- రాజకీయ పక్షాల నుంచి ఆహ్వానాలు
- సీపీఐ, టీఆర్పీ, టీఆర్ఎస్ నేతల పిలుపులు
- ఇటీవల సీపీఐ నేతలతో కొందరు భేటీ
- ఆచితూచి అడుగులేస్తున్న పలువురు నేతలు
- కొత్త నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
- లొంగిపోయిన వారిపై పోలీసు నిఘా నేత్రం
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
భారీ సంఖ్యలో వరుసగా ప్రభుత్వం ముందు లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు? అనే ప్రశ్నలు కొద్ది నెలలుగా ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా మావోయిస్టు పార్టీలో కీలక భూమిక పోషించి, లొంగిపోయిన తెలంగాణ, ఏపీకి చెందిన అగ్రనేతల దారెటు అనే విషయంలో వామపక్ష సమూహాల్లో కొంత ఆసక్తి కూడా నెలకొంది. లొంగిపోయిన సందర్భంలో అగ్రనేతల్లో కొందరు తమ తమ పరిస్థితుల మేరకు వివిధ కారణాలను, తమ మనోభావాలను వ్యక్తం చేశారు. ఇందులో కొందరు తాజా పరిస్థితుల్లో మరో మార్గం లేక లొంగిపోయినట్లు ప్రకటిస్తూనే తాము ఇంతకాలం నమ్మిన రాజకీయ, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు. సాయుధులుగా కాకుండా రాజ్యాంగ చట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం పోరాడుతామని ప్రకటించారు. ఎక్కడ ఉన్నా.. తమ ప్రజా ‘రాజకీయ కార్యాచరణ’ కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు.
కొందరు నాయకులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో ఎవరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ మావోయిస్టు పార్టీ మాజీ నేతలను కొన్ని రాజకీయ పక్షాలు తమతమ పార్టీల్లో చేరాలంటూ ఆహ్వానించడం విశేషం. మావోయిస్టులు తుపాకులు విడిచిపెట్టి తమ పార్టీల్లో చేరాలంటూ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్‌తోపాటు వివిధ పార్టీల నేతలు బహిరంగంగా ఆహ్వానాలు పలికిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎన్టీఆర్ లాంటి వారు నక్సలైట్లు దేశభక్తులంటూ కీర్తించిన చరిత్ర ఉంది. తాజా సీఎం రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టులకు తమ పార్టీల్లో చేరాలంటూ ఆహ్వానం పలికిన సందర్భాలున్నాయి. కొన్ని సందర్భాల్లో నక్సలైట్లు కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు, చర్చలు సాగిన చరిత్ర కూడా ఇటీవల కాలం వరకు ఉన్న విషయం మరిచిపోలేమంటున్నారు.
రాజకీయ పక్షాల బహిరంగ ఆహ్వానం
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు, కార్యకర్తలు తమ తమ రాజకీయ పార్టీల్లో చేరి తమ సామాజిక జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలంటూ ఆయా పార్టీల నేతలు ఆహ్వానించడం గమనార్హం. దశాబ్దాలుగా త్యాగనిరతితో పీడిత ప్రజల కోసం పనిచేసిన ఈ నాయకులు ‘పరిస్థితులు’ అనుకూలించని తాజా వాతావరణంలో తమ జీవితాలను ప్రజల కోసమే వినియోగించేందుకు తమ పార్టీలను వేదికలుగా మార్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. బహిరంగ ఆహ్వానాలతో పాటు తమ పరిధిలో ఉన్న పరిచయాలు, అనుబంధాల మేరకు ఆయా వ్యక్తులు, శ్రేణులకు ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ఆహ్వానాలు పంపుతున్న పార్టీలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీగా సీపీఐ ముందున్నది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, సంగ్రామ్, చంద్రన్న తదితరులు కొద్ది రోజుల క్రితం వెళ్ళి ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకత్వంతో సమావేశమయ్యారు. అటవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులంతా సీపీఐలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కగార్ అపరేషన్‌కు వ్యతిరేకంగా సీపీఐ, పీపీఎం తదితర వామపక్షపార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు, మేధావులు అనేకమంది అనేక రూపాలలో ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అడవుల్లో ఉన్న మావోస్టులు ప్రాణాలు కాపాడబడాలని కోరుకున్నారని గుర్తు చేశారు. తమ మధ్య మర్యాదపూర్వక సమావేశం జరిగిందని రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు జరిపి, వారి భవిష్యత్తు ఏమిటి అనే దానిపై చర్చిస్తామని కూనంనేని వెల్లడించారు. తమ ఆలోచనలను వారితో పంచుకుని, తెలంగాణణకు, దేశానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. దేశంలో మతోన్మాద, ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా బలంగా నిలబడగల శక్తి కమ్యూనిస్టు ఉద్యమానిదేనని అభిప్రాయపడ్డారు. దేవ్‌జీ మాట్లాడుతూ సీపీఐ నేతలను మర్యాదపూర్వకంగా కలిసేందుకే వచ్చామని వెల్లడించారు.
ఇక సీపీఎం బహిరంగంగా ఆహ్వానం పలకకపోయినప్పటికీ ఆ పార్టీలోని జీ రాములు లాంటి కొందరు నాయకులు మావోయిస్టు మాజీ నేతలు తమ భవిష్యత్ జీవితాలను ప్రజా ‘రాజకీయ’ కార్యకలాపాల్లో కొనసాగించాలంటూ సూచిస్తున్నారు. ఇక బీసీలు, సామాజిక న్యాయం పేరుతో కొత్తగా తెరపైకి వచ్చిన తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, కేసీఆర్ కుమార్తె కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు మాజీ మావోయిస్టులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఇటీవల మాజీ మావోయిస్టు నాయకురాలు పటేల్ వనజ ఆధ్వర్యంలో పలువురు మాజీ మావోయిస్టు కేడర్ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో టీఆర్పీలో చేరారు.
గతంలో భిన్నమైన పరిస్థితి
దశాబ్దాలుగా దేశంలో మావోయిస్టులు పనిచేస్తున్న నేపథ్యంలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు వివిధ కారణాలతో లొంగిపోయిన సందర్భాలూ, జనజీవన స్రవంతిలోకి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు తమ అజ్ఞాత జీవితంలో అరెస్టు తర్వాత బహిరంగ జీవితాలు కొనసాగించిన వారున్నారు. మావోయిస్టు అగ్రనేతలు సత్యమూర్తి, కొండపల్లి, ముక్కు సుబ్బారెడ్డితో పాటు మరి కొందరు తమ రాజకీయ భిన్నాభిప్రాయాలు, అనారోగ్య కారణాలతో లొంగిపోయిన సంఘటనలున్నాయి. ఇలా లొంగిపోయినవారు, అరెస్టు అయిన వారు తమ తమ వ్యక్తిగత సంసిద్ధత మేరకు తమ అనుకూల రాజకీయ పార్టీల్లో, ప్రజాసంఘాల్లో చేరారు. కొందరు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ ఇతర పార్టీల్లో చేరారు. ఒకరిద్దరు బీజేపీలో చేరారు. కొంత మంది ఆ తర్వాత క్రమంలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. రాజకీయ పార్టీల్లో చేరి స్థానిక ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేస్తున్న వారున్నారు. మరి కొందరు వ్యక్తిగత జీవితాలను కొనసాగిస్తూ వచ్చారు. ఈ దశాబ్దాల కాలంలో ఈ విధంగా లొంగిపోయిన వారి సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ తమతమ వ్యక్తిగత నిర్ణయాల మేరకు జీవితాలను కొనసాగిస్తూ వచ్చారు. ఈ లొంగుబాట్లకు భిన్నంగా కగార్ ఆపరేషన్ తీవ్రత తర్వాత ఈ మధ్యకాలంలో పెద్ద సంఖ్యలో వరుసగా మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇందులో దశాబ్దాలుగా అజ్ఞాత జీవితాలు కొనసాగించిన ముఖ్యమైన నేతలు, కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులు, వివిధ హోదాల్లో మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించిన వారు ఉన్నారు. గత లొంగుబాట్లకు తాజా లొంగుబాట్లకు కొంత తేడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కగార్ లొంగుబాట్లకు తేడా
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ తీవ్రత క్రమంలో భారీగా లొంగుబాట్లు చోటు చేసుకున్నాయి. మొన్నటి మార్చి 31వ తేదీ డెడ్‌లైన్ విధించి ఈ లోపు మావోయిస్టులు లొంగిపోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అల్టిమేటమ్ జారీ చేసిన నేపథ్యం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యభారతంలోని అటవీప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాల కూంబింగ్ తీవ్రత కారణంగా ఆ ప్రాంతం కేంద్రంగా పనిచేసిన అనేక మంది మావోయిస్టు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒరిస్సా, ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల ముందు లొంగిపోయారు. ఈ పరంపరం మొన్నటి వరకు తీవ్రంగా సాగింది. ఇందులో తెలంగాణకు చెందిన నేతలు సోనూ, సతీష్, దేవ్‌జీ, సంగ్రామ్, చంద్రన్నతో పాటు అనేక మంది నాయకులు, కేడర్ ఉన్నారు.
నిఘా నీడలోనే..
లొంగిపోయిన మావోయిస్టులపై ప్రస్తుతం పోలీసు, ప్రభుత్వ నిఘా ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలం కుదుటపడిన తర్వాత మాజీ మావోయిస్టులు తమ దారెటనేది మూకుమ్మడిగా నిర్ణయించుకుంటారా? వ్యక్తులుగా, సమూహాలుగా నిర్ణయించుకుంటారా? అనే మరో చర్చ ఉంది. ఎందుకంటే ఈ లొంగుబాట్లకు ముందే మావోయిస్టు పార్టీలోని ముఖ్యనేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏక నిర్ణయం తీసుకునే అవకాశం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయినప్పటికీ తమ మధ్య సంబంధాల మేరకు నిర్ణయం తీసుకోవడమో? వారు చెప్పినట్లు ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తం చేసే దిశగా పయనించడమో? ఆచితూచి తమ రాజకీయ భవిష్యత్ తేల్చుకునే అవకాశం ఉందంటున్నారు. లొంగిపోయిన ముఖ్యనాయకుల్లో ఎక్కువ మంది అనుభవజ్ఞులు, రాజకీయ పరిపక్వత కలిగిన వారు కావడం గమనార్హం. ఎక్కువ మంది వయస్సు కూడా 40 నుంచి 50కి పైగా ఉన్నవారు కావడాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేస్తున్నారు.
