Nagarjuna Sagar Project | రేపు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల..
తెలుగు రాష్ట్రాల ప్రధాన జలవనరుల్లో ఒకటైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం సాయంత్రం 4గంటలకు నీటి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రధాన జలవనరుల్లో ఒకటైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం సాయంత్రం 4గంటలకు నీటి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, బి.లక్ష్మారెడ్డి తదితరులు ఎడమ కాలువ ఆయకట్టుకు నీటి విడుదల కార్యక్రమానికి హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం జలాశయం నుంచి భారీ వరద నీటి రాకతో సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండగా, ఎడమకాలువ ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నారు. దీంతో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని ఆయకట్టు రైతాంగం పంటల సాగుకు సాగునీరందనుంది.