- ఉద్యోగులను అరెస్టు చేసి… అనిల్‌ను వదిలేశారు
- అనిల్ అరెస్టు వద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు
- వీడియో కాన్ లీలలు అన్నీ ఇన్నీ కావు
- ఐసీఐసీఐ బ్యాలెన్స్ షీటులో అప్పులు మాయం
గ్రేట్ ఇండియన్ బ్యాక్ రాబరీ పార్ట్ 2
దేశంలో చౌక ధరకు ఫోన్ అంటూ 2003 సంవత్సరంలో సంచలనం రేపిన రిలయన్స్ మొబైల్ యజమాని అనిల్ అంబానీ.. బ్యాంకు రుణాల ఎగవేతలో తక్కువేమీ తినలేదు. అంబానీ సోదరులు వేరు పడిన తరువాత అనిల్ కొత్త కంపెనీ ప్రారంభించారు. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూపు ఆఫ్ కంపెనీస్ 12 బ్యాంకులకు రూ.71,433 కోట్లు బకాయి పడ్డాయి. 2019–2020 మధ్యకాలంలో అనిల్ కంపెనీలు భారీ అప్పులతో సతమతం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. తన వ్యాపార సామ్రాజ్యం ఊహించని విధంగా కుప్పకూలడంతో నికర ఆస్తుల విలువ జీరోకు పడిపోయిందంటూ 2020 ఫిబ్రవరిలో యూకే కోర్టు ముందు అనిల్ దివాలా ప్రకటించారు. ఒకప్పుడు దేశంలో బడా పారిశ్రామికవేత్తగా పేరొందిన ఆయన ఇప్పుడు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం అనిల్ అంబానీపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. రిలయన్స్ హోం ఫైనాన్స్ రూ.150 రుణం తీసుకుని తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించిందిన యాక్సిస్ ఫిర్యాదులో పేర్కొంది.
2012 నుంచి అనిల్ అంబానీ కంపెనీలు ఆదాయం లేక దివాలా దిశగా పయనిస్తున్నా బ్యాంకులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా 2019 వరకు రుణాలు ఇస్తూ వెళ్లాయి. తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం చెల్లించకుండా, నిధులను దారి మళ్లించినట్లు బ్యాంకుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద ఎత్తున విమర్శలు రావడం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఎట్టకేలకు అనిల్ అంబానీపై కేసులు పెట్టాయి. అనిల్ అంబానీ మొత్తం రూ.73వేల కోట్లు బకాయి పడినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించడంతో దేశ ప్రజలు నివ్వెరపోయారు. నేరపూరితంగా కుట్రకు పాల్పడ్డం, వాస్తవాలు వక్రీకరించడం, రుణాలు దారి మళ్లించినట్లు ఎస్.బీ.ఐ తో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదుపై సీబీఐ, ఈడీ కేసు నమోదు చేశాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు కింద ఈడీ రిలయన్స్ గ్రూపునకు చెందిన సుమారు రూ.3వేల విలువ చేసే షేర్లు, భూములు, ముంబైలోని ఫ్లాట్లను జప్తు చేసింది. ముంబై, గురుగ్రామ్, బెంగళూరుతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో సీఈఓలు, సీఎఫ్ఓలు, డైరెక్టర్ల ఇళ్లలో సీబీఐ తనిఖీలు నిర్వహించింది. విలువైన పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్నది. ఎప్పటికప్పుడు సీబీఐ, ఈడీ తమ నివేదికలను సుప్రీంకోర్టుకు సమర్పించాయి. 2026 మే నెలలో ఇంతటి ఆర్థిక నేరాలకు పాల్పడిన అనిల్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. ఈయన తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించడం విశేషం.
కంపెనీల్లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులను అరెస్టు చేసిన సీబీఐ, అనిల్ అంబానీ విషయంలో మాత్రం ముందుకు వెళ్లలేకపోయింది. బ్యాంకులను మోసం చేసిన కేసులు, మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ ని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఏమీ చేయలేకపోయాయి. అనిల్ కు సన్నిహితులు అయిన ఎగ్జిక్యూటీవ్ లు డి. విశ్వనాథ్, అనిల్ కల్యా ను సీబీఐ, అమితాబ్ జుంజున్ వాలా, అమిత్ బప్నా లను ఈడీ అరెస్టు చేసింది. ఇదిలా ఉండగానే ఇటీవల అనిల్ అంబానీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు బెయిల అవుట్ లేఖ రాశారు. వివాదాస్పద సందేశరా గ్రూపునకు బెయిల్ అవుట్ ప్యాకేజీ మంజూరు చేయాల్సిందిగా ఆ లేఖలో కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి సమ్మతి తెలియచేయడంలో సందేశరా గ్రూపు మొత్తం బకాయిలు రూ.19వేల కోట్లకు గాను రూ.5,100 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈ బెయిల్ అవుట్ ప్యాకేజీకి సుప్రీంకోర్టు కూడా అనుమతించింది. ఇదే కాకుండా సందేశరా పై నమోదు అయిన క్రిమినల్ కేసులు, ఆదాయపు పన్ను అధికారులకు లంచాలు చెల్లించడం, తప్పుడు లేదా నకిలీ పత్రాలు రూపొందించినట్లు పెట్టిన కేసులను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.
