద్రం నిధులు ఎలా?
తెలంగాణలో సర్పంచ్‌ల పదవీ కాలం 2024 జనవరిలో, నవంబర్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల టర్మ్ ముగిసింది. స్థానిక సంస్థలు స్పెషల్ అధికారుల పాలనలో ఉన్నాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రానికి వస్తాయి. గత ఏడాది రాష్ట్రానికి రూ. 1550 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపంలో స్థానిక సంస్థలకు రావాలి. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనందునా ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1450 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలకు నిర్వహించినా గత ఏడాది విడుదల చేయకుండా నిలిపివేసిన రూ.1550 కోట్లు స్థానిక సంస్థలకు ఇవ్వాలో, వద్దో అనేది కేంద్రం ఇష్టమని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఇలా నిలిపివేసిన నిధులను కేంద్రం విడుదల చేసిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు వాయిదా వేస్తే మొత్తం రూ.3 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి రాకుండా నిలిచిపోతాయి. ఇప్పటికే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి తరుణంలో ఈ నిధులు రాష్ట్రానికి అవసరం.
ఏర్పాట్లు చేసుకుంటున్న ఎన్నికల సంఘం
స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 30 లోపుగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటోంది. బ్యాలెట్ బాక్సులతో పాటు ఇతర మెటీరియల్ ను సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు జాబితాలను కూడా రెడీ చేసుకోవాలని ఇప్పటికే క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్లకు సంబంధించిన డాటా.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందితే వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నారు.