Jubilee Hills Bypoll | జూబ్లీ వార్‌లో కేసుల సవాల్! కేసులు ఎవరిపై? అరెస్టులు చేసేదెవరు?
కేసుల ప్రహసనం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ప్రచార హీట్‌ను పెంచుతున్నది. బీఆరెస్ హయాంలో అవకతవకలపై కేసులలో అరెస్టులు ఎవరు చేయాలన్న విషయంలో అధికార, విపక్ష పార్టీలు సవాళ్లు విసురుకోవడం విశేషం.
విధాత, హైదరాబాద్ :
Jubilee Hills Bypoll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకున్నట్లుగానే.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య పరస్పర విమర్శలు.. దూషణల పర్వం కూడా అదే స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి మధ్య పైకి ముక్కోణపు పోటీ నెలకొన్నట్లుగా కనిపిస్తున్నా.. ప్రధానంగా కాంగ్రెస్, బీఆరెస్ మధ్యే పోటీ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఎవరూ కూడా తగ్గేదే లేదన్నట్లుగా ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. పరిపాలన సంబంధిత విజయాలు, వైఫల్యాల చుట్టు సాగిన విమర్శల పర్వం కాస్తా.. ఇప్పుడు స్కామ్‌లు, కేసులు, అరెస్టులపై పరస్పర సవాళ్ల వరకు వెళ్లడంతో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది.
ఎన్నికల ప్రచారంలో కేసుల హీట్!
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతూ.. హైడ్రాను ముందుకు తెచ్చి విమర్శలు చేయడం సహజంగానే సీఎం రేవంత్ రెడ్డిలో అసహనాన్ని రేపింది. దీంతో బీఆర్ఎస్ పదేళ్ల పాలన వైఫల్యాలను, స్కామ్‌లను, కేసులను గుర్తుకు తెస్తూ రేవంత్ రెడ్డి ప్రతిదాడికి దిగారు. పనిలో పనిగా బీజేపీని కూడా అరుసుకుంటున్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తే.. 48 గంటల్లో కేసీఆర్‌ను అరెస్టు చేస్తామని కిషన్ రెడ్డి చెప్పిన మాటను గుర్తు చేస్తున్న రేవంత్‌రెడ్డి.. తాము ఆ కేసును సీబీఐకి ఇచ్చి రెండు నెలలైనా ఎందుకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాకపోతే జూబ్లీహిల్స్ పోలింగ్ తేదీలోగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు విచారణ జరిపించాలని, కేసీఆర్, హరీశ్‌రావులను అరెస్టు చేయాలని రేవంత్ సవాల్ విసిరారు. అలాగే ఫార్ములా ఈ కారు రేసులో రూ.50కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ఆ కంపెనీ నుంచి వసూలు చేశారని ఏసీబీ ఆధారాలతో సహా కేసు కట్టి కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరితే రెండు నెలల నుంచి అనుమతి ఎందుకు పెండింగ్‌లో ఉందో బీజేపీ చెప్పాలని సవాల్ చేశారు. ఇందులో మీ గూడుపుఠాణి ఏముందని నిలదీశారు. కాళేశ్వరం బీఆర్ఎస్ ఏటీఎం అన్న ప్రధాని మోదీ ఎందుకు సీబీఐ విచారణకు పూనుకోవడం లేదంటూ ప్రశ్నించారు. బీజేపీలో త్వరలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నందునే వారి కేసులను తొక్కిపెడుతున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఆత్మహత్య చేసుకుని బీఆర్ఎస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నదని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అయితే రేవంత్ రెడ్డి విమర్శలకు కిషన్ రెడ్డి కూడా అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారని, వారి మధ్యనే పొత్తుల నేపథ్యం ఉంది తప్ప.. తమ పార్టీతో బీఆర్ఎస్ కు ఏనాడు బంధం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్ష కోట్లను కక్కిస్తామన్న రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో ఎంత కక్కించారో చెప్పకుండా.. అరెస్టులు చేయకుండా.. బీజేపీ అరెస్టు చేయడం లేదంటూ తమపై నిందలు వేయడం ఎందుకని ప్రశ్నించారు.
Anaconda Video | అనకొండ, కొండచిలువ మధ్య ఫైట్‌లో గెలిచేదేంటి? వాటి బలాబలాలేంటి?
రాజకీయ అవసరాల మేరకే కేసుల ప్రహసనం!
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయగా.. ఫార్మాలా ఈ కేసులో సైతం ఈడీ కేసు నమోదు చేసింది. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు సైతం కేంద్ర పరిధిలోని అంశాలతోనే ముడిపడి ఉంది. ఇటీవల ఈ కేసులో సుప్రీంకోర్టులో సైతం బీజేపీ ఇంప్లీడ్ కావడం గమనార్హం. బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు కేసీఆర్ నడిపించిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఎపిసోడ్ కేసు కూడా ఇందులో భాగంగానే చూడవచ్చు. అటు సబ్సిడీ గొర్రెల స్కామ్ లోనూ కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా ఉండటం.. అందులోనూ ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ నాలుగు కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు అవకాశం ఉన్నా..ఎందుకు బీజేపీ చోద్యం చూస్తుందన్న ప్రశ్న జనంలోనూ తలెత్తుతున్నది. ఇదే సమయంలో హెచ్‌సీఏ అక్రమాల కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నది. బీఆర్ఎస్ పాలనలో పత్రికా ప్రకటనలకు నిధుల దుర్వినియోగంపై విచారణకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది. ఇక్కడ మరో ముఖ్యమైన కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్. గతంలో కవితను అరెస్టు చేసి జైలు పాలు చేసిన కేంద్ర సర్కార్..ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అంశం ఊసు కూడా ఎత్తకపోవడం గమనార్హం.
Kaleshwaram Project | కాళేశ్వరం కేసులో కేసీఆర్ జైలుకు వెళతారా? క్లారిటీ ఇదే!
కేసులు ఎన్నో.. అరెస్టులే సున్నా!
ఇకపోతే విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలు, టూరిజం స్కామ్, సీఎంఆర్ఎఫ్ స్కామ్, ధరణి స్కామ్, దళిత బంధు స్కామ్ , చేప పిల్లల పంపిణీ స్కామ్, అంగన్‌వాడీ పోషకాహార స్కామ్, అవుటర్ రింగ్ రోడ్డు నిర్వహణ లీజు వ్యవహారం వంటివి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణలు సైతం పెండింగులోనే ఉన్నాయి. వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోవాల్సిన సంగతి మరువరాదు. బీజేపీని ప్రశ్నించే ముందు తన పరిధిలోని కేసుల సంగతేమిటన్న ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుకాక తప్పదు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంగాని, కేంద్ర ప్రభుత్వంగాని ఆయా కేసుల్లో ఒక్క బీఆర్ఎస్ నేతను అరెస్టు చేయకపోవడం చూస్తే.. అసలు ఈ కేసుల్లో బలం ఎంత అన్న సందేహాలు సామాన్యుల్లో రేకెత్తితే ఆశ్చర్యం లేదనవచ్చు. రాజ్యాంగ వ్యవస్థలలోని రక్షణలతో జైళ్లలో ఉండాల్సిన నాయకులు నేడు నీతి వచనాలు చెబుతూ దొంగే దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనుకుంటే అందుకు బాధ్యులు కేంద్ర రాష్ట్రాల్లోని పాలకులే అవుతారని విశ్లేషకుల మాట.
Read Also |
Monalisa | తెలుగు మూవీలో హీరోయిన్‌గా కుంభమేళా మోనాలిసా!
Rahul Gandhi : బ్రెజిల్ మోడల్ కు హర్యానాలో 22ఓట్లు
Farmers Suffering | రైతులకు కన్నీటి గాయాలు.. తడిసి ముద్దవుతోన్న పంటలు!
చేవెళ్ల బాధితులను పరామర్శించే తీరిక లేదా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram