• Telugu News
  • /Telangana

MP Kadiyam Kavya | ఉపాధి హామీ పథకంలో వరంగల్‌కు అన్యాయం : లోక్‌సభలో ఎంపీ కావ్య

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వరంగల్‌కు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఎంపీ కడియం కావ్య లోక్‌సభకు తెలిపారు. 125 రోజుల వరకూ ఉపాధి కల్పించే అవకాశం ఉన్నా.. ఆ విషయంలో జిల్లా వెనుకబడిందని చెప్పారు. పెండిగ్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Mar 24, 2026, 9:09 pm IST
Read Time: 3 mins
MP Kadiyam Kavya | ఉపాధి హామీ పథకంలో వరంగల్‌కు అన్యాయం : లోక్‌సభలో ఎంపీ కావ్య

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

MP Kadiyam Kavya | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వరంగల్‌కు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్‌లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) అమలులో లోపాలపై సోమవారం లోక్‌సభలో ప్రశ్నించారు.

ఈ పథకం కింద 125 రోజుల వరకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ, వరంగల్ జిల్లాలో ఆ లక్ష్యం సాధనలో తీవ్ర వైఫల్యం ఉన్నదని ఎంపీ పేర్కొన్నారు. 2023–24 సంవత్సరంలో 100 రోజులకు పైగా ఉపాధి పొందిన కుటుంబాలు 42 మాత్రమే ఉండగా, 2024–25లో అది మరింత తగ్గి 29 కుటుంబాలకు పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఖ్యలు రాష్ట్రం,దేశ సగటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని ఎంపీ కావ్య వివరించారు.

జిల్లాలో నీటి సంరక్షణ, ఫార్మ్ పాండ్లు, చెక్‌డ్యామ్‌లు, సాగునీటి, భూగర్భ జలాల పునరుద్ధరణకు సంబంధించిన పనులు చేపట్టినప్పటికీ గత రెండేళ్లలో 5,348 పనులు పూర్తయ్యాయని, రూ.65 కోట్లకు పైగా వ్యయం జరిగినప్పటికీ గ్రామీణ కుటుంబాలకు సరిపడ ఉపాధి కల్పించడంలో అసలు లక్ష్యం నెరవేరలేదని ఎంపీ పేర్కొన్నారు. 2025లో తీసుకొచ్చిన “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ)” చట్టం కింద 125 రోజుల ఉపాధి హామీ అమలు ఇంకా ప్రారంభం కాలేదని ఎంపీ తెలిపారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ హామీని అమలు చేయాలని, తెలంగాణలో పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో వరంగల్ జిల్లాలోని గ్రామీణ కుటుంబాలకు అదనపు పనిదినాలు, సమయానికి వేతనాలు లభించి జీవనోపాధి మెరుగుపడుతుందని ఎంపీ కావ్య స్పష్టం చేశారు.