Junior IAS Corruption | భూమి సమస్య పరిష్కారమా? 17 కోట్లు ఇవ్వు! రియల్టర్‌కు ఒక జిల్లా కలెక్టర్‌ డిమాండ్‌!

హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న ఒక జిల్లా కలెక్టర్‌ను భూమి పని నిమిత్తం ఒక రియల్టర్ గతేడాది ప్రారంభంలో కలిశారు. తర్వాత ఐదారుసార్లు కలిశారు. సమస్య చిన్నదే అయినప్పటికీ, భూమి విలువ అధికంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ నాన్చుతూ వచ్చారని తెలిసింది. ‘మాకూ ఖర్చులు ఉంటాయి. పై వాళ్లను కూడా చూసుకోవాల్సి ఉంటుంది’ అని సదరు రియల్టర్‌కు చెప్పారని సమాచారం.

Junior IAS Corruption | భూమి సమస్య పరిష్కారమా? 17 కోట్లు ఇవ్వు! రియల్టర్‌కు ఒక జిల్లా కలెక్టర్‌ డిమాండ్‌! representative image created by AI

Junior IAS Corruption | హైదరాబాద్, జూన్ 28 (విధాత) : భారత దేశంలో ఐఏఎస్ అధికారులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంది. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేసేవారనే పేరుంది. తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా? అంటే పూర్తిగా లేదనే చెబుతున్నాయి జరుగుతున్న పరిణామాలు. కొందరు ఐఏఎస్‌ అధికారులు కోట్లు కొల్లగొట్టుకునేందుకు తమ పదవులను అడ్డంగా వాడేస్తున్నారన్న ఆరోపణలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. ఇందులో జూనియర్‌ ఐఏఎస్‌లు కొందరు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. పదేళ్ల సర్వీసు కూడా పూర్తి చేయని అధికారులు కొందరు.. కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని ఒక ఉదంతం ఆధారంగా అర్థమవుతున్నది. అయితే.. ఇటువంటి అధికారులపై ప్రభుత్వం కూడా సత్వరమే తీవ్రంగా స్పందిస్తున్నదని తెలుస్తున్నది. నగరానికి సమీపంలో ఉన్న ఒక జిల్లా కలెక్టర్ ఒక పని పూర్తి చేసేందుకు ఏకంగా 17 కోట్లను ఒక రియల్టర్‌ నుంచి డిమాండ్‌ చేశారని, దీనితో చేసేదేమీ లేక సదరు రియల్టర్‌ ప్రభుత్వ పెద్ద దృష్టికి తీసుకెళ్లగా ఆ అధికారిపై రోజుల వ్యవధిలోనే వేటు పడిందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ స్థాయికి చేరుకోవాలంటే కనీసం పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉంటేనే వీలయ్యేది. ఈ పదేళ్లలో వారు గిరిజన ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను అవలోకనం చేసుకునేవారు. ఈ అనుభవంతో జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి పొంది, ప్రజలకు తమ పరిధిలో సేవ చేసేవారు. ప్రజలు కూడా తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి దరఖాస్తులు ఇచ్చి, పనులు చేయించుకునేవారు. కొందరు జిల్లా కలెక్టర్లు తమకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి పేద, మధ్య తరగతి ప్రజలు, బాధితులకు న్యాయం చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పటికీ కొన్ని జిల్లాలు, హైదరాబాద్ నగరంలో కొందరి కలెక్టర్ల పేర్లను గుర్తు చేసుకుంటారంటే అదే కారణం. ఆయన హయాంలో తమకు న్యాయం జరిగిందని, ఈ గూడు ఆయన భిక్షేనంటూ బస్తీవాసులు చెబుతుంటారు.

కానీ.. తెలంగాణలో కొందరు జూనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఇటువంటి వాతావరణాన్ని నాశనం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పదవులను అడ్డు పెట్టుకుని బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఒక విధంగా ఇటువంటి పరిస్థితి గత బీఆరెస్‌ ప్రభుత్వ హయాం నుంచే ప్రారంభమైందని ఒక బాధిత రియల్టర్‌ సన్నిహిత వర్గాలు చెప్పాయి. పాలకులతో చేతులు కలిపిన కొందరు.. వేల కోట్లు కొల్లగొట్టారని విమర్శలు వస్తున్నాయి. ఒక జిల్లా కలెక్టర్‌ ఆఖరుకు 50 వేలు కూడా వదిలిపెట్టకుండా వసూలు చేశారంటే.. ఎంతకు దిగజారారో ఊహించుకోవచ్చని అంటున్నారు.

హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న ఒక జిల్లా కలెక్టర్‌ను భూమి పని నిమిత్తం ఒక రియల్టర్ గతేడాది ప్రారంభంలో కలిశారు. తర్వాత ఐదారుసార్లు కలిశారు. సమస్య చిన్నదే అయినప్పటికీ, భూమి విలువ అధికంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ నాన్చుతూ వచ్చారని తెలిసింది. ‘మాకూ ఖర్చులు ఉంటాయి. పై వాళ్లను కూడా చూసుకోవాల్సి ఉంటుంది’ అని సదరు రియల్టర్‌కు చెప్పారని సమాచారం. ఇదే విషయంలో మాట్లాడేందుకు రావాలని కోరడంతో సదరు రియల్టర్‌ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారట. ఇద్దరి మధ్య సంభాషణలు జరుగుతున్న సమయంలో రూ.17 కోట్లు చెల్లిస్తే పని పూర్తవుతుందని, వారం రోజుల్లో భూమికి సంబంధించిన సమస్క పరిష్కారం అవుతుందని చెప్పారని తెలిసింది. ఏమాత్రం ఊహించని విధంగా లెక్క చెప్పడంతో మూర్ఛ వచ్చినంత పనైన సదరు రియల్టర్‌.. అప్పటికి తమాయించుకుని, ఆలోచించి చెబుతానని వచ్చేశారట. ఈ విషయాన్ని తన సన్నిహిత వర్గాల వద్ద మొరపెట్టుకున్న రియల్టర్‌.. ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పాత వాసనలు పోలేదంటూ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొద్ది రోజుల తరువాత రియల్టర్‌కు ఫోన్‌ చేసిన కలెక్టర్‌.. ‘ఏమైంది? భూమి పనికోసం మాట్లాడి వెళ్లిపోయారు. ఇంకా రాలేదేంటి?’ అని అడిగారని, డబ్బులు సర్ధుబాటు కాలేదంటూ సమాధానం చెప్పి సున్నితంగా తప్పించుకున్నారని రియల్టర్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతులేని ఈ అవినీతి విషయాన్ని తెలిపేందుకు ఆయన ప్రభుత్వంలో ఒక పెద్దమనిషి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. విషయం విన్న సదరు పెద్ద మనిషి కూడా విస్తుబోయారట. ‘ఇంకా బీఆర్ఎస్ పాలన నడుస్తున్నదని అనుకుంటున్నారా? భయం భక్తి లేకుండా పోయింది’ అంటూ ఆగ్రహోదగ్రుడైన సదరు పెద్ద మనిషి.. ఈ వ్యవహారంపై విచారణ చేయించి, స్వల్ప సమయంలో జిల్లా కలెక్టర్‌ను అక్కడి నుంచి బదిలీ చేశారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఆ ఐఏఎస్ అధికారి హైదరాబాద్ లోనే పనిచేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ల అవినీతిపై నిర్దిష్టమైన ఆరోపణలు వచ్చిన సందర్భంలో నిర్ధారణ చేసుకున్న తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తున్నదనేది ఈ ఉదంతం ద్వారా స్పష్టమవుతున్నదని అంటున్నారు.