జంతువులు వ్యవహరించే తీరు ఒక్కోసారి ఆశ్చర్యానికే కాదు.. విస్మయానికీ గురి చేస్తుంటాయి. అలాంటి ఘటనే నేపాల్‌లో జూలై 3వ తేదీన చోటు చేసుకున్నది. మదమెక్కిన ఒక గజరాజు.. 14 ఏళ్ల క్రితం ఒక కుటుంబంలో ఇద్దరిని చంపింది. మళ్లీ పద్నాలుగేళ్ల తర్వాత అదే కుటుంబంలో మరో ఇద్దరిని బలితీసుకుంది. అది కూడా ఆ ఏనుగు చర్యలకు భయపడి ఆ ప్రాంతం నుంచి 17 కిలోమీటర్ల అవతల నివసిస్తున్న కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని వెతికి మరీ దాడి చేయడం విస్మయానికి గురి చేస్తున్నది. అంతేకాదు.. ఈ 17 కిలోమీటర్ల దూరంలో మధ్యలో రెండు నదులు కూడా ఉన్నాయి. వాటిని కూడా దాటుకొని వచ్చి, దాడి చేసింది. ఈ మేరకు ఖట్మాండు పోస్ట్‌లో ఒక ఆసక్తికర కథనం ప్రచురితమైంది. ధుర్బే అనే ఈ మద గజం.. శానిచార బోటె తల్లి, తండ్రి.. బుధీరామ్, ఝారాళిలను 2012 డిసెంబర్ 16వ తేదీన దాడి చేసి చంపేసింది. చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఈ కుటంబం రెండు నదులు దాటిన తర్వాత వచ్చే జగతాపూర్‌కు మారింది. కానీ.. ఆ ఏనుగు ఆ కుటుంబాన్ని వెతుక్కుంటూ జూలై 4వ తేదీన జగతాపూర్‌కు వచ్చి, వారు నివాసం ఉంటున్న ఇంటిపైకి తెగబడి.. బోటె కోడలు (25), మనుమడిని (4) చంపేసింది.
చరిత్ర మొత్తం హింసాత్మకమే
చిత్వాన్ నేషనల్ పార్క్.. నేపాల్‌లోనే తొలి రక్షిత ప్రాంతం. ధుర్బే గత చరిత్ర కూడా హింసాత్మకమే. 2010లో మొట్టమొదటిసారి ఒక వ్యక్తిని ఇది చంపింది. ఈ ప్రాంత వాసులకు దీని ఆగడాలు బాగానే తెలుసు. తొలిసారి మనిషిని చంపిన తర్వాత అధికారులు తగిన చర్యలు తీసుకోలేదు. ఫలితంగా అప్పటి నుంచి ఇప్పటి వరకూ బోటె కుటుంబ సభ్యులు నలుగురు సహా 25 మందిని అది బలితీసుకుంది. ఈ ఏనుగు భయంతోనే తాము ఉన్నవన్నీ అమ్ముకొని జగతాపూర్‌కు వలస వచ్చామని బోటె చెప్పాడు. ‘రెండు ప్రధాన నదులు దాటుకొని వచ్చాం కాబట్టి.. అంతా బాగానే ఉంటుందని భావించాం. కానీ.. ఇన్నేళ్ల తర్వాత అదే ఏనుగు.. మమ్మల్ని మళ్లీ వెతుక్కుంటూ వచ్చింది. మా ఇంటిమీద దాడి చేసి, నా కోడలిని, నా చిన్నారి మనుమడిని చంపింది’ అని ఆయన వాపోయారు.
ఆ రోజు రాత్రి ఏం జరిగింది..
ఘటన జరిగిన రోజు రాత్రి.. బోటె భార్య ఎవరో ఇంటి గోడను బలంగా కొడుతున్నట్టు గుర్తించింది. ఆమె బయటకు రాగానే.. ఆ మట్టి గోడలు కూలిపోయాయి. బోటె కోడలు తన కుమారుడిని తీసుకుని బయటకు వచ్చింది. వెంటనే వాళ్లిద్దరిని ఏనుగు తొక్కి చంపేసింది. దీంతో భయపడిన బోటె భార్య.. ఎండుగడ్డికి నిప్పు పెట్టి దానిని తరిమేసినా.. ఆ ప్రయత్నంలో వారి ఇల్లు కాలిపోయింది.
ఆ ఏనుగు ప్రమాదకరంగా మారింది ఇందుకే…
ధుర్బేను చిన్నప్పడే దాని మందలోని బలమైన మగ ఏనుగులు బయటకు నెట్టేశాయి. దీంతో అది ఒంటరిగా తిరుగుతూ ఉండేది. ఆహారం కోసం జనావాసాల మీదకు వచ్చేది. ఈ క్రమంలోనే అత్యంత దుందుడుకు స్వభావం ఏర్పర్చుకున్నదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని నియంత్రించేందుకు శాటిలైట్ ట్రాకింగ్ కాలర్ ఏర్పాటు చేశామని, ఘటన జరిగిన శనివారం సాయంత్రం అది బాధితుల ఇంటి వద్ద లొకేషన్ చూపించిందని చిత్వాన్ నేషనల్ పార్క్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, కన్జర్వేషన్ అఫిషియల్ అభినాశ్ తాపా మాగర్ చెప్పారు.
ట్రాకింగ్ కాలర్ ఉన్నా..
వన్యమృగాల వేటను నిరోధించేందుకు, పార్క్ భద్రతా విధుల నిమిత్తం నియమించిన ఇద్దరు మిలిటరీ సిబ్బందిని సైతం ధుర్బే వేర్వేరు ఘటనల్లో చంపింది. బొటె తల్లిదండ్రులను 2012లో చంపిన తర్వాత సమావేశమైన ఉన్నతస్థాయి ఎమర్జెన్సీ సెక్యూరిటీ సమావేశంలో మద గజాన్ని చంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దానిని వెతికిన అధికారులు దాన్ని గాయపర్చినా.. అది తప్పించుకుని పారిపోయింది. నాలుగేళ్లుగా జాడ లేకపోవడంతో చనిపోయి ఉంటుందని భావించారు. కానీ.. 2016లో ధుర్బే మళ్లీ బయటకు వచ్చింది. 2020లో ఒకసారి, 2023లో మరోసారి ట్రాకింగ్ కాలర్‌ను అమర్చారు. అయితే.. దాని నుంచి వివరాలు గంట తర్వాత మాత్రమే అందుతాయి.
