Bandi Sanjay | ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే.. తెలంగాణ భవన్‌పై దాడి : బీజేపీ

Bandi Sanjay | ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే.. తెలంగాణ భవన్‌పై దాడి : బీజేపీ

Bandi Sanjay | ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ కార్యాలయంపైన దాడి చేస్తే బీజేపీ యువమోర్చా శ్రేణులు తెలంగాణ భవన్ పై దాడులు చేస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీని హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై ఇప్పటికే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హెచ్చరించారని గుర్తు చేశారు. ఆంధ్రజ్యోతిపై బీఆర్ఎస్ దాడులు చేస్తే చూస్తూ బీజేపీ శ్రేణులు ఊరుకోవన్నారు. ‘మీ క్యాడర్ ను రమ్మను.. మా క్యాడర్ వస్తది..మీ కిరాయి గుండాలను రమ్మను..మా కట్టర్ క్యాడర్ కూడా వస్తది….పక్కాగా ప్రతిదాడులు చేసి తీరుతాం’ అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా టీవీపై దాడి చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే.. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేస్తామని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే సాహసం చేసి ఉండేవారు కాదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఉన్న లాలూచీతోనే ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ కు కూడా ఓ ఛానల్ ఉందని..ఏబీఎన్ మీదే కాదు..ఏ ఛానెల్ మీద దాడి చేసినా..మా కార్యకర్తలు ఊరుకోరన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది ఉన్నారని..మావోళ్లు వందలమంది ఉన్నారన్నారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేసు, డ్రగ్స్ కేసు, ఫామ్ హౌస్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ వంటి కేసుల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడంలేదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. మూసీ నది ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..హైడ్రాలు ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ కళాశాలపై మాత్రం చర్యలు తీసుకోలేదని..కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

మీడియాపై బీఆర్ఎస్ దాడులు దుర్మార్గం: బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు

మీడియా సంస్థలపై బీఆర్ఎస్ దాడులు దుర్మార్గమని..మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే బీజేవైఎం కార్యకర్తలు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. మీడియా సంస్థలపై చేయి వేశారో టీ న్యూస్ చానల్ అంతు చూస్తామని అల్టిమేటం ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక తమ పార్టీకి సవాల్‌ అని చెప్పారు. బలమైన ప్రతిపక్షం ఉంటే ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలవలేదని అన్నారు. ఉప ఎన్నికలో గెలిచి గ్రేటర్‌లో బీజేపీ సత్తా చాటుతామని తెలిపారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ పెద్దగా దృష్టి సారించలేదని.. రానున్న స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని 25 రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర కమిటీ కూర్పుపై ముఖ్య నేతలతో చర్చించి.. అన్ని సామాజికవర్గాలకు..ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తామన్నారు. బీజేపీలో వర్గాలు లేవని.. అందరం పార్టీ లైన్‌లో ఐక్యంగా ముందుకెలుతామన్నారు.