BJP on PoK | చెప్పేందుకు చేసింది లేకనే.. మళ్లీ తెరపైకి పీవోకే!
నాలుగు విడతల పోలింగ్ ముగిసిన తర్వాత పీవోకే అంశం బీజేపీ నేతల ప్రచారంలో ఎందుకు ముందుకు వచ్చింది? పీవోకే.. భారత అంతర్భాగమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని ఇప్పుడు పదే పదే ఎందుకు చెబుతున్నారు?

పదేళ్ల తర్వాత పాత అంశాలనే నమ్ముకున్న బీజేపీ నాయకులు
మళ్లీ గెలిపిస్తే పీవోకే స్వాధీనం
పదే పదే ప్రస్తావిస్తున్న బీజేపీ నేతలు
చెప్పుకొనేందుకు చేసిన పనుల్లేవు
నిరుద్యోగాన్ని తగ్గించింది లేదు..
ఆకలి కేకలను నివారించిదీ లేదు
చేసినవన్నీ తీవ్ర విమర్శలకు గురైనవే
ప్రజలను కష్టనష్టాలపాలు చేసినవే
అందుకే మళ్లీ మతంతోనే ఓట్లకు గాలం!
(విధాత ప్రత్యేకం)
నాలుగు విడతల పోలింగ్ ముగిసిన తర్వాత పీవోకే అంశం బీజేపీ నేతల ప్రచారంలో ఎందుకు ముందుకు వచ్చింది? పీవోకే.. భారత అంతర్భాగమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని ఇప్పుడు పదే పదే ఎందుకు చెబుతున్నారు? ఇటీవల హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు.. యూపీ, అసోం ముఖ్యమంత్రులు సైతం ఈ అంశాన్ని ప్రముఖంగా తీసుకొస్తున్నారు. మరోసారి గెలిపిస్తే ఈసారి పీవోకేను స్వాధీనం చేసుకుంటామని హామీలు ఇవ్వడం వెనుక కారణమేంటి?
రాజకీయ విశ్లేషకుల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తునే చర్చలు సాగుతున్నాయి. తొలి నాలుగు విడుదల పోలింగ్‌లో తాము ప్రచారం చేసిన రామ మందిరం, అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదాలు పనిచేయలేదని అర్థమవడంతోనే నాలుగో విడత తర్వాత డోసు పెంచిన బీజేపీ నేతలు హిందూ, ముస్లిం అంశాలు, పాకిస్థాన్, పీవోకే స్వాధీనం తదితరాలను ప్రముఖంగా ముందుకు తెస్తున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీ ఆశించినదానికి భిన్నంగా.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనే అంశం కాషాయ నాయకులకు అర్థమయ్యే రూటు మార్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతున్నది. ఈ పదేళ్లలో పీవోకేను స్వాధీనం చేసుకోవడానికి కేంద్రం పూనుకొంటే విపక్షాలు ఏమైనా అడ్డుకున్నాయా? అంటే.. కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి సమాధానాలు ఉండవు. కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే పన్నాగమే ఇదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చివరి మూడు విడుతల్లో పోలింగ్ జరిగే ఢిల్లీ, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గుతాయనే ప్రచారాల నేపథ్యంలో వాటిని కాపాడుకునేందుకు వేసిన ఎత్తుగడగా చెబుతున్నారు.
వాజపేయికి ఫలితాల ముందే అర్థమైంది
2004లో భారత్ వెలిగిపోతుందని బీజేపీ నినదించినా ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉన్న వాజపేయి ప్రజల నాడిని అంచనా వేసి, ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయనే సంకేతాలు పార్టీ నేతలకు ఇచ్చారని అంటారు. అందుకే పార్లమెంటులో తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఉద్వేగంగా ప్రసంగించారు. అధికారం శాశ్వతం కాదని దేశం ముఖ్యమని చెప్పారు. అందుకే 13 రోజులు పదవిలో ఉన్నా, తర్వాత 13 నెలల్లోనే తన ప్రభుత్వం కూలిపోయినా 1998లో ఎన్నికల్లో ప్రజాదరణతో అతిపెద్ద పార్టీగా అవతరించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పాలించగలిగారు. కానీ ప్రస్తుత ప్రధాని వలె ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను చీల్చలేదు. రెచ్చగొట్టే ప్రసంగాలేవీ చేయలేదు. పార్టీ సిద్ధాంతం, తాను నమ్మిన విలువలతో కూడిన రాజకీయం చేశారు.
నాడు ఎందుకు వెళ్లారు.. ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి మాట్లాడిన మాటలు, పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని గౌరవించాలంటూ మరో నేత చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ వాటితో విభేదిస్తున్నట్లు ప్రకటించింది. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. పిట్రోడా కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఖర్గే దాన్ని వెంటనే ఆమోదించారు. కానీ ఒకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని అడ్డుకోవాల్సింది పోయి ఆయనే ఈ అంశంపై రాజకీయం చేయడమే ఇప్పటి విషాదం.
ఎన్నికల సమయంలో పాకిస్థాన్ ప్రస్తావన లేకుండా మోదీ సహా ఆ పార్టీ నేతలు ఓట్లు అడగలేని దుస్థితిలో బీజేపీ ఉన్నది. ఆ పార్టీ అగ్రనేత అద్వానీ 2005లో పాక్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నాను లౌకికవాదిగా చెప్పి విమర్శల పాలయ్యారు. వాజపేయి పాక్‌కు బస్సు యాత్ర చేశారు. ఎలాంటి ఆహ్వానం అందుకోకుండానే ప్రధాని మోదీ 2015లో ఆకస్మికంగా పాక్ పర్యటనకు వెళ్లారు. దానిపై అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీటిపై కాంగ్రెస్ ఎన్నడూ రాజకీయం చేయలేదు. ప్రధాని నాడు పాకిస్థాన్ ఎందుకు వెళ్లారన్నది చెప్పకుండా ఇప్పుడు తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన సందర్భంగా శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ సందర్భంగా 2015లో తన లాహోర్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. దానికి ఆయన ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశం ఎంత శక్తిమంతమైందో పరిశీలించడానికి వెళ్లానని, పాక్ ప్రభుత్వం ఆందోళనలో ఉండటానికి తాను కారణమని గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ వాటిని రాజకీయాస్త్రాలుగా చూడలేదు
దేశ భద్రతకు సంబంధించి, శాంతిభద్రతలను కాపాడటం కోసం నాటి యూపీఏ ప్రభుత్వం కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. వాటిని ఎన్నికల రాజకీయాలకు వినియోగించుకున్న దాఖలాలు లేవు. కానీ బీజేపీ నేతలు 2024లో పదేళ్ల పరిపాలనలో ఏం చేశారో చెప్పకుండా రామ మందిర నిర్మాణం, హిందూ -ముస్లింలు, సర్జికల్ స్ట్రైక్స్, బుల్డోజర్లు ఇవే అంశాలను ప్రచారంలో పెట్టింది. మరో విచిత్రం ఏమిటి అంటే ప్రధాని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. హిందూ-ముస్లిం విభజనవాదంతో తాను రాజకీయాలు చేస్తే తన జీవితమే వ్యర్థమన్నారు. అంతకుముందు ఆయనే ముస్లింలను చొరబాటుదారులని, ఎక్కువమంది పిల్లలను కంటారని చేసిన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
పదేళ్లు పాలించిన మోదీ దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తాను దేశ ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడిగే సాహసం కూడా చేయడం లేదు. పదేళ్ల పాలన తర్వాత ఇంకా అవే హిందూ, ముస్లిం, పాకిస్థాన్ అంశాలను ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయాలు విద్యావంతుల్లో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దు కానీ, కొవిడ్ కాలంలో వలస కార్మికుల పట్ల అనుసరించిన నిర్లక్ష్యంకానీ, ఓ పద్ధతిలేకుండా అమలు చేసిన జీఎస్టీ విధానం కానీ.. ఇలా చెప్పుకొంటూ పోతే అనేక అంశాలు ప్రజలను అనేక కష్టాలకు గురిచేసినవే. గెలిపిస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో పడతాయన్న పదిహేను లక్షల ఊసే లేదు. అదే అడిగితే అదంతా జుమ్లా అని సాక్షాత్తూ అమిత్‌షానే చెప్పేశారు. ఇక నిరుద్యోగం గురించి, దేశ ఆర్థికాభివృద్ధి గురించి చెప్పుకొనేందుకు ఏమీ లేదు.
అందుకే విద్వేష ప్రచారాలు, పీవోకే ప్రస్తావనలు తెస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని గమనించే.. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి విద్వేష రాజకీయాలతో దేశ ప్రజలు విసిగిపోయారని, చాలా రాష్ట్రాల్లో స్థానిక సమస్యలే ప్రధాన అజెండా ఎన్నికలు జరిగినట్టు తెలుస్తోంది. యువత ఉద్యోగాల కోసం, రైతులు కనీస మద్దతు ధర కోసం, రుణ విముక్తి కోసం, మహిళలు భద్రత కోసం, కార్మికులు ఉపాధి కోసం, సరైన వేతనాల కోసం ఓటు వేశారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2004లో దేశమంతా ఎన్నికల ప్రచారం చేసిన వాజపేయికి ప్రజాభిప్రాయం అర్థమైంది. కానీ 2024లో మోదీకి అర్థంకాలేదా? లేక అర్థమైనా.. జనాన్ని మభ్యపెట్టేందుకు అర్థం కానట్టు నటిస్తున్నారా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.