Traffic Restrictions | ఇవాళ హనుమాన్ జయంతి( Hanuman Jayanthi ) సందర్భంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర( Hanuman Shobhayatra ) నిర్వహించనున్నారు. పాతబస్తీలోని గౌలిగూడ రామ మందిర్ నుంచి సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
గౌలిగూడ రామ మందిర్, కోఠి, సుల్తాన్ బజార్, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీనగర్, రామ్‌గోపాల్ పేట్ మీదుగా తాడ్‌బండ్ వరకు హనుమాన్ శోభయాత్ర కొనసాగనుంది. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఈ మార్గంలో అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతామన్నారు. ప్రయాణికులు, వాహనదారులు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
3 వేల మంది పోలీసులతో బందోబస్తు..
హనుమాన్ శోభాయాత్రకు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్, టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని సీసీటీవీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు మొత్తం 12.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.
