ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపుపై నాలుగు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.

హైదరాబాద్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో జరుగనున్న సమావేశంలో తుమ్మడిహట్టిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తుమ్మడి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు నీరందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామని, ప్రత్యామ్నయా మార్గాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

బుధవారం ఉదయం కుందన్ బాగ్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో తుమ్మిడిహాట్టి నుండి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు మెడిగడ్డ,సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణ పనులపై మంత్రి ఉత్తమ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, సీఎంతో జరిగే సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికీ నీటిని తరలించేందుకు గాను
ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలని ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ కు బాధ్యత అప్పగించామని ఉత్తమ్ తెలిపారు. వారు నాలుగు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ముందుకు వచ్చిన నాలుగు ప్రతిపాదనలపై ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతీ ప్రతిపాదనకు అయ్యే ఖర్చు అనుకూల, ప్రతీకూల పరిస్థితిలపై అధ్యయనం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తో జరగనున్న ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆ నాలుగు ప్రతిపాదనలపై సమీక్షించి తగు నిర్ణయం తీసుకొనున్నట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణకు అవసరమైన పరీక్షలన్నింటినీ వర్షాకాలం ప్రారంభం లోపు పూర్తి చేయాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో విధిగా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ప్రతీ 1.5 మీటర్ల దూరంలో ఎస్.పీ.టి పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. అదే విదంగా ప్రతీ మూడు మీటర్ల దూరంలో పెర్మిబిలిటి టెస్ట్ లు జరపాలి అన్నారు. బోర్లు వేస్తున్న సమయంలో రాయి వచ్చినా ఐదు మీటర్ల లోతుగా బోర్లు వేయాలన్నారు.బ్యారేజ్ ల పునరుద్ధరణ కోసం నియమించిన సమన్వయ కమిటి బ్యారేజ్ లను సందర్శించిన టైంలైన్ ను నిర్దేశించు కోవాలని ఆయన అధికారులకు చెప్పారు.సీడబ్ల్యూపీఆర్ఎస్ డైరెక్టర్ క్షేత్రస్థాయిలో ఉంటూ పునరుద్ధరణకు అవసరమైన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. అదే సమయంలో పునరుద్ధరణ కోసం జరుగుతున్న పరీక్షల పురోగతి పనుల వివరాలు ఎప్పటికప్పుడు ఎన్డీఎస్ఏకు నివేదించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖా కార్యదర్శిని ఆదేశించారు.

ఈ సమావేశంలో నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఈఎన్సీ రమేష్ బాబు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రోహిత్ శర్మ, ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

అంబులెన్స్‌కు ర‌క్త‌పు మ‌ర‌క‌లు.. పేషెంట్‌ భార్య‌తో శుభ్రం చేయించిన సిబ్బంది
దంచికొడుతున్న ఎండ‌లు.. సాయంత్రానికి మోస్త‌రు వ‌ర్షాలు..!

Latest News