Medaram Restoration Controversy | మేడారం ‘పునరుద్ధరణ’పై ఎందుకీ వివాదం!? సమగ్ర విశ్లేషణ!
ఈ పనురుద్ధరణ పనులపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న మాట వాస్తం. ఇందులో కొందరు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాలు నిజాయతీతో కూడుకుని ఉన్నాయి. మరి కొందరు ఈ పునరుద్ధరణను వివాదాస్పదం చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. తమ తమ రాజకీయ లాభాపేక్షతో కొందరు ఈ ప్రయత్నం చేస్తే చేయవచ్చేమో! కానీ ఈ వివాదాలకు ఇవే కారణలని భావించి, వ్యక్తమవుతున్న అభిప్రాయాలను కొట్టిపారేయడం మాత్రం సముచితమైంది కాదు.
- ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల తీరులో అస్పష్టత
- స్పష్టమైన విధాన ప్రకటన లేకపోవడమే కారణం
- ఆదివాసీ సాంస్కతిక పునర్జీవనానికి అడ్డెవరు?
- అన్నింటికీ సమాధానం చెప్పాల్సింది సర్కారే
(రవి సంగోజు)
Medaram Restoration Controversy | సమ్మక్క సారలమ్మల మహాజాతర నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పునరుద్ధరణ పనులు చేపట్టింది. అయితే.. ఇవెందుకు వివాదాస్పదమవుతున్నాయి? ఈ పునరుద్ధరణ పనుల్లో అనేక సందేహాలు, ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి?
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పూజా విధానం, ఆధ్యాత్మిక చింతన, జీవన విధానం, వారి గొట్టు, గోత్రాలకు.. స్థూలంగా కోయల చారిత్రక వారసత్వ పునర్జీవనానికి ప్రతీకగా పునరుద్ధరిస్తున్న ఈ పనులను ఉద్ధేశ్యపూర్వకంగా వివాదం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శల్లో పాక్షికంగా నిజమున్నప్పటికీ ఈ పరిస్థితి ఉత్పన్నమవడానికి కారణమెవరు?
అన్నింటా ఆధిపత్య సంస్కృతి తన పట్టును బిగిస్తున్న ఈ ఆధునిక కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతంగా మేడారం పునరుద్ధరణ పనులు చేపట్టింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఎంతో ఉదార స్వభావంతో, విశాల భావనతో ఆదివాసీ సంస్కృతికి, ముఖ్యంగా కోయల వారసత్వ సంపదకు ప్రతీకగా ఈ పనులను తీర్చిదిద్దేందుకు సంకల్పించడం సాధారణ అంశం కాదు.
ఈ పనురుద్ధరణ పనులపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న మాట వాస్తం. ఇందులో కొందరు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాలు నిజాయతీతో కూడుకుని ఉన్నాయి. మరి కొందరు ఈ పునరుద్ధరణను వివాదాస్పదం చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. తమ తమ రాజకీయ లాభాపేక్షతో కొందరు ఈ ప్రయత్నం చేస్తే చేయవచ్చేమో! కానీ ఈ వివాదాలకు ఇవే కారణలని భావించి, వ్యక్తమవుతున్న అభిప్రాయాలను కొట్టిపారేయడం మాత్రం సముచితమైంది కాదు.
ఎవరు ఏ ఉద్దేశంతో.. ఇంకా సూటిగా చెప్పాలంటే కొందరు కుట్రపూరిత ఆలోచనతో వివాదం స్పష్టిస్తున్నారనుకున్నా… మరి కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాల్లో కొంత వాస్తముందని భావించినా… ఇంకొందరి ప్రశ్నలకు సముచితమైన సమాధానం అవసరమేనన్న అభిప్రాయం కలిగినా.. వీటన్నింటికి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన్నే ఉంది.