టెన్ పర్సంటేజి కమీషన్ వీడియోకాన్ కంపెనీ
దేశంలోనే పేరున్న కంపెనీ వీడియోకాన్. ఐసీఐసీఐ బ్యాంకు రుణం కేసులో టెన్ పర్సంటేజీ కమీషన్లు చెల్లించి బజారున పడింది. ఈ కంపెనీ నుంచి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్, హోమ్ అప్లయన్స్ ఉత్పత్తులు వచ్చాయి. దేశీయ టెలివిజన్ తయారీలో పేరుగాంచిన విషయం తెలిసిందే. ప్రపంచంలో భారీ స్థాయిలో టీవీ పిక్చర్ ట్యూబ్ లను తయారు చేసే సంస్థగా గుర్తింపు దక్కించుకున్నది. ఈ సంస్థకు దేశంతో పాటు ఇతర దేశాలలో 17 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మహారాష్ట్ర ఔరంగాబాద్ కు చెందిన నందలాల్ మాధవ్ లాల్ ధూత్ 1985 లో వీడియోకాన్ ఇంటర్నేషనల్ ను ఏర్పాటు చేశారు. దేశంలో తొలిసారి కలర్ టీవీని పరిచయం చేసి ప్రజలకు చేరువయ్యారు. తరువాత డీటీహెచ్, విద్యుత్ ఉత్పత్తి, ఆయిల్ తవ్వకాల రంగంలోకి ప్రవేశించారు. పలు బ్యాంకుల నుంచి తెచ్చిన రూ.61,773 కోట్లు చెల్లించకపోవడంతో కేసులు పెటాయి. దీంతో వీడియోకాన్ ఇండస్ట్రీస్, అనుబంధ కంపెనీలు 2018 లో దివాలా పిటీషన్ కోర్టులో దాఖలు చేశాయి.
విచిత్రమేమంటే ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్ కంపెనీ అప్పులు ఎంత అనేది బ్యాలెన్స్ షీట్ లో చూపించడం లేదు. ఐసీఐసీఐ బ్యాంకు హెడ్ చందా కొచ్చర్ మంజూరు చేసిన రుణంలో పదిశాతం కమీషన్ గా ఆమె భర్తకు ముట్టచెప్పడంతో సీబీఐ రంగంలోకి దిగింది. చందా కొచ్చర్ వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ కు రూ.3,250 కోట్లు మంజూరు చేసింది. మొత్తం రుణంలో పది శాతం మొత్తాన్ని చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కు కెనడా దేశంలో ముట్టచెప్పి సీబీఐకి పట్టుబడ్డారు. ఈ కేసులో సీబీఐ వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ తో పాటు చందా కొచ్చర్ ను అరెస్టు చేసింది. ఈ కేసు నమోదు కానంత వరకు దేశంలోని మీడియా సంస్థలు చందా కొచ్చర్ ను కొనియాడుతూ పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి, ప్రచారం కల్పించాయి. ఒక మహిళగా ఐసీఐసీఐ బ్యాంకు ను అందనంత ఎత్తుకు తీసుకువెళ్తున్నదంటూ ఆకాశానికి ఎత్తాయి. ట్రాన్స్ యూనియన్ సిబిల్ డేటా ప్రకారం భారీ ఎగవేత దారుల జాబితాలో వీడియోకాన్ పేరును ఐసీఐసీఐ బ్యాంకు చేర్చకపోవడం గమనార్హం. మరో పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ఎస్.బీ.ఐ తమకు ధూత్ బ్రదర్స్ నుంచి రూ.10వేల కోట్లు మొండి బకాయిలు రావాల్సి ఉందని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సీ.ఎల్.టీ)ని ఆశ్రయించాయి. మొజాంబిక్ లోని వీడియోకాన్ ఆయిల్ ప్రాజెక్టు కు 2012 సంవత్సరంలో ఇచ్చిన రు.40వేల కోట్ల రుణాలపై బ్యాంకులు నోరు మెదపడం లేదు. కంపెనీ ప్రమోటర్లు సుమారు 2.02 బిలియన్ యూఎస్ డాలర్లు సంబంధం లేని కంపెనీలకు నిధులు మళ్లించారు. ఈ ఆరోపణలపై అప్పులిచ్చిన పలు బ్యాంకులు సీబీఐ కేసు పెట్టాయి. సుమారు రూ.61,773 కోట్లు బకాయి పడినట్లు తమ ఫిర్యాదులో తెలిపాయి. ఇదిలా ఉంటే 2021 జూన్ లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ టేకోవర్ చేయడానికి వేదాంత గ్రూపు దాఖలు చేసిన బిడ్ ను ఆమోదించింది.
