LTTE ప్రభాకరన్‌ బతికి ఉన్నాడనేందుకు సాక్ష్యమేది?.. రంగంలోకి కేంద్ర సంస్థలు!

ఆరా తీసేందుకు రంగంలోకి కేంద్ర సంస్థలు ఇప్పటికే టీమ్‌ ఏర్పాటు చేసిన తమిళ పోలీస్‌ రేపోమాపో నెడుమారన్‌ను ప్రశ్నించే అవకాశం విధాత: ఎల్‌టీటీఈ సుప్రీం వేలుపిళ్లై ప్రభాకరన్‌ బతికే ఉన్నాడని, త్వరలోనే బయటకు వస్తాడని తమిళ వృద్ధ నేత పళ నెడుమారన్‌ చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర సంస్థలు సిద్ధమవుతున్నాయి. నెడుమారన్‌ వెల్లడించిన అంశాలు దేశంలోనే సంచలనం రేపాయి. అదే సమయంలో నిఘా సంస్థలు కూడా ఉలిక్కిపడ్డాయి. ప్రభాకరన్‌ చనిపోయాడని, ఆయన డీఎన్‌ఏ నమూనాలు కూడా […]

LTTE ప్రభాకరన్‌ బతికి ఉన్నాడనేందుకు సాక్ష్యమేది?.. రంగంలోకి కేంద్ర సంస్థలు!
  • ఆరా తీసేందుకు రంగంలోకి కేంద్ర సంస్థలు
  • ఇప్పటికే టీమ్‌ ఏర్పాటు చేసిన తమిళ పోలీస్‌
  • రేపోమాపో నెడుమారన్‌ను ప్రశ్నించే అవకాశం

విధాత: ఎల్‌టీటీఈ సుప్రీం వేలుపిళ్లై ప్రభాకరన్‌ బతికే ఉన్నాడని, త్వరలోనే బయటకు వస్తాడని తమిళ వృద్ధ నేత పళ నెడుమారన్‌ చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర సంస్థలు సిద్ధమవుతున్నాయి. నెడుమారన్‌ వెల్లడించిన అంశాలు దేశంలోనే సంచలనం రేపాయి. అదే సమయంలో నిఘా సంస్థలు కూడా ఉలిక్కిపడ్డాయి.

ప్రభాకరన్‌ చనిపోయాడని, ఆయన డీఎన్‌ఏ నమూనాలు కూడా సరి పోలాయని, ఆయన బతికి ఉండే అవకాశమే లేదని శ్రీలంక ఆర్మీ అధికారులు విస్పష్టంగా తేల్చి చెబుతున్నా.. నెడుమారన్‌ సంచనల నాత్మకంగా చేసిన ప్రకటనతో తమిళనాడు ‘క్యూ’ బ్రాంచ్‌ పోలీసులతో కలిసి కేంద్ర సంస్థలు దర్యాప్తునకు సమాయత్తమవుతున్నాయని సమాచారం.

ఎల్‌టీటీఈ వ్యవహారం ఆయనకు కొట్టిన పిండి

నెడుమారన్‌ సీనియర్‌ తమిళ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం వరల్డ్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ తమిళ్స్‌ అనే సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రభాకరన్‌కు, తమిళ ఉద్యమానికి దీర్ఘకాలం సన్నిహితంగా మెలిగారు. ఎల్‌టీటీఈ, ఇతర తమిళ సంస్థల పని విధానంపై ఆయనకు పూర్తి అవగాహన ఉన్నదని చెప్తుంటారు.

ఈ కారణంగానే నెడుమారన్‌ వ్యాఖ్యలను కేంద్ర సంస్థలు తేలిగ్గా కొట్టిపారేయడం లేదని తెలుస్తున్నది. సోమవారం తమిళనాడులోని తంజావూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో నెడుమారన్‌ మాట్లాడుతూ, ప్రభాకరన్‌, ఆయన భార్య, కుమార్తె క్షేమంగా ఉన్నారని, తగిన సమయంలో ఆయన బయటకు వస్తారని చెప్పిన విషయం తెలిసిందే.

నేడో రేపో నెడుమారన్‌ను ప్రశ్నించే అవకాశం

నెడుమారన్‌ వ్యాఖ్యలపై ఇప్పటికే తమిళనాడు ఇంటెలిజెన్స్‌ అధికారులు ఒక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ బృందానికి ఏడీజీపీ ఇంటెలిజెన్స్‌ డేవిడ్‌సన్‌, డీఐజీ సెంథిల్‌వేలన్‌, క్యూ బ్రాంచ్‌ ఎస్‌పీ కన్నమల్‌ నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర సంస్థలు కూడా తమ పని మొదలు పెట్టాయి. త్వరలోనే నెడుమారన్‌ను దర్యాప్తు సంస్థలు ప్రశ్నించే అవకాశం ఉన్నదని సమాచారం. నెడుమారన్‌, ఆయన సన్నిహితులపై ఒక కన్నేసి ఉంచారు.

అంతకు ముందే ఇదొక ట్విస్టు!!

శ్రీలంక సైన్యంతో పోరాటంలో ఎల్‌టీటీఈ దారుణంగా దెబ్బతిన్నది. ఒక విధంగా టైగర్స్‌ను వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల నుంచి ఊడ్చేశారు. అయితే.. ఎల్‌టీటీఈని పునర్జీవింప చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే 2021 అక్టోబర్‌లో తమిళనాడు పోలీసులు శాంతుకమ్‌ అలియాస్‌ సబేషన్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌, ఏకే 47 తుపాకులను స్మగుల్‌ చేస్తున్నాడనేది ఆయనపై అభియోగం.

సదరు సబేషన్‌ అనే వ్యక్తి ఎల్‌టీటీఈ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పొట్టు అమ్మన్‌కు అత్యంత సన్నిహితుడు. ఇదంతా ఎందుకు చేస్తున్నవు అని అడిగితే.. ఎల్‌టీటీఈని పునర్జీవింపచేసేందుకు అవసరమైన నిధులు కూడగట్టేందుకని చెప్పాడట. సుమారుగా ఏడాది క్రితం సబేషన్‌ చెప్పిన మాటలు, తాజాగా నెడుమారన్‌ వెల్లడించిన సంచలనాల నేపథ్యంలో ఎలాంటి చాన్స్‌ తీసుకోకూడదని కేంద్ర సంస్థలు భావిస్తున్నాయని సమాచారం.

ఎవరీ నెడుమారన్‌?

ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌ బతికే ఉన్నాడని ఎవరో సాదాసీదా మనిషి చెప్తే పెద్ద విషయం అయి ఉండక పోయేది. కానీ.. చెప్పిన వ్యక్తి మామూలు మనిషి కాదు. ఒక విధంగా ఆయన ఎల్‌టీటీఈకి అధికార ‘అనధికార ప్రతినిధి’! పేరు నెడుమారన్‌. నిజానికి ఆయన తమిళనాడు రాజకీయాల్లో తెర వెనుకకు వెళ్లిపోయి చాలా కాలమైంది. కానీ.. ప్రభాకరన్‌ బతికే ఉన్నాడని ఆయన చెప్పిన మాట.. ఆయనను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది.

రాజకీయ దిగ్గజమే!

తమిళనాడులోని మదురైలో పుట్టిన నెడుమారన్‌.. రచయిత. అనేక పుస్తకాలు రాశారు. తమిళ జాతి నాయకుడు. ప్రభాకరన్‌ జీవిత కథను రాసింది కూడా ఆయనే. 1969లో కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన నెడుమారన్‌.. మద్రాస్‌ ప్రావిన్స్‌ అప్పటి ముఖ్యమంత్రి కే కామరాజ్‌కు అత్యంత ఇష్టుడు. కామరాజ్‌ మరణానంతరం ఇందిరాగాంధీకి దగ్గరయ్యారు. తదుపరి కాలంలో డీఎంకే, కాంగ్రెస్‌ చేతులు కలపడం సహించలేక పార్టీకి రాజీనామా చేసి, తమిళనాడు కామరాజ్‌ కాంగ్రెస్‌ అనే సొంత కుంపటి పెట్టుకున్నారు. 1980లో అన్నాడీఎంకే అధినేత ఎంజీ రామచంద్రన్‌తో పొత్తు పెట్టుకున్నారు.