ఈ పనిని సక్రమంగా, సరైన పద్ధతిలో.. అవసరమైన రీతిలో అమలు చేయకపోవడం వల్ల.. ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఎంత విశాల ప్రాతిపదికన ఈ పనులకు అనుమతినిచ్చారో.. అంతే విశాలత్వంలో తాము అమలు చేస్తున్న విధానాన్ని పారదర్శకంగా ప్రజల ముందు ప్రదర్శించాల్సింది. మరీ ముఖ్యంగా.. కొనసాగుతున్న పునరుద్ధరణపై తాము నిర్ధేశించుకున్న పనికి ఆధారాలను ప్రదర్శిస్తే ఇలాంటి కాంట్రవర్సీకి అవకాశం లభించేదే కాదు. ఇక్కడే సర్కారు పప్పులో కాలేసింది. ఫలితంగా అనవసర విమర్శలకు, అవసరమైన అనుమానాలకు సరైన నివృత్తి లభించలేదు. పైగా.. సమస్య పెద్దగా మారి చర్చనీయాంశమవుతోంది. దీంతో సర్కారు విశాల దృక్పథం, మంచి ఆలోచనతో చేపట్టిన మేడారం పునరుద్ధరణ పనుల నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాన్ని పూర్తిగా పొందలేకపోతున్నది.

వివాదవుతున్న ప్రధాన అంశాలివే!!
తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ. 251 కోట్ల వ్యయంతో ఈసారి మేడారం జాతర నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు 101 కోట్లు మేడారం గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ కోసం ఖర్చు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ పునరుద్ధరణలో వివాదమవుతున్న లేదా ప్రశ్నిస్తున్న లేదా అనుమానం వ్యక్తం చేస్తున్న ముఖ్యాంశాలు ఒకసారి గమనిద్దాం.
మొదటిది..
మేడారంలోని గద్దెల ప్రాంగణంలో శాశ్వత కట్టడాల నిర్మాణం.. అంటే రాతి ప్రాకార నిర్మాణం చేపట్టడం సరైందేనా? సహజ సిద్ధంగా ఉండే వాటిచుట్టూ కొత్తగా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం సరైందేనా?
రెండోది..
వనదేవతల గద్దెల చుట్టూ శాశ్వత నిర్మాణాలు… అంటే రాతి కట్టడాలు కట్టడం సరైందేనా?
మూడోది..
గతంలో ఉన్నట్లు కాకుండా గద్దెల స్థలాలు మార్చడం సరైందేనా? అంటే.. సమ్మక్క, సారలమ్మ గద్దెలను మార్చనప్పటికీ పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను మార్చి.. ఒకే వరుసలో నిర్మించడం సరైందేనా?
నాలుగు..
గద్దెల ప్రాంగణంలో నిర్మించిన రాతి స్తంభాలు, ప్రాకారం, పెద్ద రాతి ద్వారాలకు ఉపయోగించిన రాతి స్తంభాలపై.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రకు సంబంధించివని ప్రకటిస్తూ చెక్కిన 7వేల బొమ్మలు.. ఆదివాసీలకు సంబంధించినవేనా?
ఐదవది..
ఆదివాసీ సంస్కృతిపై బ్రాహ్మణీయ ఆధిపత్యమంటూ చెక్కిన బొమ్మల్లో శివలింగం, మూడు నామాలు, శంకుపై అనుమానాలు వ్యక్తం చేయడం ఒక అంశమైతే.. దీనికి భిన్నంగా చెక్కిన స్వస్తిక్ గుర్తు.. హిందూ స్వస్తిక్ తరహాలో లేదనే అభ్యంతరం మరోటి.
ఆరు..
ప్రధానంగా వనదేవతలు కొలువైన మేడారానికి ఉండే ప్రత్యేకతకు ఏమన్నా భంగం వాటిల్లుతున్నదా?
ఏడవది..
పునరుద్ధరణ నిర్మాణాల తీరుకు, చేపట్టిన పనులకు, చెక్కిన బొమ్మలకు ఆధారాలేంటి? వాటి చారిత్రక నేపథ్యం ఏంటి?

సర్కారు గుర్తించినా…అమలులో లోపం
వనదేవతలుగా కీర్తించబడుతున్న సమ్మక్క, సారలమ్మల పూర్వీకులైన.. అణగారిన కోయ తెగకు సంబంధించిన చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక, సంప్రదాయ చరిత్ర.. భద్రంగా బంగారు అక్షరాల మధ్య భద్రపరిచి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు. వారి చరిత్ర రాసిపెట్టి, మంచి బైండింగ్ చేసిన పుస్తకంగా లభిస్తే ప్రస్తుత వివాదాలకు హేతువుగా మారేదికాదు. ఇక్కడే అసలైన సమస్య ఉంది.
