Bengaluru Couple | రామసేతు మార్గంలో శ్రీలంక నుంచి భారత్‌కు 32 కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చి బెంగళూరు టెక్కీ జంట చరిత్ర సృష్టించింది. కేవలం 10 గంటల 45 నిమిషాల్లోనే ఈ సాహస యాత్ర పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన తొలి జంటగా నిలిచింది.
కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగులైన డానిష్ అబ్దీ, వృషాలి ప్రసాద్ అనే దంపతులు మే 7వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రీలంకలోని తలైమన్నార్ తీరంలో సముద్రంలోకి దిగారు. అక్కడి నుంచి చారిత్రక ప్రాధాన్యత కలిగిన రామసేతు మార్గంలో తమ ఈత ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 10 గంటల 45 నిమిషాల తర్వాత.. మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్‌లోని ధనుష్కోడికి చేరుకున్నారు. ఈ ప్రయాణం మొత్తం పాక్ జలసంధి మార్గంలోనే కొనసాగింది.
వీరి ప్రయాణం అంత సులువుగా సాగలేదు. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగిసిపడటం, గాలులు దిశ మారడం, బలమైన నీటి ప్రవాహాలు వంటి అనేక సవాళ్లు వారికి ఎదురయ్యాయి. కొన్ని సందర్భాల్లో సముద్ర ప్రవాహంతో వీరి దారి మళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా, ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ సముద్ర యాత్రకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో సూర్యోదయానికి ముందే హిందూ మహాసముద్రంలోకి దూకేందుకు సిద్దమవుతుండగా.. మరికొన్ని వీడియోల్లో అలలతో పోరాడుతూ ఈదుతున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఈ యాత్ర మొత్తం కఠినమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. సహాయక బోట్లు, పారామెడికల్ సిబ్బంది, భారత తీరరక్షకదళ అధికారులు ఈ జంటకు పూర్తిగా సహకారం అందించారు.
నాలుగేళ్ల క్రితమే ఈత నేర్చుకుని..
డానిష్, వృషాలి దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. రొటీన్ లైఫ్‌తో విసిగిపోయిన వీరు ఒకసారి మాల్దీవుల పర్యటనకు వెళ్లడమే వీరిలో కీలక మార్పు తీసుకొచ్చింది. అక్కడ బీచ్‌లో సేదతీరుతున్నప్పుడు చిన్నపిల్లలు సైతం స్వేచ్ఛగా ఈదుతున్నారు. కానీ వారు మాత్రమే లైఫ్ జాకెట్లతో ఉన్నారు. అది వారిని ఆలోచనలో పడేసింది. దీంతో ఎలాగైనా ఈత నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా నాలుగేళ్ల క్రితమే ప్రొఫెషనల్ స్థాయిలో స్విమ్మింగ్ శిక్షణను ప్రారంభించారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక నుంచి భారత్‌కు ఈదుకుంటూ వచ్చారు.
ఈ సాహసానికి ముందు ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది. “శ్రీలంక నుంచి భారత్‌కు ఈదిన తొలి జంటగా నిలవబోతున్న రోజు ఇది. మా శిక్షణ, కృషి మొత్తం ఈ సాహసంలో పరీక్షించబడుతుంది. మేం సిద్ధంగా ఉన్నాం” అని అందులో పేర్కొంది. ఆ తర్వాత తమ విజయాన్ని కూడా సోషల్‌మీడియాలో పంచుకుంది. స్కిల్స్ నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని.. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సరిపోతుందని నిరూపించడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు.
Read More:
అనకొండతో సింహాల పోరాటం..వైరల్ వీడియో
సాధారణ మనిషిలాగే విమానం ఎక్కి వెళ్లిన రోబో.. అమెరికాలో విచిత్ర ఘటన
