• Telugu News
  • /Telangana

ఇక వరంగల్ బల్దియాలో స్పెషల్ ఆఫీసర్ పాలన

వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పదవీకాలం ముగిసింది. తదుపరి ఎన్నికలు నిర్వహించేంత వరకూ స్పెషల్‌ ఆఫీస్‌ పాలన కొనసాగనున్నది.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | May 06, 2026, 9:16 pm IST
Read Time: 7 mins
ఇక వరంగల్ బల్దియాలో స్పెషల్ ఆఫీసర్ పాలన

హైలైట్స్:

  • ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఖరు సమావేశం
  • రూ.76.56 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం కాలపరిమితి ముగిసిపోయింది. తిరిగి ఎన్నికలు జరిగే వరకు ఇక నుంచి కార్పొరేషన్‌లో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగనున్నది. పాలకవర్గం ఆఖరి సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో రూ. రూ. 76.56 కోట్ల అభివృద్ధి పనులతోపాటు ఎజెండాలో పొందుపరిచిన 20 అంశాలకు కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలియజేసింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు తదితరులు హాజరయ్యారు. హనుమకొండ జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. పాలకవర్గం కాలపరిమితితోపాటు ఆఖరు సమావేశం ముగిసినందున నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ఆఫీసర్ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చాహత్ బాజ్ పాయ్‌ను హనుమకొండ జిల్లా కలెక్టర్‌‌‌గా నియమించినప్పటికీ ప్రస్తుతం కమిషనర్ బాధ్యతలు కూడా ఆమె నిర్వహిస్తున్నారు. సాధారణంగా స్పెషల్ ఆఫీసర్ బాధ్యతల్లో కలెక్టర్‌ను నియమిస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కమిషనర్, కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న చాహత్ బాజ్‌పాయ్‌కే స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది.

ఐదేళ్ళలో వరంగల్ అభివృద్ధికి చర్యలు

ఐదేళ్ళ కాలపరిమితిలో వరంగల్ నగరాభివృద్ధికి కృషి చేసినట్లు ప్రకటించారు. కాలపరిమితి ముగిసిన ఆఖరు సమావేశంలో మేయర్, కార్పొరేటర్లు, ఇతర అధికారులు కాసింత బావోద్వేగానికి లోనయ్యారు. గత ఐదేళ్ళలో తమ విజయాలు, అపజయాలను నెమరువేసుకున్నారు. ఈ సమావేశంలో 20 అంశాలను చర్చించి ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లలో వరంగల్ నగరాన్ని సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించామని తెలిపారు. పార్టీలకు అతీతంగా పాలకవర్గం సమష్టిగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిందని అన్నారు. వరంగల్ ప్రజల దశాబ్దాల కల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు సాధించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో నగరానికి భారీగా నిధులు మంజూరై అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఐదేళ్లలో రూ.3331 కోట్ల వ్యయంతో వేలాది అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ పథకం ద్వారా ఆధునిక మౌలిక వసతులు, స్మార్ట్ రోడ్లు, జంక్షన్లు, చెరువుల సుందరీకరణ వంటి పనులు నగరానికి కొత్త రూపును తెచ్చాయని చెప్పారు. తాగునీటి సమస్యను అధిగమించి ప్రతిరోజూ నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని, పారిశుద్ధ్య రంగంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని వెల్లడించారు.

రూ.100 కోట్ల ఎస్పీవీ నిధులతో రోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జులు, చెరువుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రూ.25 కోట్ల స్పెషల్ ఫండ్, రూ.550 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో వరద నివారణ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఖిలా వరంగల్ ఔటర్ మోటు అభివృద్ధి ద్వారా వరద ముప్పు తగ్గించనున్నామని వెల్లడించారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని, నగరాన్ని దేశ స్థాయిలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి విషయంలో మనందరం సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని, నగరానికి సంబంధించిన ప్రతి సమస్యను ప్రాధాన్యతతో తీసుకుని, వేగంగా పరిష్కరించే దిశగా అధికారులు కట్టుబడి పనిచేయాలని అన్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి కీలక ప్రాజెక్టులు సమయానికి పూర్తయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయనున్నట్లు అన్నారు. ఈ సమావేశంలో అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.