Warangal | వరంగల్ ఎంజీఎం లో ‘విజిలెన్స్’ తనిఖీ

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ నిధుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం విజిలెన్స్ అధికారుల బృందం ఆకస్మికంగా ఎంజీఎం హాస్పిటల్ కు వచ్చి వివిధ రికార్డులను తనిఖీ చేశారు. విజిలెన్స్ బృందం తనిఖీ హాస్పిటల్ లో కలకలం సృష్టించింది.

Warangal | వరంగల్ ఎంజీఎం లో ‘విజిలెన్స్’ తనిఖీ

విధాత, వరంగల్ ప్రతినిధి:

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ నిధుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం విజిలెన్స్ అధికారుల బృందం ఆకస్మికంగా ఎంజీఎం హాస్పిటల్ కు వచ్చి వివిధ రికార్డులను తనిఖీ చేశారు. విజిలెన్స్ బృందం తనిఖీ హాస్పిటల్ లో కలకలం సృష్టించింది. ఇటీవల తరచూ ఎంజీఎం హాస్పిటల్ లో ఏదో ఒక సంఘటన కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విజిలెన్స్ బృందం ప్రధానంగా ఆరోగ్య శ్రీకి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆరోగ్య శ్రీ నిధులను అనవసర పనులకు వినియోగించినట్లు, నిధులలో అక్రమాలు జరిగాయని, దుర్వినియోగమయ్యాయని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాటిపై కేంద్రీకరించినట్లు సమాచారం. ఫిర్యాదుల పై ప్రభుత్వం స్పందించి ముందుగా విజిలెన్స్ ద్వారా విచారించేందుకు నిర్ణయించినట్లు చెబుతున్నారు.

దీనిలో భాగంగానే విజిలెన్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ ఎంజీఎం చేరుకొని రికార్డులను పరిశీలించారు. ఎంజీఎం హాస్పిటల్ లో గత 2021 నుంచి 2024 వరకు ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన ఆపరేషన్లు, వీటి ద్వారా వచ్చిన నిధుల వివరాలను నమోదు చేసిన రికార్డుల ఆధారంగా ఈ తనిఖీల్లో ప్రత్యేకంగా పరిశీలించారు. ముఖ్యంగా ఈ నాలుగేళ్ల కాలంలో ఎంజీఎం హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ కి సంబంధించి రూ. 30 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రతిరోజు హాస్పిటల్ లో డాక్టర్లు ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా సమకూరే నిధులను కొంత ఆసుపత్రి అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ఇందులో కొంత మొత్తం సంబంధిత ఆపరేషన్లలో భాగస్వామ్యమైన డాక్టర్లకు ఫీజు కింద అందిస్తారు. హాస్పిటల్ కు సమకూరిన నిధులను వినియోగించడంలో కొందరు అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ శాఖ ఈ తనికీలకు సిద్ధమైంది. గురువారం రెండు గంటల పాటు విజిలెన్స్ డిఎస్పీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలను నిర్వహించి అవసరమైన వివరాలు, రికార్డులను పరిశీలించారు. కొన్ని డాక్యుమెంట్లను తమ వెంట తీసుకువెళ్లారు. అవసరమైనప్పుడు మరిన్ని వివరాలు కోరుతామని చెప్పినట్లు చెబుతున్నారు. దీనిపై ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్రారెడ్డి స్పందిస్తూ ఆరోగ్యశ్రీ కి సంబంధించిన నిధుల వ్యవహారంపై విజిలెన్స్ టీమ్ వచ్చి పరిశీలించి వెళ్లారని తెలిపారు. ఇదంతా రొటీన్ గా జరిగే తనిఖీలేనని ఆయన చెప్పడం గమనార్హం.