విధాత : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఫ్లాంట్ ఉద్యోగులు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసనలకు దిగారు. విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు థర్మల్ పవర్ ప్లాంట్ ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు హ్యాండ్లింగ్ ప్రైవేటీకరణ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణను మిగులు విద్యుత్తు రాష్ట్రంగా చేసేందుకు ఏర్పాటు చేసిన వైటీపీఎస్‌ను ఉద్యోగుల కొరతను సాకుగా చూసి ప్రైవేటీకరణ చేయడం సరికాదని మండిపడ్డారు. స్థానికులు ప్రైవేటీకరణకు వ్య తిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి వెంటనే టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని, లేకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ యాదాద్రి ఫ్లాంట్ తో మొదలైన ప్రైవేటీకరణ రేపు అన్ని పవర్ ప్లాంట్లకు విస్తరించే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా ప్రైవేటీకరణకు దీనిని తొలి అడుగుగా భావించవచ్చంటూ ఉద్యోగులు ఆందోళన వెలిబుచ్చారు.
ప్రైవేటీకరణతో ఆంధ్రా పెత్తనం
మూడేళ్ల కాల పరిమితితో, రూ.255 కోట్ల వ్యయంతో పవర్ ప్లాంట్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. జూన్ 12వ తేదీన మొదలైన టెండర్ల ప్రక్రియ.. జూన్ 29వ తేదీన ముగియనుంది. జూలై 2వ తేదీన టెండర్లు ఓపెన్ చేయనున్నారు. అయితే ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్రా కంపెనీల చేతిలోకి వెళ్లిపోతుందని, ఆంధ్రా పెత్తనం పెరిగిపోతుందని ఫ్లాంటులోని 1300 మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద పవర్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌కు అప్పగిస్తే స్థానికుల ఉద్యోగాల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇంకా 700మందికి ఉద్యోగాలు రావాల్సి ఉన్నదని తెలిపారు.
ప్రస్తతం 4వేల మెగావాట్ల ఉత్పత్తి
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో సుమారు 4600 ఎకరాలలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రూ.25,099 కోట్లతో అంచనా వ్యయంతో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించాలని భావించారు. జెన్‌కో ఆధ్వర్యంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల కెపాసిటీతో 5 యూనిట్లు నిర్మించాల్సి ఉంది. రైతుల నుంచి 700 ఎకరాలు, ఫారెస్ట్ నుంచి 1200 ఎకరాలు తీసుకున్నారు. 2015 జూన్ 6 నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు వాస్తవానికి ఇది 2022కల్లా పూర్తికావాల్సి ఉంది. ఫ్లాంటు నిర్మాణానికి భూసేకరణ, పర్యావరణ అనుమతులు, పనుల జాప్యంతో ఇప్పుడు నిర్మాణ వ్యయం పెరిగిపోయి.. సుమారు రూ.37,871 కోట్లకు వెళ్ళింది. దేశంలోనే అతిపెద్ద నాలుగో థర్మల్ ప్రాజెక్టుగా నిర్మితమవుతున్న ఈ ఫ్లాంట్ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్లాంటులో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. అత్యాధునిక ‘సూపర్ క్రిటికల్’ టెక్నాలజీని ఉపయోగించడంతో విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు వినియోగం, కాలుష్యం తగ్గి పర్యావరణ సమస్యలు తగ్గనున్నాయి. ఫ్లాంటు నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో యాదాద్రిలో ఉత్పత్తయ్యే కరెంటు యూనిట్‌కు సగటున రూ.5.50 నుంచి రూ.6 అవుతుంది. బయటి మార్కెట్‌లో రూ.4 నుంచి రూ.5కే లభిస్తోంది. వేసవి కాలంలో విద్యుత్తుకు ఉండే పీక్ డిమాండ్ సమయంలో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ ను అందించడంలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తోంది.