మంచి ప్రయత్నం చేస్తున్నపుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. వాటిని ప్రదర్శించడంలో జరిగిన లోపమే ముఖ్యకారణంగా భావించాల్సి వస్తోంది. ఎందుకంటే.. మేడారం గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ అంటే అనేక విశ్వాసాలు, సంప్రదాయాలు, వారసత్వానికి సంబంధించి.. కోట్లాది మంది సెంటిమెంట్లకు సంబంధించిన అంశం. ఇదే ఇక్కడ అత్యంత ప్రధానమైంది. అందుకే ఈ పనిని చేపట్టాలంటే ధైర్యమే కాదు… పనికి పూనుకోవడం కత్తిమీద సాములాంటిదే. ఈ అంశాన్ని ప్రభుత్వం గుర్తించినప్పటికీ.. దాన్ని అమలు చేయడంలో జరిగిన విధానపరమైన లోపమే తాజా వివాదాలకు కారణంగా భావించాల్సి వస్తోంది. తాము చేపట్టిన కార్యక్రమంలో చిత్తశుద్దిని నిరూపించుకునే పద్ధతిని అనుసరించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఈ లోపాన్ని సరిదిద్దాల్సి ఉన్నది. బహిరంగంగా లేదా అవసరమైన చోట.. ఆ చారిత్రక లేదా తమ వద్ద అందుబాటులో ఉన్న ఆధారాలను ప్రదర్శిస్తే ఈ చర్చకు ముగింపు పలకడమే కాదు.. చేపట్టే పనులపట్ల విశ్వసనీయతతో పాటు చరిత్రను మరో మెట్టెక్కించే అవకాశం లభిస్తుంది. ఆగ్రహావేశాలతోనో, అనవరసమైన ఆరోపణలు, విమర్శలతోనో దాడి, ప్రతిదాడులు చేయడం వల్ల నష్టమే తప్ప ముందడుగు ఉండదనే అంశం ఇక్కడ ప్రధానమైంది.
శాశ్వత ఆలోచణ ఫలితమే ‘పునరుద్ధరణ’
మేడారం జాతర గతంలోనూ, ఇప్పుడు కూడా అధికారికంగా వారం రోజుల జాతరే. ఎందుకంటే గద్దెల ప్రాంగణంలో వనదేవతలు కొలువు తీరేది ఈ వారం రోజులు మాత్రమే. కొన్నేండ్ల క్రితం వరకు ఈ వారం రోజులు మాత్రమే జాతర జరిగేది. లక్షల మంది భక్తులు తరలివచ్చేవారు. ఆ తర్వాత ఎలాంటి సందడీ ఉండేది కాదు. కానీ.. అందుబాలులోకి వచ్చిన ఆధునిక రవాణా సౌకర్యాలు, గిరిజనులతోపాటు.. గిరిజనేతరుల్లోనూ మేడారం వనదేవతలపై విశ్వాసం పెరగడంతో జాతర సమయంలోనే కాకుండా ఇతర సమయాల్లోనూ మేడారాన్ని సందర్శిస్తున్నారు. దీంతో జాతరకు నెల రోజుల ముందుగానే రద్దీ పెరుగుతోంది. గత కొన్నేండ్లుగా ఏడాది పొడవునా మేడారాన్ని సందర్శించి.. మొక్కులు సమర్పిస్తున్నవారూ కనిపిస్తున్నారు. గతంలో జాతర సమయంలోనే ఇక్కడ వసతులు కల్పించే వారు. కానీ, ఇటీవల నిత్యం భక్తుల సందర్శన పెరగడంతో మేడారంలో శాశ్వత వసతులు కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ప్రోద్భలంతో మేడారంలో మాస్టర్ ప్లాన్ అమలుకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డికి కూడా మేడారం సెంటిమెంట్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాశ్వత వసతులతో పాటు భక్తులు సులువుగా సందర్శించే విధంగా గద్దెల ప్రాంగణంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గతంలోని ప్రాకారం స్థానంలో శాశ్వత నిర్మాణం వైపు.. అవికాస్తా రాతికట్టడాల నిర్మాణం దిశగా మారాయి.
పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల మార్పు… నాలుగు గద్దెల చుట్టూరా రాతి స్థంభాల నిర్మాణం… పాత ఫెన్సింగ్, గోడ స్థానంలో రాతి ప్రాకారం… భారీ రాతి ద్వారాల నిర్మాణం.. కొత్తగా ప్రణాళికలోకి వచ్చాయి. ఎలాగూ రాతి నిర్మాణాలు చేస్తున్నారు కాబట్టి.. వాటిపై ఆదివాసీల అంటే సమ్మక్క, సారలమ్మల వారసత్వంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోయల చారిత్రిక, ఆధ్యాత్మిక, జీవన విధానాన్ని చాటిచెప్పే బొమ్మలు చెక్కేందుకు నిర్ణయించారు.
ఈ ప్రణాళిక అమలు కోసం ముందస్తు కసరత్తు బాగానే చేపట్టారు. పూర్తి సెంటిమెంట్, సంప్రదాయంతో కూడుకున్న అంశం కాబట్టి అనేక సమావేశాల అనంతరం తుది ప్రణాళిక రూపొందించారు. ఈ అంశంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకున్నది. ముఖ్యంగా జాతర పూజారులు, కోయ పెద్దల అభిప్రాయాలు, విశ్వాసాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రిగా ఉండటం ఈ ప్రాజెక్టుకు కలిసొచ్చిన అంశం. ప్రస్తుతం సాగుతున్న పనుల పూర్తికి ప్రభుత్వం వంద రోజుల టార్గెట్ పెట్టుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19న ప్రారంభోత్సవానికీ సిద్ధమవుతున్నారు.
పారదర్శక ప్రకటన, ఆధారాలు ముఖ్యం
మేడారం పునరుద్ధరణ పనులపై సందేహాలు వ్యక్తం చేస్తున్నవారిలో నిజాయతీతో కూడుకున్నవారున్నారు. కొందరు రాజకీయ స్వార్ధపరులున్నారు. ఎవరిది ఏ కారణమైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం తెలంగాణ సర్కారుదే. ఈ లోపం కారణంగా సమస్య తీవ్రమైంది. ఆదివాసీ పూజారులు, పెద్దల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నామని ప్రభుత్వాధినేతలు స్పష్టం చేస్తున్నారు. నిజానికి వారి అంగీకారం ఉన్నందునే పనులు సాఫీగా సాగుతున్నాయి. కానీ, కోయల చరిత్ర, వారసత్వం, సంస్కృతి అంటూ బొమ్మలు చెక్కారు. అందులో కొన్నింటిపై సందేహాలు వ్యక్తమవుతున్న ఈ తరుణంలో.. చారిత్రక అంశాలతో ముడివడిన వీటిని సావధానంగా, వీలైతే సరైన ఆధారాలతో నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, ఇక్కడే లోపం జరుగుతోంది. ఈ శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి ముందే ప్రభుత్వం .. స్పష్టమైన వివరాలతో కూడిన ‘విధాన ప్రకటన’ చేస్తే బాగుండేది. దానికి సబంధించిన అంశాలు, వీలైతే ఆధారాలు పొందుపరిస్తే సందేహాలకు సమాధానం చెప్పినట్లుండేది. వాటిని రికార్డు చేయడం వల్ల భవిష్యత్ తరాలకు సైతం ఉపయోగకరంగా ఉంటాయి.
కోయల చరిత్ర, లింగం, నామాలు, స్వస్తిక్ పోలిన బొమ్మలపై అనుమానాలు వ్యక్తం చేస్తే మంత్రులు , మరో పరిశోధకుడు జవాబులు చెబుతూ వచ్చారు. ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పడం కాకుండా ఈ నిర్మాణాలకు ముందే ఏ అంశాల ప్రాతిపదికన, ఎవరి పరిశోధన ఫలితాల పై ఆధారపడి ఈ శాశ్వత నిర్మాణాలు, బొమ్మలు చెక్కుతున్నామనే విషయాలు తేటతెల్లం చేస్తే ఇంతగా వివాదానికి తావిచ్చే అవకాశం ఉండేది కాదు. అంతేకాదు.. కావాలని వివాదం చేయాలనుకునే వారికి కూడా చెక్ పెట్టేందుకు వీలుండేది. ఇది ఆదివాసీలకు సంబంధించిన అంశమే అయినప్పటికీ చారిత్రాత్మకమైన అంశాలున్నందున.. పారదర్శకత కూడా అంతే అవసరం.
