CM Revanth Reddy| వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy| వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

వనమహోత్సవం ప్రారంభించిన సీఎం
ఈ ఏడాది 18కోట్ల మొక్కలు నాటాలని పిలుపు

విధాత, హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ రాబోతుందని..రాష్ట్రంలో 60 ఎమ్మెల్యే సీట్లు మహిళలకు ఇచ్చే బాధ్యత నాదే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం వనమహోత్సవం-2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రుద్రాక్ష మొక్కను నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో రాబోయో 153సీట్లలో 33శాతం రిజర్వేషన్ తో 51సీట్లు మహిళలకు రిజర్వ్ కాబడుతాయని..వాటితో పాటు మరిన్ని కలిపి 60సీట్లు మహిళలకు కేటాయిస్తామన్నారు. ఇంటిని అద్భుతంగా నడిపే ఆడబిడ్డలు.. రాజ్యాన్ని కూడా నడుపుతారనే నమ్మకముందన్నారు. వనమే మనం..మనమే వనం అని పెద్దలు చెప్పారని..ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందన్నారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని..అమ్మలు కూడా పిల్లల పేరుతో మొక్కను నాటాలని..ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని కోరారు. మీ పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆడబిడ్డలను అన్ని రంగాల్లో అగ్రభాగన నిలుపుతాం

బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూసిందని..ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలించారని..రాజీవ్‌గాంధీ తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్లే మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోందని..సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించాయమన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు..ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశామని గుర్తు చేశారు. హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండేచోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. స్వయం సహాయక సంఘాలలో 65లక్షల మంది ఉన్నారని..ఈ సంఖ్యను కోటికి పెంచుతామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని..పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడాను మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు రుణాలు అందించామని తెలిపారు. అన్ని రంగాల్లో ఆడబిడ్డలను ముందు భాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నామని..ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూసింది. ఐదేళ్ల పాటు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, అధికారులు పాల్గొన్నారు.