AI Deepfake Videos Threat | సినీ సెలెబ్రిటీలను, రాజకీయ నాయకులను షేక్ చేస్తున్న ఏఐ!
మొదట్లో సరదాగా, నవ్వుకునేలా ఉన్న ఏఐ వీడియోలు.. తర్వాత భయానక రూపుదాల్చాయి. ఇప్పుడు పీక్ స్టేజ్‌కి చేరుకుంది.. బీభత్సాలు చోటు చేసుకుంటున్నాయి.

(విధాత టెక్నికల్ డెస్క్) : AI Deepfake Videos Threat | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. దీంతో ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ నష్టాలు ఉన్నాయనే వాదనలు మొదటి నుంచీ ఉన్నవే. కాకపోతే.. ఇప్పుడు ఆ నష్టాలు కళ్లెదుటే సాక్షాత్కరిస్తున్నాయి. నిన్నటి వరకు దీన్ని తయారు చేసిన నిపుణులు చెబితే అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏఐ వల్ల కలిగే దుష్పరిణామలు ప్రత్యక్షంగా చూసి పలువురు సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు బిక్కచచ్చిపోతున్నారు. ఈ సాంకేతికతతో తయారు చేసిన వీడియోలు, ఫొటోలను కనిపెట్టడం అంత సులువు కాదు. అంత నాచురల్‌గా, అచ్చం మనుషుల మాదిరే కన్పిస్తారు. మన కళ్లు, మన చెవులే మనల్ని మోసం చేసేలా ఈ వీడియోలు ఉంటున్నాయి. ఏది నిజమో ఏది కల్పనో తెలియక సాధారణ జనం తికమకపడుతున్నారు. ఏఐ పేరు అని చెబితే చాలు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు హడలిపోతున్నారు. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసినా ఈ వీడియోలే కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. దీని సాయంతో లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా వీడియోలను, చిత్రాలను తయారు చేసి జనాల మీదికి లక్షల సంఖ్యలో వదులుతున్నారు. దీంతో అనేక మంది కృత్రిమ మేధను తలుచుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా వీడియోలు తయారు చేస్తున్నాయి. ఇందులో అసలు ఏంటీ, నకిలీ ఏంటనేది తెలుసుకో లేని విధంగా ఉన్నాయి.
తాజాగా సోనియా, రాహుల్ టార్గెట్
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్, తన తల్లి సోనియా గాంధీతో కలిసి బార్‌కు వెళ్ళినట్లు, అక్కడ వీరిద్దరు మద్యం తాగుతుంటే.. బార్ గర్ల్ నాట్యం చేస్తున్నట్లు ఉన్న వీడియోను బీజేపీ శ్రేణులు రూపొందించాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అతని తల్లి హీరాబెన్‌తో ఒక వీడియోను కాంగ్రెస్ తయారు చేసి తన అధికారిక ఖాతాలో రిలీజ్ చేసింది. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను జతపరిచి ‘ఈ రోజు ఓటు చోరీ విజయవంతంగా కంప్లీట్ చేశాము, ఇప్పుడు హాయిగా నిద్రపోదాం’ అంటూ కన్పిస్తుంది. మోదీ కలలోకి ఆయన తల్లి వస్తుంది. ఓట్ల కోసం రాజకీయాల్లో ఎంత దిగజారడానికైనా సిద్ధంగా ఉన్నావా? పెద్ద నోట్ల రద్దుతో జనాలను క్యూ లైన్లలో నిల్చోబెట్టావు.. అంటూ తిట్లు అందుకుంటుంది. ఆ వెంటనే మోదీకి మెలకువ వస్తుంది. దీనిపై బీజేపీ కౌంటర్ అటాక్ ఇస్తూ, ప్రధాని తల్లిని కించపరిచారని ఆరోపించింది.
మోదీ, మెలోనీకీ తప్పలేదు
కొంతకాలం క్రితం ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇద్దరూ ఒక కార్యక్రమంలో కలుసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒక ఇన్ ఫ్లుయన్సర్ ఈ ఫొటోలతో ఒక వీడియో తయారు చేసి షేర్ చేశారు. ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకుంటున్నట్లు, బుల్లెట్‌ను ఆమె నడుపుతున్నట్లు చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కాళ్లు పట్టుకుంటున్నట్లు తయారు చేశారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు కూడా చూపించారు. ఆ మధ్యన హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండియన్ ఇన్ ప్లుయన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని జతచేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంకేముందు ఇది వైరల్ అయ్యింది. డీప్ ఫేక్‌తో పలువురు ప్రముఖలను ఇబ్బందులకు గురి చేశారు. ఇలా నచ్చిన వారిపై హాయి గొలిపే విధంగా, నచ్చని వారిపై జుగుప్సాకరంగా, అశ్లీల వీడియోలను తయారు చేస్తున్నారు. ఈ వీడియోలను చూసిన సెలెబ్రిటీలు తలలు పట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఫొటోలు, వీడియోలు మాత్రమే షేర్ చేయగా ఆనందించారు. ఇప్పుడేమో ఏఐ ఫొటోలు, వీడియోలు వీరిని నిద్రలేని రాత్రులకు గురిచేస్తున్నది. బాలీవుడ్ నుంచి లోకల్ వుడ్ వరకు హీరోలు, హీరోయిన్లు ఆటో నడుపుతున్నట్లు, బట్టలు ఉతుకుతున్నట్లు, తుపాకీతో కాల్చుతున్నట్లు ఇలా ఒకటేమిటీ ఎన్నింటినో తయారు చేసి షేర్ చేస్తున్నారు. ‘ఆ వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేయడం సభ్యత కాదని వాటి ప్రస్తావనలు మాత్రమే చేస్తున్నాం).
ఏఐతో కోర్టులకు సెలెబ్రిటీల పరుగులు
తమ అనుమతి లేకుండానే తమ ఫొటోలు, వీడియోలు వినియోగిస్తూ వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ బాలీవుడ్ జంట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ సాయంతో అశ్లీల కంటెంట్ తయారు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారని, బాలీవుడ్ ఇష్క్ అనే చానల్ లో 259 వీడియోలు ఉన్నట్లు వారు తెలిపారు. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేలా ఉన్న వాటిని తొలగించేలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది. తమ ఫొటోలను వాడుకుంటూ వాటితో మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు తయారు చేసి కొందరు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారంటూ పలువురు సెలబ్రిటీలు ఆందోళనకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌లో కుప్పలు తెప్పలుగా తమ స్టేటస్‌ను, పరువును ఆసాంతం గంగలో కలిపేలా వస్తున్న వీడియోలు, ఫొటోలను నియంత్రించాలంటూ ఒక్కొక్కరుగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి తన ప్రతిష్టను దిగజార్చుతున్నారని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారంటూ హీరో నాగార్జున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా జడ్జి ‘ఏఐ వచ్చిన తరువాత భూతంలా తయారైంది’ అని వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఏఐ సాంకేతికతతో బాలీవుడ్ కు చెందిన ఒక నటుడి ఫొటోలను నగ్నంగా చూపిస్తూ ఆయన బంధువులు, స్నేహితులు, నిర్మాతలు, కుటుంబ సభ్యులకు షేర్ చేశారు. ఆయన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి, ఆయన ఫొటోలను మార్పింగ్ చేసి పంపించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇదే కాకుండా సెలెబ్రిటీలు స్వయంగా ప్రమోట్ చేస్తున్నట్లుగా గ్యాంబ్లింగ్ యాడ్ లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తలనొప్పిగా మారాయి. సినిమాలలో విలన్ లను క్లైమాక్స్ లో తుదముట్టిస్తున్న హీరోలకు ఈ ఏఐ విలన్ ను తట్టుకోలేకపోతున్నారు.
ఏఐ గురించి ఆసక్తికర వార్తలు.. ఇవి చదివారా?
Artificial Intelligence | ఏఐతో ఆ మూడు ప్రొఫెషన్స్‌కు ఎలాంటి భయం లేదు! బిల్ గేట్స్ గుడ్ న్యూస్
Artificial Intelligence | ఏఐని మితిమీరి వాడుతున్నారా? అయితే భవిష్యత్తులో మీ పరిస్థితి అథోగతే!
మిమ్మల్ని అంతం చేయగలను జాగ్రత్త.. AI రాసిన తొలి కవితా సంకలనంలో మనుషులపై విద్వేషం