HYDRA Report | నెలరోజుల పురోగతిపై ప్రభుత్వానికి ‘హైడ్రా’ నివేదిక
HYDRAA | హైదరాబాద్: అక్రమనిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా తన నివేదికను సమర్పించింది. 10 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. ఎవరెవరి అక్రమ కట్టడాలను కూల్చేసారో వారి వివరాలను, కూల్చిన వారి కట్టడాల వివరాలను సవివరంగా ఆ రిపోర్టులో పేర్కొంది.

హైదరాబాద్‌లో గత నెలరోజుల్లో హైడ్రా (HYDRAA – Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency) చేపట్టిన కూల్చివేతలపై ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చేసారో, వాటి యజమానులెవరో ఇందులో పేర్కొంది. వారిలో ఏపీ మాజీ ఎంపీ పల్లంరాజు, సినీ ప్రముఖుడు అక్కినేని నాగార్జున, సునీల్‌రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, ప్రొకబడ్డీ యజమాని అనుపమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా ఆ రిపోర్టులో వెల్లడించింది. ప్రాంతాలవారీగా చూస్తే, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, ఆమీర్పేట్లలోని అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసినట్లు హైడ్రా పేర్కొంది.
రిపోర్టులోని అంశాల ప్రకారం, 18 చోట్ల అక్రమ నిర్మాణాల(illegal constructions at 18 places) కూల్చివేతలతో 43 ఎకరాల(Saved 43 Acres) స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఇందులో నందినగర్‌లో ఒక ఎకరం స్థలం, లోటస్‌పాండ్‌లో పార్కు ప్రహరీగోడ ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మనసురాబాద్ సహారా ఎస్టేట్, ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం, మిథాలీ నగర్‌లో పార్కు స్థలం, బీజేఆర్ నగర్‌లో నాలా కబ్జా, గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం, గాజుల రామారావు భూదేవి హిల్స్‌లో చెరువు ఆక్రమణలను చేసిన భవనాలు, బంజారా హిల్స్‌లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం, చింతల్ చెరువులో అక్రమనిర్మాణాలు, నందగిరి హిల్స్‌లో ఎకరం స్థలం. వీటన్నింటినీ హైడ్రా కబ్జాకోరల నుండి కాపాడి అక్కడి అక్రమ నిర్మాణాలను కూలగొట్టింది.
కాగా నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender)పై కేసు నమోదు చేసినట్లు హైడ్రా తెలిపింది.
హైదరాబాద్‌లో ‘హైడ్రా’ చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని గమనించిన ప్రభుత్వం, ఇదే వ్యవస్థను అన్ని జిల్లాల్లో(HYDRAA type systems in All districts) అమలు చేయాలని నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. అక్రమ నిర్మాణాలను, కబ్జాలను అరికట్టడం, ఆక్రమణలను తొలగించడం, కొత్తగా కబ్జాలు జరగకుండా కాపాడటం వంటివి అంతటా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఇందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఎక్కడ చెరువుల ఆక్రమణలు జరిగినట్టు గుర్తించినా ప్రభుత్వానికి ఫిర్యాదు(Complaint to Govt) చేయాలంటూ ప్రజలకు విడియో ద్వారా విజ్ఞప్తి చేసారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ గౌతం తదితర అధికారులు రాష్ట్రంలోని ఇతర నగరాల్లోని పరిస్థితిపై సమీక్ష కూడా జరిపినట్టు తెలిసింది. అన్ని జిల్లాల్లోని అక్రమ నిర్మాణాల వివరాలు తెలుసుకునే క్రమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగైతే త్వరితగతిన సమాచారం అందుతుందని, తర్వాత దాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి, చర్యలకు ఉపక్రమించొచ్చని ప్రభుత్వ ఆలోచనగా అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఇతర నగరాల్లో ‘హైడ్రా’తరహా వ్యవస్థల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ప్రకటన చేయవచ్చని తెలియవచ్చింది.