PDPD Pilot Project | పీడీపీఎస్ పైల‌ట్ ప్రాజెక్టు అమలుకు ముందే అడ్డంకులు?

ప‌త్తి కొనుగోళ్ళలో మ‌ద్ధ‌తు ధ‌ర త‌గ్గిన‌ప్పుడు న‌గ‌దు చెల్లించి రైతుకు అండ‌గా నిలిచేందుకు ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీం (పీడీపీఎస్) పేరుతో పైలట్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. దానితో రైతులకు ఎంత ప్రయోజనమో ఏమో గానీ.. ఈ నిర్ణ‌యానికి ఆదిలోనే మోకాలడ్డుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

PDPD Pilot Project | పీడీపీఎస్ పైల‌ట్ ప్రాజెక్టు అమలుకు ముందే అడ్డంకులు?

PDPD Pilot Project | విధాత ప్ర‌త్యేక ప్ర‌తినిధి: ప‌త్తి కొనుగోళ్ళలో మ‌ద్ధ‌తు ధ‌ర త‌గ్గిన‌ప్పుడు న‌గ‌దు చెల్లించి రైతుకు అండ‌గా నిలిచేందుకు ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీం (పీడీపీఎస్) పేరుతో వ‌చ్చే 2025 -26 కాట‌న్ సీజ‌న్ లో పైల‌ట్ ప్రాజెక్టు చేప‌ట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. అయితే.. ఈ నిర్ణ‌యానికి ఆదిలోనే మోకాలడ్డుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైల‌ట్ ప్రాజెక్టుగా వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్‌, న‌ల్ల‌గొండ మార్కెట్ల‌ను కేంద్రం ఎంపిక చేసింది. ఈ పైల‌ట్ ప్రాజెక్టు అమ‌లు జ‌రిగితే రైతుల‌కు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో తెలియనప్పటికీ.. స్కీం అమ‌లుకు ముందే కాట‌న్ మిల్ల‌ర్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో వ‌రంగ‌ల్ చాబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌లో కొత్త చిచ్చురేపింది. పీడీపీఎస్ అమ‌లుపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఇటీవ‌ల ఢిల్లీలో నీతి ఆయోగ్ ఆధ్వ‌ర్యంలో ప‌త్తి మద్ధ‌తు ధ‌ర అంశంపై చ‌ర్చించారు. ఈ స‌మావేశానికి తెలంగాణ కాట‌న్ అసొసియేష‌న్ అధ్య‌క్షుడు బొమ్మినేని ర‌వీంద‌ర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. తెలంగాణ‌లో ప‌త్తి కొనుగోళ్ళ‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయాలు, రెగ్యులేటెడ్ మార్కెట్ల‌లో ప‌త్తి నాణ్య‌త‌, బ‌హిరంగ మార్కెట్ల‌లోని ధ‌ర‌ల‌ను నిర్ధారించ‌డానికి ఎలాంటి ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌లు లేవ‌ని ఆయ‌న అన్నారు. అందుకే రాష్ట్రంలో సీసీఐ ద్వారా మిల్లుల వ‌ద్ద ప‌త్తి కొనుగోళ్ళు జ‌రుపుతున్న విధాన‌మే రైతుల‌కు మేలు చేకూరుతుంద‌ని చెప్పారు. దీని వ‌ల్ల‌నే రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని స్ప‌ష్టం చేయ‌డం తాజా వివాదానికి దారితీసింది. కాట‌న్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లతో పాటు వ‌రంగ‌ల్ చాబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడిగా కూడా బొమ్మినేని ఉండటం ఇప్పుడు వివాదాన్ని పెద్ద‌గా మార్చింది.

ఒక్కరి ప్రయోజనాలకోసమేనా?

అంద‌రి ప్ర‌యోజ‌నాల కోసం మాట్లాడాల్సిన చాంబ‌ర్ అధ్య‌క్షుడు కేవ‌లం కాట‌న్ అసోసియేష‌న్ ప్ర‌తినిధిగా మాట్లాడ‌డం ప‌ట్ల అడ్తిదారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పైల‌ట్ ప్రాజెక్టు అమ‌లుకు ముందే స‌మ‌స్య వివాదాస్ప‌దంగా మారింది. ఇదిలా ఉండ‌గా అస‌లు ప‌త్తి రైతుల అభిప్రాయాల‌ను ఇక్క‌డ ప‌ట్టించుకోకుండానే అడ్తిదారులు వ‌ర్సెస్ కాట‌న్ మిల్ల‌ర్లుగా మారింది. ఇరువ‌ర్గాల ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో ప‌త్తి కొనుగోళ్ళ‌లో సాగుతున్న అవ‌క‌త‌వ‌కలు, అక్ర‌మాలు వెలుగుచూస్తున్నాయి. పీడీపీఎస్ స్కీంను ప‌రిశీలించి స్పందించాల్సిన రైతు సంఘాలు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

