Telangana Financial Crisis | ఆదాయం రాలే… కేంద్రం ఇవ్వ‌లే! ఆర్థిక దిగ్బంధంలో రేవంత్ రెడ్డి స‌ర్కార్‌

ఆదాయం లేక‌, కేంద్రం నుంచి గ్రాంట్స్ స‌రిగా రాక పోవ‌డంతో ఆర్థిక దిగ్బంధంలో రేవంత్ స‌ర్కారు ఉన్న‌ట్లు అర్థం అవుతున్నదని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ స‌ర్కారు రాష్ట్ర ప్ర‌భుత్వాలకు గ్రాంట్స్ విడుద‌ల చేసే విష‌యంలో రాజ‌కీయ ఉద్దేశాల‌తో చూడడం స‌రికాద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

Telangana Financial Crisis | ఆదాయం రాలే… కేంద్రం ఇవ్వ‌లే! ఆర్థిక దిగ్బంధంలో రేవంత్ రెడ్డి స‌ర్కార్‌
  • ఆశించిన ఆదాయం 1,64,397.64 కోట్లు
  • వచ్చింది 1,36,283.47 కోట్లు మాత్రమే
  • రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం నేల చూపులు
  • స‌గానికి త‌క్కువ‌గా రిజిస్ట్రేష‌న్ల ఆదాయం
  • ఎక్సెజ్ డ్యూటీ కూడా అంతంత మాత్ర‌మే
  • కేంద్రం నుంచి వ‌చ్చింది 36% నిధులే
  • కాగ్‌కు 2024-25 వాస్త‌వ బ‌డ్జెట్ లెక్క‌లు

Telangana Financial Crisis | తెలంగాణలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆర్థిక దిగ్బంధంలో ఉన్న‌ది నిజ‌మేనా? అంటే అవున‌నే అంటున్నాయి కాగ్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన ఆదాయం ఖ‌ర్చుల వివ‌రాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ‌ స్టేట్ అకౌంట్స్ రిపోర్ట్‌ను కాగ్ త‌న వెబ్ సైట్‌లో పొందుప‌రిచింది. ఇందులో మార్చి నెల‌లో వ‌చ్చిన ఆదాయం, ఖ‌ర్చుల‌తో పాటు ఏడాదిపాటు వ‌చ్చిన ఆదాయం, ఖ‌ర్చుల వివ‌రాల‌ను అందులో పేర్కొన్నది. ఆ వివరాలను పరిశీలిస్తే.. రేవంత్ స‌ర్కారు పెను ఆర్థిక దిగ్బంధంలో ఉన్నదనే అభిప్రాయం బలపడుతున్నది. రాష్ట్ర ప్ర‌భుత్వం వేసిన అంచ‌నాల‌కూ, వ‌చ్చిన ఆదాయానికీ ఆస్మాన్ జమీన్‌ ఫ‌ర‌క్ ఉంది. వివిధ ప‌న్నుల ద్వారా రాష్ట్ర ఖ‌జానాకు రూ.1,64,397.64 కోట్ల ఆదాయం వ‌స్తుంద‌నుకుంటే.. రూ.1,36,283.47 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇందులోనూ కేంద్రం నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన ప‌న్నుల్లో వాటాతో పాటు కేంద్రం నుంచి వ‌చ్చిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా క‌లిసే ఉండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా ప‌డిపోయింది. ఇది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపింది. రిజిస్ట్రేష‌న్ల ఆదాయం రూ.18,228.82 కోట్లు వస్తుందని భావిస్తే.. వ‌చ్చింది రూ.8,473 కోట్లే. అంటే 46.48 శాతం మాత్ర‌మే ఆదాయం వ‌చ్చింది. 2023-2024 సంవ‌త్సరంలో 77.27 శాతం ఆదాయం రాగా, ముగిసిన ఆర్థిక సంవ‌త్స‌రంలో వ‌చ్చిన ఆదాయం అంతంత మాత్ర‌మే. లిక్క‌ర్ ఆదాయం రూ. 25 వేల కోట్లు వ‌స్తుంద‌నుకుంటే వ‌చ్చింది రూ.18 వేల కోట్లే. నాన్ ట్యాక్స్‌ రెవెన్యూ (భూముల అమ్మ‌కాల ద్వారా వ‌చ్చే ఆదాయం కూడా రూ.12 వేల కోట్ల వ‌ర‌కూ త‌గ్గింది. ఎక్క‌డా ప్ర‌భుత్వ భూములు అమ్మే ప‌రిస్థితి కూడా రేవంత్ స‌ర్కారుకు రావ‌డం లేదు. గ‌త ప్ర‌భుత్వంలో అమ్మిన భూముల బ‌కాయిలే వ‌సూలు అవుతున్న‌ట్లు కనిపిస్తున్నది.

గ్రాంట్స్ ఇవ్వ‌కుండా ఇబ్బంది పెడుతున్నకేంద్రం

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌టం కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి మింగుడు ప‌డ‌టం లేదన్నట్టు పరిస్థితి కనిపిస్తున్నది. దేశంలో కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా దెబ్బ‌తీయాల‌న్న నిర్ణ‌యంతో ఉన్న ప్రధాని మోదీ.. తెలంగాణ సర్కారును ఆర్థికప‌ర‌ంగా ఇబ్బందికి గురి చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వివిధ ప‌థ‌కాల ద్వారా రాష్ట్రానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కంట్రిబ్యూష‌న్స్ రూ.21,636 కోట్లు ఇవ్వాల్సి ఉండ‌గా రూ.7,913 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. రేవంత్ స‌ర్కారు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ఇదీ ఒక కారణంగా మారిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

అప్పుల కోసం తిప్ప‌లు

రాష్ట్ర స‌ర్కారు రోజువారీ చిల్ల‌ర ఖ‌ర్చుల‌కు కూడా అప్పుల కోసం చూస్తోంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అసెంబ్లీలో మాట్లాడుతూ.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ తర్వాత రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేశామ‌ని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితి చూస్తే ఎక్క‌డా అప్పు పుట్ట‌డం లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్వ‌యంగా చేతులెత్తేసిన విషయం తెలిసిందే. గ‌తేడాది బ‌డ్జెట్ అప్పు రూ.48,322 కోట్లు చేశారు. బ‌డ్జెటేతర అప్పులు ఎంత ఉన్నాయ‌నే వివ‌రాలు కాగ్ వెబ్‌సైట్‌లో వెల్ల‌డించ‌లేదు. బ‌డ్జెట్ ఆమోదం పొందిన అప్పుల‌తో క‌లిపి రాష్ట్రానికి రూ. 2,74,057 కోట్ల ఆదాయం వ‌స్తుంద‌ని అంచనా వేస్తే వాస్త‌వంగా వ‌చ్చిన ఆదాయం అప్పుల‌తో క‌లిపి రూ.217,651 కోట్లు మాత్ర‌మే. 2023-24 వార్షిక ఆదాయం క‌న్నా 2024-25 వార్షిక ఆదాయం 5 శాతం త‌గ్గింది.

తెచ్చిన అప్పులు మిత్తీ చెల్లింపుల‌కేనా!

రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మార‌డంతో తెచ్చిన అప్పుల్లో స‌గానికి పైగా వ‌డ్డీలు చెల్లించ‌డానికే సరిపోతున్నట్టు కాగ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తున్నది. మార్చి 31 నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2023 డిసెంబ‌ర్ నాటి వ‌ర‌కు తెచ్చిన అప్పులకు వ‌డ్డీల కింద రూ. 26,688 కోట్లు రేవంత్ స‌ర్కార్ చెల్లించింది. బ‌డ్జెట్‌లో వడ్డీల కింద రూ.17,729 కోట్లు చెల్లించాల‌ని పెట్టినా అధిక వ‌డ్డీల భారం కార‌ణంగా రూ. 26 వేల కోట్లు చెల్లించాల్సి వ‌చ్చి ఉంటుంద‌ని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. ఇది గ‌త ఏడాది కంటే 46 శాతం అద‌నపు చెల్లింపుల‌ని కాగ్ రిపోర్ట్ స్ప‌ష్టం చేస్తున్నది. తెచ్చిన అప్పుల‌కు వ‌డ్డీ చెల్లింపులే ఎక్కువ కావ‌డంతో అస‌లు చెల్లింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముగిసిన ఏడాదిలో తెచ్చిన అప్పుల్లో అస‌లు కింద రూ.19,626 కోట్లు చెల్లించాల‌ని రేవంత్ స‌ర్కారు ల‌క్ష్యంగా పెట్టుకున్నా.. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా వాస్త‌వంగా చెల్లించింది రూ.4855 కోట్లు మాత్ర‌మే. ఆదాయం లేక‌, కేంద్రం నుంచి గ్రాంట్స్ స‌రిగా రాక పోవ‌డంతో ఆర్థిక దిగ్బంధంలో రేవంత్ స‌ర్కారు ఉన్న‌ట్లు అర్థం అవుతున్నదని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ స‌ర్కారు రాష్ట్ర ప్ర‌భుత్వాలకు గ్రాంట్స్ విడుద‌ల చేసే విష‌యంలో రాజ‌కీయ ఉద్దేశాల‌తో చూడడం స‌రికాద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. రాజ‌కీయాలు ఎన్నిక‌ల వ‌ర‌కే ఉండాల‌ని, కానీ పరిపాల‌న‌ సమయంలో కాద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. మోదీ స‌ర్కారు తెలంగాణ‌కు ఇతోధికంగా గ్రాంట్స్ విడుద‌ల చేయాల‌ని, ప‌న్నుల్లో వాటా కూడా పెంచాల‌ని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి..

CM Revanth Reddy | అదృశ్య శ‌క్తుల బిగి కౌగిలిలో సీఎం రేవంత్ రెడ్డి?
Revanth Reddy Govt | పథకాల అమలులో జాప్యమే కాంగ్రెస్‌ సర్కార్‌కు డేంజర్‌ బెల్?
Revanth Reddy Facing Trouble | రేవంత్‌ సర్కార్‌ను చుట్టుముడుతున్న సమస్యలు
CM Revanth Reddy: మా ప్రభుత్వం చేసిన నికర అప్పు రూ.4,682 కోట్లు : సీఎం రేవంత్ రెడ్డి