Telangana । కాళేశ్వరం లేకున్నా తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం.. ధాన్యం దిగుబడిలో రికార్డు

కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండానే ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల కింద రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. ఈ వానాకాలంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు.

Telangana । కాళేశ్వరం లేకున్నా తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం.. ధాన్యం దిగుబడిలో రికార్డు

Telangana । కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండానే ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల కింద రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. ఈ వానాకాలంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు. యాసంగిలో కూడా 42.11లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం ఇటీవలే సాగునీటి ప్రణాళికను విడుదల చేయటం గమనార్హం. లక్ష కోట్లతో అప్పటి ప్రభుత్వం నిర్మించి కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లు కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు.

నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులపై ముందుగా ఫోకస్ చేసింది. రూ.241 కోట్ల ఖర్చుతో దాదాపు 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేలా పనులు ప్రారంభించింది. 2025 మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని టార్గెట్​గా పెట్టుకుంది. గోదావరి బేసిన్ లో ఉన్న చిన్న కాళేశ్వరం, మోదికుంట, లోయర్ పెన్ గంగా, చనాక కోరాట, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టు, కృష్ణా బేసిన్ లో కోయిల్​సాగర్​, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ పనులు ఈ ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసే దేవాదుల ఎత్తి పోతల ప్రాజెక్టుకు అవసరమైన 2,947 ఎకరాల భూసేకరణ చేపట్టి.. 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్ట్ 15వ తేదీన ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం 482.87 కోట్లతో ఎనిమిది నెలల్లోనే పూర్తి చేసింది. 9 కిలోమీటర్ల రాజీవ్​ లింక్ కెనాల్ ద్వారా సీతారామ నీటిని నాగార్జునసాగర్ కెనాల్ కు అనుసంధానం చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించింది.