Viral Marriage | చైనాలో ఓ అరుదైన వివాహం ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. 55 ఏళ్ల మహిళా వ్యాపారవేత్త యూ వెన్‌హాంగ్ తన కంటే 30 ఏళ్లు చిన్నవాడైన 25 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకుంది. అంతేకాదు ఆ పెళ్లి కోసం దాదాపు ఆమె 68 కోట్ల విలువైన ఆస్తులు, నగదును కట్నంగా ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.
తన కంపెనీలో పనిచేసే మోడల్ లియు యుచెన్‌ను యూ వెన్‌హాంగ్ గత నెలలో పెళ్లి చేసుకుంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. లియుతో యూ వెన్‌హాంగ్‌కు 2025లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. డేటింగ్ సమయంలోనే ఆమె రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు సుమారు 68 కోట్లు కట్నం ఇచ్చి మరీ గత నెలలో అతన్ని వివాహం చేసుకుంది.
ఈ వివాహం ఇప్పుడు సోషల్‌మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇది ఆమెకు తొలి వివాహం ఏమీ కాదు. గతంలో ఆమె ఐదుసార్లు వివాహం చేసుకుంది. ఐదో భర్త అల్బేనియన్ మోడల్ రోలాండో లెకాజ్‌తో పదేళ్ల పాటు వివాహ బంధాన్ని కొనసాగించింది. గత సంబంధాల ద్వారా ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉండటం గమనార్హం.
ఇక యూ వెన్‌హాంగ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె లియోనింగ్ ప్రావిన్స్‌లోని డాలియన్ ప్రాంతానికి చెందిన ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తన తండ్రి మరణించడంతో చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది. 18 ఏళ్ల వయసులోనే ఆమె ఉద్యోగంలో చేరింది. ఐబ్రో టాటూ టెక్నీషియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత సొంతంగా బ్యూటీ సెలూన్ ప్రారంభించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది.
అలా 2004లో హాంకాంగ్ కేంద్రంగా యంగ్ మేరీ రియల్ ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థను స్థాపించింది. అనదికాలంలోనే మెడికల్ ఎస్తెటిక్స్ రంగంలో పైకి ఎదిగింది. శస్త్ర చికిత్స అవసరం లేకుండా అందాన్ని మెరుగుపరిచే చికిత్సలను అందిస్తూ వ్యాపారాన్ని విస్తరించింది. కొద్దికాలంలోనే వందలాది భాగస్వామ్య కేంద్రాలను ఆమె ఏర్పాటు చేసింది.
అయితే ఆమె ఎంతగా ఎదిగిందో.. దాని వెనుక అన్నే వివాదాలు కూడా ఉన్నాయి. పోర్సిలిన్ డాల్ వంటి చికిత్స విధానంపై వివాదాలు చెలరేగాయి. అలాగే 2022లో పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. సుమారు 4.7 బిలియన్ యువాన్ల ఆదాయాన్ని దాచిపెట్టినట్లు ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు యూ వెన్‌హాంగ్ వివాహం సోషల్‌మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
డబ్బున్న అబ్బాయిలు పేదింటి అమ్మాయిలను పెళ్లి చేసుకునే సంఘటనలతో దీన్ని కొంతమంది పోల్చారు. మరికొందరు దీన్ని జెండర్ రివర్స్ మ్యారేజిగా అభివర్ణిస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు వెన్‌హాంగ్ వరుస వివాహాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లికి ముందు ఒప్పందం ఏమైనా చేసుకుంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది.
Read More:
అమ్మో.. ఇంత శాడిస్టులా! పక్కింటోళ్లకు దెయ్యాల కథలు వినిపిస్తూ టార్చర్!