సమాధానమే సరైన మార్గం
మేడారం జాతరలో చెక్కిన బొమ్మలు, ఇతరత్రా వాటిని ప్రశ్నించే వారిపై.. వారిది తప్పైనప్పటికీ.. ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల విషయం పలుచనవుతోంది. నిజమే! చాలా సంవత్సరాల తర్వాత ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయం, కట్టుబాట్లు, జీవనవిధానం, గొట్టు, గోత్రాలను రక్షించేందుకు అవకాశం లభించి ఉండవచ్చు! ప్రకృతి సిద్ధాంతంపై ఆధారపడినందున ఆదివాసీలు స్వస్తిక్‌కు భిన్నమైన గుర్తును వినియోగించి ఉండవచ్చు. పంచభూతాల పై ఆధారపడిన జీవితం ఆదివాసీలది. కాదనలేము. ఆదివాసీ తలపతులు, వడ్డెల ఆలోచనలు, అనేక మంది రిసెర్చ్, కోయజాతి అస్థిత్వం, తాళపత్రాలు, ఐసోలేటెడ్ పూజావిధానం, కల్చర్, జీవనవిధానం, సమ్మక్క, సారలమ్మల అర్కియోలజీ ఇండిజీనల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కృషి.. ఇవన్నీ వారు చెప్పినట్లుగానే వెయ్యి ఫీల్డ్ వర్కులు, వందల వేల్పు జాతరలపై పరిశోధన చేసిన ఫలితమై ఉండొచ్చు. దీని ఫలితంగా స్వల్ప కాలంలో 7వేల బొమ్మలు వేసి ఉండొచ్చు.

ఇదిలా ఉండగా రాతికట్టడం పై చెక్కిన నామం తిరుమల వెంకన్న నామం కాదని, పగిడిద్దరాజు నిలువు బొట్టుగా, గొట్లల్లోని నిలువు బొట్ల ఆధారంగా రూపొందించినట్లుగా పరిశోధకులు చెబుతున్నారు.
భారత దేశ చరిత్ర మొత్తమే ఆదివాసీలదని అనుకున్నప్పుడు… దేశంలో పురాతన దేవాలయాలు, కట్టడాలు ఎవరివి? అక్కడి అర్కిటెక్చర్ ఎవరిదంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాతి స్తంభాల పైన చెక్కిన శంఖమైనా.. స్వస్తిక్ అయినా శూలమైనా ముందుగా ఆదివాసీలదే అవుతోందని ప్రకటించారు. భారత దేశమే ఆదివాసీలదనే విధంగా చరిత్రను నిర్మించబోతున్నామని ప్రకటించారు. దీనిలో భాగంగానే మేడారంలో తొమ్మది ఆర్చ్‌లు, 32 పిల్లర్లు, 64 ప్యానెళ్ళ పైన 7వేల బొమ్మలు చెక్కినట్లు వివరణలు ఇస్తున్నారు. అయినప్పటికీ.. ప్రశ్నించే వారికి, సందేహాలు వ్యక్తం చేస్తున్నవారికి ఇదొక్కటే సరైన సమాధానం కాదు. అవసరమైన ఆధారాలు ప్రదర్శించే విధంగా వ్యవహరిస్తే.. కోయచరిత్ర మరింత ద్విగుణీకృతమవుతుంది. ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకుంటామని, ఆదిమ చరిత్రను, ఆదివాసీల చరిత్రను అడ్డుకునే విధంగా చేస్తే సమ్మక్క,సారలమ్మల ఆగ్రహానికి గురవుతారని శాపనార్ధాలు పెట్టడం వారికి ఆత్మ సంతృప్తినివ్వవచ్చేమోగానీ, మేడారం పునరుద్ధరణ ప్రణాళికలో చేపట్టిన పనులు, నిర్మాణాలు, శిల్పాలు, ఆకృతులు, బొమ్మలకు హేతువేంటిది? ఏమిటా ఆధారాలనేదే ఇక్కడ ప్రధానం. అందుకే.. ఇదిగో వారి చరిత్ర!! వారి వారసత్వానికి సాక్ష్యాలివిగో!! అంటూ సగర్వంగా ప్రభుత్వం ద్వారా ప్రకటించినప్పుడు మాత్రం అది.. సరైన, తిరుగులేని సమాధానమవుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram