GHMC Coordination Failure | కోఆర్డినేషన్‌ కమిటీతోనే గ్రేటర్ హైదరాబాద్ సమస్యలకు పరిష్కారం

గ్రేటర్ హైదరాబాద్‌లో సమస్యలు తిష్ఠ వేశాయి. పరిధి పెరిగినా సీనియర్ ఐఏఎస్‌లను నియమించకుండా జూనియర్ అధికారులతో పని నెట్టుకొచ్చేస్తుండటంతో సమస్యలు మరింత జటిలం అవుతున్నాయి. ఫలితంగా నగరం ప్రతిష్ఠను కోల్పోతున్నది. సీనియర్ ఐపీఎస్ అధికారులను పోలీస్ కమిషనర్లుగా నియమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి... జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ సప్లయి బోర్డు, హెచ్ఎండీఏలకు మాత్రం జూనియర్ ఐఏఎస్‌ను నియమిస్తున్నారు. దీని వల్లే పాలన గాడిన పడటం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

GHMC Coordination Failure | కోఆర్డినేషన్‌ కమిటీతోనే గ్రేటర్ హైదరాబాద్ సమస్యలకు పరిష్కారం

GHMC Coordination Failure | గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏ వీధికి వెళ్లినా చెత్త కుప్పలు టన్నుల కొద్దీ దర్శనమిస్తుంటాయి. ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా గుంతలు లేకుండా లేదంటే పరిస్థితి ఎంద దుర్భరంగా ఉందో ఊహించుకోవచ్చు. రద్దీ లేని రోడ్లు.. కల మాత్రమే. కాలనీ రోడ్లలో ఆక్రమణలు, ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లతో నగరం నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నది. చిన్న ఆటో లేదా బస్సు రోడ్డుపై ఆగిపోతే ఆ చుట్టు పక్కల రోడ్లపై గంటల కొద్దీ వాహనదారులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎదురవుతున్నది.

నగరంలోని ప్రధాన విభాగాల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ సమస్యలకు మూల కారణం అని పట్టణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా నగర భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని గ్రేటర్ హైదరాబాద్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రో వాటర్ సప్లయి బోర్డు, ట్రై పోలీసు కమిషనర్లు, బీఎస్ఎన్ఎల్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌లతో కమిటీని నియమిస్తే చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పడతాయని అంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు హై లెవెల్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు.

  • ఈ కమిటీ వారం రోజులకు ఒకసారి నగరంలో ఏదో ఒక జోన్‌లో పర్యటించేది.
  • ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించేది.
  • ప్రధానంగా రోడ్ల పరిశుభ్రత… పార్కుల నిర్వహణ… ట్రాఫిక్.. రోడ్లపై నీళ్లు ప్రవహించకుండా నిరోధించడం… రోడ్డు కటింగ్‌లు ఇష్టారీతిన చేపట్టకుండా నిరోధించడం.. ఇరుకు రోడ్లను విస్తరించడం.. ఇటువంటి పనులకు ప్రాధాన్యం ఇచ్చేవారు.
  • రోడ్లపై గుంతలు కన్పించకుండా, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా బ్లాక్ కార్పెటింగ్ ఎప్పటికప్పుడు వేయించేలా చూసేవారు.
  • ప్రతివారం నగరంలో ప్రధాన విభాగాలు ఉన్నతాధికారులు పర్యటించడంతో కిందిస్థాయి కూడా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పనిచేసేవారని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

అప్పటిదాకా కొనసాగుతూ వచ్చిన కోఆర్డినేషన్‌ కమిటీ వ్యవస్థను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎత్తి వేశారు. జీహెచ్ఎంసీలో సీనియర్ అధికారులను బదిలీలు చేసి జూనియర్లను, తాము చెప్పినట్టల్లా తలాడించే ఐఏఎస్ అధికారులను.. నియమించుకున్నారు. దీంతో.. నగరంలో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు.. నగరంలో ప్రధాన విభాగాల మధ్య సమన్వయం లేనే లేదు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ట్రాఫిక్ జామ్… మెట్రో రైలు విస్తరణ పనులు… రోడ్ల మరమ్మత్తులు… చెత్త సమస్యలు మరింతగా పెరిగాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అయినా సమస్యలు పరిష్కారం అవుతాయని ఊహించిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు నిరాశే ఎదురైంది.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత నగర సమస్యల పరిష్కారం కోసం శాశ్వత చర్యలు తీసుకుంటారని రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఊహించారు. నగర సమస్యలు తెలిసిన నాయకుడిగా చొరవ తీసుకుంటారని అందరూ అనుకున్నారు. మునిసిపల్, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖలను ముఖ్యమంత్రి రెండేళ్ళుగా తనవద్దే పెట్టుకున్నారు. దీంతో నగరం కోసం నిధులు ఎక్కువగా కేటాయించి.. గాడిన పెడతారని భావించిన వారికి భంగపాటే ఎదురైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించినందున ఇక నుంచైనా తాగునీరు, మురుగునీరు, విద్యుత్, రోడ్లు, ట్రాఫిక్ వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కో ఆర్డినేషన్ కమిటీ ని ఏర్పాటు చేయాలని పట్టణ ప‌ట్ట‌ణాభివృద్ధి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • కాలనీల్లో చెత్త కుప్పలు రోజుల తరబడి ఎత్తకపోవడంతో అవి దుర్గంధం వెదజల్లుతున్నాయి.
  • ప్రధాన రోడ్లు సైతం గుంతలమయంగా ఉండటంతో ప్రతినిత్యం వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు.
  • ఆసుపత్రుల పాలై లక్షలాది రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు.
  • ట్రాఫిక్ రద్దీ కారణంగా అర గంటలో గమ్యస్థానం చేరుకోవాల్సిన వ్యక్తి గంటన్నరకు చేరుకుంటున్నారు.
  • ప్రజలు తమ విలువైన సమయాన్ని కోల్పోవడమే కాకుండా కాలుష్యం బారినపడుతున్నారు.
  • కాలం చెల్లిన వాహనాల విషయంలో నిర్ణయం తీసుకోకపోవడంతో ముఖ్యంగా చిన్నారులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు.
  • కొన్ని కాలనీల్లో, రోడ్లపై ఇప్పటికీ మురుగునీటి ప్రవాహాలు కన్పిస్తూనే ఉంటాయి.
  • వాటర్ పైపులైన్ల లీకేజీల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని పట్టణ నిపుణులు, రియల్టర్లు ఇటీవల ప్రభుత్వ పెద్దలకు సూచించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరితో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియనుంది. ఆ తరువాత సీనియర్ ఐఏఎస్ అధికారిని చీఫ్ కమిషనర్‌గా నియమించే సూచనలు ఉన్నాయి. ఆ లోపే కమిటీ పై నిర్ణయం తీసుకుంటారా ఆ తరువాత తీసుకుంటారా అనేది చూడాలి.

Read Also |

Skyscrapers | హైదరాబాద్ నగరంలో ఆకాశ హర్మ్యాలతో లాభమా? నష్టమా?
Hyderabad FSI Rule | ఇకనైనా ఎఫ్ఎస్ఐ తెస్తారా? లేక హైదరాబాద్ నగరాన్ని చంపుతారా?
హైదరాబాద్‌ ఇక నివాస యోగ్యం కాదా? పట్టని పాలకులు.. అడ్డగోలుగా అనుమతులు