మూడేళ్లలో కేంద్రాన్ని అడిగింది.. రూ. 85,677 కోట్లు… ఇచ్చింది రూ. 28,065 కోట్లు

దేశాన్ని ప‌రిపాలిస్తున్నబీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి తీర‌ని అన్యాయం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 2023–24 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 2026 మార్చి 31 వ‌ర‌కు ఈ మూడేళ్ల‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.85,677.82 కోట్లు కేంద్రాన్నిఅడిగితే.. ఇచ్చింది మాత్రం రూ.28,065.97 కోట్లు మాత్ర‌మేనని కాగ్‌ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

విధాత, హైదరాబాద్:

రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు ఇద్ద‌రు కేంద్ర మంత్రులున్నా.. రాష్ట్రానికి ఒన‌గూడిన ప్ర‌యోజ‌నం ఏమి లేదని, కేంద్రం నుంచి నిధులు రాబ‌ట్ట‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌ని కాగ్ లెక్క‌లే తెలియ‌జేస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక‌పోవ‌డంతో రాష్ట్ర‌ ప్ర‌భుత్వం స్వంత ఆదాయం పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతున్న‌ది. ఖ‌ర్చుల‌కు త‌గిన ఆదాయం రాక‌పోవ‌డంతో అప్పుల‌పైనే ఎక్కువ‌గా ఆధారప‌డాల్సిన అనివార్య‌ ప‌రిస్థితి తెలంగాణ ప్ర‌భుత్వానికి ఏర్ప‌డింది.

2023-24 నుంచి 2026 మార్చి వ‌ర‌కు కేంద్రం నుంచి వ‌చ్చిన గ్రాంట్స్ (రూ. కోట్ల‌లో)

సంవ‌త్స‌రం  ఎస్టిమేట్        వ‌చ్చింది    శాతం

2023–24       41,259.17      9729.91            23.58

2024–25       21636.15       7913.08           36.57

2025–26      22782.50      10,422.98        45.75

(కాగ్‌ పత్రాలు ఆధారం)

రాష్ట్ర ఆదాయాలు, ఖ‌ర్చుల మ‌ధ్య లోటు భ‌ర్తీ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగుల వేత‌నాలు, పెన్ష‌న్లు, ఆరోగ్యం, విద్య‌, రైతు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు లోటును పూడ్చ‌టానికి వీటిని ఉద్దేశిస్తుంది. అలాగే ప్రాంతీయ అస‌మాన‌త‌లు త‌గ్గించ‌డానికి వెనుక‌బడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్ర‌త్యేక గ్రాంట్లు కూడా ఇస్తుంది. మ‌రో వైపు కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలైన జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌, పీఎంఏవై, ఎన్‌హెచ్‌ఎం, విద్యా ప‌థ‌కాలకు స‌హాయం చేస్తుంది. వ‌ర‌ద‌లు, క‌రువు, తుఫాన్లు, భూ కంపాల వ‌టి సంద‌ర్భాల్లోనూ ప్ర‌త్యేక గ్రాంట్లు ఇస్తుంది. ఆదివాసీ ప్రాంతాల వృద్ధి, రాష్ట్రాల‌ ప్ర‌త్యేక అవ‌స‌రాలు, ఆర్థికంగా బ‌ల‌హీన రాష్ట్రాల కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 275 ప్ర‌కారం గ్రాంట్స్ ఇస్తారు. ముఖ్యంగా ఇలా ఇచ్చే గ్రాంట్లు ఆర్థిక సంఘం సిఫార‌సుల మేర‌కు విడుద‌ల చేయాలి. రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఆర్థిక సంఘం చేసిన సిఫార‌సులు, కేంద్రం ప్ర‌క‌టించే ప్రాయోజిత ప‌థ‌కాలు, వాటికోసం రాష్ట్రానికి చేసిన కేటాయింపుల మేర‌కు, ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు బ‌డ్జెట్‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్రం నుంచి వ‌చ్చే ఆదాయాన్ని అంచ‌నావేసి బ‌డ్జెట్‌లో పొందుప‌రుస్తారు.

తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందా?

ఆర్థిక సంఘం సిఫార‌సులు కూడా ప‌ట్టించుకోని కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై క‌క్ష క‌ట్టిందా? అనే సందేహాలు వెలువ‌డుతున్నాయి. చిన్న‌చిన్న కార‌ణాలు చూపి కేంద్రం రాష్ట్రానికి గ్రాంట్స్ విడుద‌ల చేయ‌డం లేద‌న్నఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సంఘం సిఫార‌సుల‌తో పాటు కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాలు, విప‌త్తుల నిర్వ‌హ‌ణ నిధి, ప‌ట్ట‌ణాభివృద్ధికి గ్రాంట్స్ రావాలి. కానీ యుటిలైజేష‌న్ స‌ర్థిఫికెట్ స‌మయానికి ఇవ్వ‌డం లేద‌న్న కార‌ణం చూపి నిధులు విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జ‌న‌వ‌రిలోనే ఫైనాన్స్ క‌మిష‌న్ నిధులు మూడు వేల కోట్లు విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. దీనిని బ‌ట్టి ప‌రిశీలిస్తే రాజ‌కీయ కార‌ణాల‌తోటే కేంద్రం నిధులు ఇవ్వ‌కుండా రాష్ట్రాన్నిఇబ్బందుల‌కు గురి చేస్తున్నదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర నిధులు రాక అప్పులు వైపు..

కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం లోటును పూడ్చుకోవ‌డానికి అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాష్ట్రంలో స్వంత ఆదాయ వ‌న‌రులు త‌గ్గిపోయాయి. కేంద్రం ఎంత మేర‌కు ఇవ్వాలో అంత మేర‌కు గ్రాంట్స్ ఇవ్వ‌డం లేదు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పడిన రోజు నుంచి బీజేపీ ప్ర‌భుత్వం ఇదేర‌క‌మైన వివ‌క్ష‌ చూపిస్తున్నదన్న అభిప్రాయం తెలంగాణ స‌మాజంలో ఏర్ప‌డింది. అందుకే కాబోలు కాళేశ్వ‌రం, పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ల‌కు కేంద్రం జాతీయ హోదా ఇవ్వ‌లేదు. ఫ‌లితంగా ల‌క్ష‌ల కోట్ల రుణం కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కోసం తీసుకోవాల్సి వ‌చ్చింది.

ఇవి కూడా చదవండి..

ప్రపంచ పటంలో ఉండాలో లేదో పాక్ తేల్చుకోవాలి : భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
సంక్షేమ పథకాల అమలుపై ‘సర్’ దెబ్బ
Southwest Monsoon | ఈ ఏడాది ముందుగానే వర్షాలు.. మే 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

Latest News