పైల‌ట్ ప్రాజెక్టుకే ప‌ద‌నిస‌న‌లు

దేశంలో ప‌త్తి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ప్ర‌ధాన‌మైంది. రాష్ట్రంలో సాధార‌ణ ప‌త్తి విస్తీర్ణం 48, 93,016 ఎక‌రాలుగా ఉంది. రాష్ట్రంలో మొత్తం పంట‌ల సాగు విస్తీర్ణం 1,32,44,305లుగా ఉంది. ఇక్కడ సాగు చేస్తున్న మొత్తం పంట‌ల విస్తీర్ణంలో దాదాపు 37 శాతం ప‌త్తి సాగు చేస్తున్నారంటే ఈ పంటకు రైతాంగం ఇస్తున్న ప్రాధాన్య‌ం అర్థం చేసుకోవ‌చ్చు. రాష్ట్రంలో ప‌త్తిని మెజార్టీ జిల్లాలో ప్ర‌ధాన పంట‌గా సాగు చేస్తున్నారు. వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్‌, న‌ల్ల‌గొండ‌, జ‌మ్మికుంట వ్య‌వ‌సాయ మార్కెట్‌లలో ప‌త్తి క్ర‌య‌విక్ర‌యాలు ఎక్కువ‌గా సాగుతాయి. ప‌త్తి కొనుగోళ్ళ‌కు ఈ మార్కెట్లు ప్ర‌ధాన‌మైన‌విగా గుర్తింపు పొందాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని రైతులు ఈ మార్కెట్ల‌లో ప‌త్తి విక్ర‌యానికి వ‌స్తుంటారు. మెజార్టీ రైతులు సాగు చేస్తున్న ప‌త్తికి అన్ సీజ‌న్‌లో మంచి రేటు ల‌భిస్తున్న‌ప్ప‌టికీ సీజ‌న్ ప్రారంభం కాగానే ప్రైవేటు కాట‌న్ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధ‌ర‌లు త‌గ్గిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ప‌త్తి కొనుగోలుకు తేమ శాతం, క్వాలిటీ త‌దిత‌ర కొర్రీలు పెట్టి రైతుకు ద‌క్కాల్సిన క‌నీస ధ‌ర రాకుండా ద‌గా చేస్తున్న సంద‌ర్భాలున్నాయి. ఈ క్ర‌మంలో ప్రైవేటు వ్యాపారుల మార్కెట్ దోపిడీని అరిక‌ట్టి మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించేందుకు కాట‌న్ కార్పొరేష‌న్‌ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్ స్కీం ద్వారా కొన్నేళ్ళ‌గా కొనుగోళ్ళు చేస్తూ అండ‌గా నిలుస్తున్నారు. సీసీఐ క‌మ‌ర్షియ‌ల్ ఆప‌రేష‌న్ కూడా చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే రైతుకు మ‌ద్ధ‌తు ధ‌ర అందించి ఆదుకునేందుకు అమ‌లు చేస్తున్న ఈ స్కీంను క్ర‌మంగా ప‌క్క‌దోవ‌ ప‌ట్టించారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ స్కీం ప్రారంభంలో వ్య‌వ‌సాయ మార్కెట్ల‌లోనే సీసీఐ సెంట‌ర్లు ఏర్పాటు చేసి అడ్తిదారుల ద్వారా రైతులు మార్కెట్‌కు తెచ్చిన ప‌త్తిని ఆ రోజు ఎంఎస్‌పీపై ఆధార‌ప‌డి కొనుగోళ్ళు చేసేవారు. అయితే సీసీఐకి కొనుగోలు చేయ‌డం త‌ప్ప ఇత‌ర సిబ్బంది, ర‌వాణా త‌దిత‌ర హంగులు లేవ‌నే కార‌ణంగా కొనుగోలు సెంట‌ర్లు మిల్లుల‌కు త‌ర‌లిపోయాయి. సీసీఐకి మార్కెట్ నుంచి మిల్లుల‌కు ప‌త్తి త‌ర‌లించ‌డం త‌దిత‌ర ప్రాక్టిక‌ల్ స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీన్ని అస‌రా చేసుకుని ప్రైవేటు కాట‌న్ వ్యాపారులు, ముఖ్యంగా కాట‌న్ మిల్ల‌ర్లు రంగ ప్ర‌వేశం చేశారు. మార్కెట్లో కంటే రైతులు త‌మ ప‌త్తిని మిల్లుల వ‌ద్దే అమ్ముకుంటే సీసీఐకి ఇబ్బంది లేకుండా పోతోందని, రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతోంద‌నే అమ‌లు చేస్తున్నారు.

మిల్లుల వ‌ద్ద కొనుగోళ్ళు వ్యాపారుల‌కే ప్ర‌యోజ‌నం

ఈ ప‌ద్ధ‌తి పెద్ద, మ‌ధ్య‌త‌ర‌గ‌తి రైతుల‌కు కొంత ఉప‌క‌రిస్తున్నా.. చిన్న‌, స‌న్న‌కారు ప‌త్తి రైతుల‌కు ఉప‌క‌రిస్త‌లేద‌నే అభిప్రాయం ఉంది. త‌క్కువ మోతాదులో పంట పండ‌టం వల్ల మిల్లు వ‌ర‌కు రాకుండానే మ‌ధ్య ద‌ళారీల‌కు రూ. 500 నుంచి వెయ్యి వరకూ త‌క్కువ ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. క్వింటాళ్ళ కొద్దీ ఈ ప‌త్తిని బ్రోక‌ర్లు ప‌త్తిని సాగు చేయ‌ని పెద్ద రైతుల పేరుతో మిల్లుల వ‌ద్ద‌కు తెచ్చి విక్ర‌యిస్తున్నారు. సీసీఐ ద్వారా ల‌భిస్తున్న మ‌ద్ధ‌తు ధ‌ర‌ను వీరు పొందుతున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. పైగా, అధిక తేమ , తూకం పేరుతో రైతుల‌ను కొల్ల‌గొడుతున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. కొద్దిమంది మార్కెట్ సెక్రటరీల సస్పెన్షన్‌కు కారకులు ఎవరు? సీసీఐ అధికారులను, ప్రభుత్వ పెద్దలను సంతృప్తిపరిచింది ఎవరు? ఇన్ని తతంగాలు సీసీఐ అధికారులే జరిపారా? ఇందులో ఎవరి పాత్ర లేదా ! కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆసరాగా ఉండాలని మద్దతు ధర కల్పిస్తే రాబందుల్లా ఆ పాపపు సొమ్ముకి కక్కుర్తి పడ్డది వాస్తవం కాదా ! సీసీఐ ముసుగులో తెలంగాణలో జరిపిన “అవినీతి బాగోతం “ఢిల్లీ దాకా చేరింది వాస్తవం కాదా ! పాత పద్ధతి మంచిదైతే నీతి ఆయోగ్ నూతన విధానాన్ని ఎందుకు తీసుకువస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే ద‌ళారీల, ప్రైవేటు ప‌త్తి వ్యాపారుల‌కు చెక్ పెట్టాలంటే మార్కెట్ల‌లోనే సీసీఐ ప‌త్తి కొనుగోళ్ళు చేయాల‌ని కోరుతున్నారు. దీని వ‌ల్ల త‌మ‌కు క‌మీష‌న్ రావ‌డంతో పాటు మార్కెట్ పైన ఆధార‌ప‌డి జీవిస్తున్న గుమాస్తాలు, ద‌డువాయిలు, హ‌మాలీలు, ఎడ్ల‌బండ్ల కార్మికుల‌కు ఉపాధి ల‌భిస్తుంద‌ని అడ్తిదారులు అంటున్నారు. చిన్న‌, స‌న్న‌కారు రైతులు కూడా అడ్తిదారు ప్రోత్సాహంతో మార్కెట్‌కు వ‌చ్చి వేలంలో పాల్గొని ధ‌ర ల‌భించ‌కుంటే సీసీఐకి విక్ర‌యించే అవ‌కాశం ఉందంటున్నారు. దీని వ‌ల్ల ఎంఎస్‌పీ ద్వారా రైతుల‌కు ల‌బ్ది చెందుతుంద‌ని వాదిస్తున్నారు. చెల్లింపుల ప్ర‌క్రియ అంతా బ్యాంకుల ద్వారా చేప‌ట్టనున్నందున పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. రైతులంద‌రికీ ఖాతాలున్నందున స‌మ‌స్య ఏర్ప‌డ‌ద‌ని అడ్తిదారులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా దీనికి భిన్నంగా కాట‌న్ మిల్ల‌ర్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో జిల్లాలో అడ్డిదారులు, వ్యాపారుల మ‌ధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్ర‌మంలోనే ఈ పైల‌ట్ ప్రాజెక్టు అమ‌లుకు అడ్డంకులు సృష్టించ‌కుండా అమ‌లు చేయాల‌ని అడ్డిదారులు కోరుతున్నారు. ఇదిలా ఉండ‌గా రైతుల‌ను క‌మిష‌న్ పేరుతో ఎక్కువ వ‌సూళ్ళు చేసి అడ్తిదారులు మోసం చేస్తున్నార‌ని వ్యాపారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

Kangra train bridge collapse | వీడియో : వేల మందితో రైలు వెళుతుంటే.. కూలిపోయిన వంతెన బేస్‌..
PM Mallikarjuna Kharge? | మోదీ రాజీనామా చేస్తే ఖర్గే ప్రధాని!
Sasi Tharoor Vs Congress | కాంగ్రెస్‌ పార్టీ నుంచి శశిథరూర్‌ నిష్క్రమణ తప్పదా?