Kaleswaram Project : కాళేశ్వరం కొట్టుకుపోతే జరిగే విధ్వంసం ఎంతో తెలుసా?
బీఆర్ఎస్ నాయకుల చౌకబారు విమర్శలను పట్టించుకుంటే భవిష్యత్తులో బారాజ్ లు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. దాని ఫలితంగా దిగువన ఉన్న 28 గ్రామాలు నామరూపాలు లేకుండా పోతాయన్నారు. గిరిజన ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క, సారక్క గద్దెలు, భద్రాచలం పూర్తిగా కనుమరుగు అవుతాయన్నారు.

Kaleswaram Project : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మీ బరాజ్) బారాజ్‌లో మూడు పియర్స్ కుంగిపోయాయని, అందువల్లే వినియోగించడం లేదని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ దుర్ఘటనపై శాస్త్రీయ విచారణ జరపకుండా యథాలాపంగా బారాజ్‌ను వినియోగిస్తే భవిష్యత్తులో పెనుముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. నిపుణుల నివేదికను బుట్టదాఖలు చేసి, బీఆర్ఎస్ నాయకుల చౌకబారు విమర్శలను పట్టించుకుంటే భవిష్యత్తులో బారాజ్ లు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. దాని ఫలితంగా దిగువన ఉన్న 28 గ్రామాలు నామరూపాలు లేకుండా పోతాయన్నారు. గిరిజన ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క, సారక్క గద్దెలు, భద్రాచలం పూర్తిగా కనుమరుగు అవుతాయన్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని జ్యుడిషియల్ విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) కూడా సాంకేతికంగా నివేదిక ఇస్తుందన్నారు.
నివేదిక తర్వాతే చర్యలు
ఎన్‌డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ప్రకారం ప్రాజెక్టు డిజైన్ లోపం, నిధుల దుర్వినియోగం, ఇంజినీర్ల బాధ్యతారాహిత్యం స్పష్టంగా ఉందన్నారు. తుది నివేదిక అందిన తరువాత చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రముఖ సంస్థ అని మంత్రి చెప్పారు. దానికన్నా తామే నిపుణులం అనే విధంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అర్థపర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం నిపుణుల కమిటీ నివేదిక ప్రకారమే చర్యలు తీసుకుంటుందని, ప్రజల ప్రయోజనాలను కాపాడడం తమ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం నుంచి నీటిని వదలకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న వర్షాకాలంలో బరాజ్‌లు దెబ్బతిని కూలిపోతే బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖరారు చేసిన తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని, అనుమతులు వచ్చిన తరువాత పనులు ప్రారంభిస్తామని ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ పనులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మెయిల్) దక్కించుకుని, ప్యాకేజీల వారీగా సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. మేడిగడ్డ బరాజ్ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తీసుకున్న విషయం తెలిసిందే.
బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు రూ.36వేలు కోట్లు అడిగాం
అసెంబ్లీలో ఈ నెల 19న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025-26లో సాగునీటి పారుదల శాఖకు రూ.36వేల కోట్లు కేటాయించాలని కోరామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో రూ.10 కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీ చెల్లించడానికే వెచ్చిస్తున్నామన్నారు. మిగతా రూ.26వేల కోట్లను ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, భూ సేకరణకు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో చిన్న చిన్న పనులతో ఆగిన ప్రాజెక్టులను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్నారు.