భూ భారతి చట్టం అమలు అట్టర్‌ఫ్లాప్‌.. కారణాలివే…

అనేక మంది నిపుణులు కూర్చొని, చర్చించి, అనేక నమూనాలు పరిశీలించి.. తెలంగాణ కోసం సమగ్ర భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినా... అమలులో చిత్తశుద్ధి లోపించడంలో ఆ చట్టం అట్టర్‌ఫ్లాప్‌ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో విధాత ప్రత్యేక కథనం.

విధాత, హైదరాబాద్:

రాష్ట్రంలో అందరినీ సంప్రదించి దేశంలోనే అత్యుత్తమ చట్టంగా ‘భూ భారతి’ని తీసుకొచ్చామని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నా.. క్షేత్రస్థాయిలో ఇంకా బాలారిష్టాలను కూడా దాటలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పిన మాట ప్రకారం చట్టం తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. మార్గదర్శకాల అమలులో అంత నిబద్ధతతో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారాల వికేంద్రీకరణ సరిగ్గా లేకపోవడంతో దరఖాస్తులు జిల్లా కలెక్టర్ల వద్దకే చేరుతున్నాయని రైతులు అంటున్నారు. దరఖాస్తుల పరిశీలన అంత వేగంగా జరగడంలేదనే అపవాదును రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నది.

ధరణి పోర్టల్‌లో భూదందాలు

కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి వెబ్ పోర్టల్‌లో భూ దందాలు జరిగాయని, యజమానికి తెలియకుండానే మార్పిడి జరిగిందని, ఇలా వేల ఎకరాల ప్రభుత్వ భూములు పరాధీనం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా, భూ యజమానులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు భూ భారతి చట్టం తీసుకువచ్చామని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది.

అయితే గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో అధికారుల వైఫల్యం, రెవెన్యూ శాఖ బాధ్యతారాహిత్యం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరణి పోర్టల్‌ను పూర్తిగా మార్చకుండా పైపైన మార్పులు చేసి భూ భారతిగా తీసుకువచ్చారనే వాదనలూ ఉన్నాయి.

రైతులు తెల్లకాగితం తన సమస్యను రాసి అందచేస్తే తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా అమలు కావడం లేదని తెలుస్తోంది. సమస్యలతో వచ్చిన రైతులను.. ‘మీ సేవా కేంద్రం’లో డబ్బు చెల్లించి దరఖాస్తు చేయాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని ఆదేశించి, పరిష్కరించే బాధ్యతను సీసీఎల్ఏతోపాటు జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఈ ప్రయోగం పూర్తిగా వికటించి వ్యతిరేకతను మూటగట్టుకున్న విషయం విదితమే. గత ఏడాది ఏప్రిల్ 14 వ తేదీన భూ భారతి చట్టం ప్రారంభం సందర్భంగా… గ్రామాలకు వెళ్లి రైతు సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కానీ రైతులు అందచేసిన దరఖాస్తులు జిల్లా కలెక్టర్ల వద్దకు వెళ్లి పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో పడుతున్నాయి. చట్టం వచ్చిన తరువాత మూడు నెలల పాటు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సక్రమంగానే పరిష్కరించారు. ఆ తరువాత నుంచి రెవెన్యూ అధికారులు ఈ విధానాన్ని అటకెక్కించడంతో రైతుల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

సాదాబైనామాల పరిష్కారం కోసం రేవంత్‌ సర్కార్‌ కృషి

బీఆర్ఎస్ హయాంలో స్వీకరించి పరిష్కరించకుండా పెండింగ్‌లో పెట్టిన సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైకోర్టులో స్టే ఉండగా, దరఖాస్తుదారులకు అనుకూలంగా వెకేట్ చేయించడంతో లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి వెబ్ పోర్టల్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఐసీకి అప్పగించి రైతుల రికార్డులకు సంపూర్ణ రక్షణ కల్పించారు. ధరణి పోర్టల్‌లో కొన్ని మార్పులు చేసి భూ భారతిగా మార్చి అమలులోకి తెచ్చారు. చట్టం అమలులోకి వచ్చేనాటికి పూర్తిగా డిజైన్ మార్చాల్సి ఉండగా ఆ పని చేయలేకపోయారని రైతులు అంటున్నారు. ప్రతి రైతు తహశీల్దార్ కార్యాలయం లేదా ఆర్డీవో కార్యాలయం, గ్రామ స్థాయి జీపీవోకు నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును రెవెన్యూ శాఖ కల్పించలేకపోయిందని చెబుతున్నారు.

గ్రామ కంఠం, వ్యవసాయేతర భూములకు ఆర్ఓఆర్ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ప్రకారంగా ఆర్ఓఆర్ ను తయారు చేయడంలేదంటున్నారు.

నిపుణులు తయారు చేసిన చట్టం

భూ భారతి చట్టం ఒక పెద్ద కసరత్తు తరువాత కార్యరూపం దాల్చింది. ఈ చట్టాన్ని సమస్యల పరిష్కారం, భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే భూ భారతి చట్టం ఉత్తమమైన, మెరుగైన చట్టం అని నిపుణులు చెబుతున్నారు. పూర్తి ప్రజాస్వామ్య వాతావరణంలో వచ్చిందని గుర్తు చేస్తుననారు. అనేక మంది వ్యవసాయ రంగ నిపుణులు, మేధావులు, రైతులు, రెవెన్యూ విభాగంలో పనిచేసిన అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి ముసాయిదా బిల్లు రూపొందించారు. ముసాయిదా బిల్లును ప్రజల ముందు పెట్టి అభిప్రాయాలు, అభ్యంతరాలు కూడా స్వీకరించారు. ఆ తరువాత ముసాయిదా బిల్లును అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చకు పెట్టి చట్టం తీసుకువచ్చారు.

భూ భారతి చట్టంపై సీసీఎల్ఏ మొదలు అధికారుల వరకు అవగాహన కల్పించారు. చట్టం అమలులోకి వచ్చిన తరువాత తొలుత మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరించకుండా ఏవో కారణాలు చెప్పి తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఆ తరువాత నుంచి సదస్సులు నిర్వహించడం లేదు, రాతపూర్వకంగా ఇచ్చే దరఖాస్తులను కూడా స్వీకరించడం లేదంటున్నారు. ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయకపోవడం మూలంగా తమ సమస్యలను చెప్పుకునే అవకాశం రైతులకు లేకుండా పోయిందంటున్నారు.

Read Also |

విధాత ప్రత్యేకం: ఉగాండా అడవుల్లో ‘చింపాంజీల అంతర్యుద్ధం’!
చంద్రునిపై ట్రంప్‌ టవర్‌.. ఎప్పటిలోగా.. నెటిజన్ల రియాక్షనేంటి?
టెమ్రీస్‌లో నిధుల దుబారా.. ఫోన్‌లో ఆరోగ్య సూచనలు.. స్వచ్ఛంద సంస్థకు నెలకు ఆరు లక్షలు చెల్లింపు
కొత్త ఇళ్ల కొనుగోళ్లకు హైదరాబాదీల విముఖత.. కారణాలివే

Latest News