కాళేశ్వరం కేంద్రంగా తెలంగాణ పొలిటికల్ వార్.. హైకోర్టు తీర్పుతో హీటెక్కిన రాష్ట్ర రాజకీయాలు
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని రాష్ట్ర రాజకీయ పోరుకు సర్వనామంగా మార్చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు, నిరుద్యోగం, ఉద్యోగ ఉపాధి అంశాల కంటే రాజకీయ ఆధిపత్య చదరంగంలో కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కీలకంగా మారింది. ప్రచార, ప్రసార సాధానాలు కూడా ఇదే అంశానికి ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తూ పరిస్థితిని పతాకస్థాయికి చేర్చుతున్నాయి. ఒక్కోసారి ఆయా పార్టీల చోటామోటా నాయకుల నుంచి అధినేతల వరకు మాట్లాడుతున్న మాటలు రాజకీయంగా జుగుప్సాకరంగా మారాయి.
- రాష్ట్ర రాజకీయపోరుకు సర్వనామంగా మారిన ప్రాజెక్టు
- కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య ఆధిపత్య పోరు
- మధ్య మధ్యలో మెరుస్తున్న బీజేపీ ముఖ్యనేతలు
- అంతులేని కథగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
కాళేశ్వరం కథాంశంగా తెలంగాణలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ రాజకీయం సాగుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట కాళేశ్వరం ప్రాజెక్టు అంశం లేకుండా రోజువారీ రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు లేకుండా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు బీజేపీ నాయకులు కూడా తమవంతు ప్రయత్నం చేస్తూ పాకులాడుతున్నారనే విమర్శలున్నాయి. సీబీఐ విచారణపై స్పందించకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై రాష్ట్ర హైకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్‌లో సంతోషాన్ని, కాంగ్రెస్‌లో నిరాశను నెలకొల్పింది.
బీఆర్ఎస్ కు మరణశాసనంగా కాళేశ్వరం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మానస పుత్రికగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు చివరికి ఆ పార్టీకి రాజకీయ మరణశాసనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 అక్టోబర్‌లో బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయగా ఉన్న మేడిగడ్డ బరాజ్ పియర్స్ రెండు కుంగిపోయినప్పటి నుంచి ఆ పార్టీ పతనం ప్రారంభమైంది. అధికారం కోల్పోయిన కొద్ది రోజులకు, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పియర్స్ కూలిన సంఘటన నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఈ క్రమంలో కొద్ది రోజులు తన ఆత్మరక్షణను కొనసాగించింది. ఆ తర్వాత ఎదురుదాడి ప్రారంభించింది. వాస్తవానికి బీఆర్ఎస్ జగిత్యాల సభ జరిగిన రోజే కాంగ్రెస్ నేతలు మేడిగడ్డకు వెళ్ళడం, యాదృచ్ఛికమా? ప్రణాళికా? అనేది పక్కన పెడితే ఇది రెండవ పర్యాయంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకు బీఆర్ఎస్ నల్లగొండ వేదికగా సభ పెడితే కేసీఆర్ హాజరయ్యారు. అదే రోజు శాసనసభ సమావేశాల నుంచి ప్రభుత్వం పక్షాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు దూరంగా ఉండగా కాంగ్రెస్ తోపాటు ఎంఐఎం, సీపీఐ ప్రజాప్రతినిధులు వెళ్ళిన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. నల్లగొండ సభావేదికగా కేసీఆర్ మాట్లాడుతూ ఈ లీడర్లంతా మేడిగడ్డకు పోయి ఏం వెలికితీస్తారంటూ పరుషంగానే విమర్శించారు. అప్పటి నుంచి ప్రారంభమైన దాడిని ఒక్కో మెట్టెక్కిస్తూ కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగిందనే అభిప్రాయం ఉంది. మధ్యలో పియర్స్ కుంగిపోలేదని, ఎవరో బాంబులుపెట్టారంటూ చెబుతూ వచ్చారు. కొద్ది రోజులకు ఈ బాంబులు పెట్టింది కాంగ్రెస్ వాళ్ళే అయి ఉంటారని ఆరోపిస్తూ వచ్చారు. ఇక ఈ మధ్యలో రెండు పియర్స్ కుంగితే ప్రాజెక్టును నిరుపయోగంగా మారుస్తున్నారంటూ చెబుతూ వచ్చారు. మధ్యలో మేడిగడ్డను బీఆర్ఎస్ నేతలతోపాటు వారి అనుబంధ ‘మేధావులు’ పర్యటించారు.
కాంగ్రెస్ కు రాజకీయ అస్త్రంగా కాళేశ్వరం
అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం పియర్స్ కుంగిపోయిన వెంటనే ఆ ప్రాంతాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీతోపాటు అప్పటి పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ, నాణ్యత డొల్లతనం తేలిపోయిదంటూ విమర్శించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, కేంద్రంలోని ఎన్డీఎస్ఏ తాత్కాలిక నివేదిక ఇస్తూ ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ, నాణ్యత అంతా అత్యంత దారుణమంటూ విమర్శించడంతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడ్డది. అయినప్పటికీ ఎన్డీఎస్ఎ కేంద్రలోని బీజేపీ ప్రేరితంగా పనిచేస్తుందంటూ విమర్శిస్తూ వచ్చారు. కాళేశ్వరం అంశం పై సీఎం రేవంత్ తొలుత విజిలెన్స్ విచారణతోపాటు, ఎన్డీఎస్ఏ సమగ్ర నివేదిక కోరారు. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పీసీఘోష్ ఆధ్వరంలో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశారు. 15 నెలల విచారణలో కేసీఆర్, హరీష్ రావుతో సహా 167 మందిని విచారించి 600లకు పైగా పేజీలతో నివేదిక సమర్పించారు. ఈ నివేదిక పై అసెంబ్లీలో చర్చించి సీబీఐ విచారణ చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కేంద్రాన్ని కోరి ఇప్పటికీ తొమ్మది నెలలు కావస్తున్నట్లు తాజాగా సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ అంశం పై కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ను పరిరక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. నిన్నటికి నిన్న హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై కూడా దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం జగిత్యాల సభకు కేసీఆర్ రాగా, సీఎం రేవంత్ మేడిగడ్డ సందర్శన చేపట్టారు. కాళేశ్వరం పై రేవంత్ విరుచుకపడగా, కేసీఆర్ ఈ అంశం పై మౌనం పాటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్త డ్రామాకు తెరతీశాయంటూ బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్వింద్, రఘునందన్ మీడియా సమావేశాలు పెట్టి విమర్శించారు.
బీఆర్ఎస్‌లో ఉత్సాహం, కాంగ్రెస్ డీలా
పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ ఆ కమిషన్ పై బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్, ఐఎఎస్ అధికారులు జోషి, స్మితా సబర్వాల్ .. హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై రిజర్వుచేసిన తీర్పును బుధవారం వెల్లడించారు. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని అంతర్గత ఆందోళనతో హడలిపోయిన బీఆర్ఎస్ అధినాయకత్వానికి తాజా తీర్పు ఉపశమనం కలిగించింది. తీర్పులోని అంశాలు, దాని లోతుపాతులు, ఏ అంశాల పై ఆధారపడి హైకోర్డు ప్రస్తుత తీర్పు ఇచ్చిందనే సాంకేతిక విషయాలు , సారాంశాలు ప్రస్తుతానికి పక్కన పెడితే, వచ్చిన తీర్పుతో ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ఊపిరిపీల్చుకున్నదని చెప్పవచ్చు. దీంతో ఆ పార్టీ నేతలు పలుచోట్ల బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఆ పార్టీ నేతలు హరీష్ , కేటీఆర్, జగదీష్ రెడ్డిలు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.
సత్యమేవ జయతే: హరీష్ రావు
ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైందంటూ బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ లీడర్ హరీష్ రావు స్పందించారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టిందన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యిందన్నారు.
అది పీసీసీ కమిషన్ నివేదిక: కేటీఆర్
అది పీసీ ఘోష్ కమిషన్ కాదు … పీసీసీ కమిషన్ అని ముందే చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా ట్రాష్ అంటూ పేర్కొన్నారు. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ, కానీ ఆయుష్షు తక్కువంటూ, కొన్ని ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పై చేసిన అబద్ధపు ప్రచారాలు అన్నీ బోగస్ అని ఈరోజు హైకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు.
సీఎంతో మంత్రి ఉత్తమ్ భేటీ
హైకోర్టు తీర్పు అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. కోర్టు తీర్పు అంశం పై, చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. నోటీసులు ఇవ్వకుండా పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదిక ఇచ్చినందున ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదనే సాంకేతిక అంశాలపై హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటును తప్పుపట్టలేదన్నారు. తీర్పును పూర్తిగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని, కమిషన్నివేదికే కాకుండా ఎన్డీఎస్ఎ రిపోర్టు, విజిలెన్స్ నివేదికలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నాయకులు గుర్తు చేశారు. హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకుని సంబురపడుతున్నారని, ముందున్నది ముసుళ్ళపండుగ అంటూ అద్దంకి దయాకర్, చామల కిరణ్ వ్యాఖ్యానించారు. కమిషన్ లో కూడా అనేక వాస్తవాలున్నాయని పేర్కొన్నారు.
అనిల్ జైన్‌పై బండి లేఖాస్త్రం
తాజా సీఎం రేవంత్ మేడిగడ్డ పర్యటనలో ఎన్డీఎస్ఐ చైర్మన్ అనిల్ జైన్ పాల్గొన్నారు. వాస్తవానికి ఇది అధికారిక పర్యటనగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పర్యటనలో అనిల్ జైన్ పాల్గొనడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ తప్పుపడుతూ జలశక్తి మంత్రికి లేఖ రాయడం చర్చసాగుతోంది. కేంద్ర సంస్థగా మేడిగడ్డ పునరుద్ధరణలో భాగస్వామ్యం ఉండాల్సి ఉండగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ రాయడం ఎవరిప్రయోజనాల కోసమనే విమర్శలు వ్యక్తమవుతుండగా, అధికారిక సంస్థలను రాజకీయాల్లోకి లాగడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Read Also |
Road Accident | ట్రక్కు బ్రేకులు ఫెయిల్.. 11 మంది సజీవ దహనం
పొంచి ఉన్న పాముల మధ్య కుందేలు జీవన పోరాటం.. 5 నిమిషాల వీడియో వైరల్.. చివరిలో ట్విస్ట్..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram