RTI Act | సమాచార హక్కు చట్టం కమిషనర్ పదవుల భర్తీ ఎప్పుడు?
రాష్ట్ర సమాచార హక్కు ముఖ్య కమిషనర్ పదవి కోసం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పోటీపడ్డారని తెలుస్తున్నది. వాస్తవానికి ఆమె పదవీకాలం ఈ నెలాఖరు వరకు ఉన్నప్పటీకి, సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె సన్నిహితులు వ్యాఖ్యానించారు.

వేల దరఖాస్తులు పెండింగ్
కమిషన్ కార్యాలయంలో అప్పీళ్ల గుట్టలు
సమాచారం ఇవ్వకుండా సతాయిస్తున్న అధికారులు
(విధాత ప్రత్యేకం)
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌లో ముఖ్య కమిషనర్, కమిషనర్ల పదవుల భర్తీపై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదు. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నా ప్రభుత్వాలకు పట్టింపు లేదు. 6 వారాల్లో ఎంపిక పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో ఆదేశించింది కూడా. కమిషనర్లు లేకపోవడంతో వేలాది అప్పీళ్లు రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ లో పేరుకుపోయాయి. ఇదే అదునుగా ప్రభుత్వ అధికారులు.. ప్రజలు అడిగిన దరఖాస్తులకు సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్‌లో ముఖ్య కమిషనర్, కమిషనర్ల పోస్టులు రెండు సంవత్సరాలకు పైగా ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం గతేడాది తెలంగాణ ప్రభుత్వం జూన్ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. పలువురు న్యాయవాదులు, జర్నలిస్టులు, పదవీ విరమణ చేసిన అధికారులు దరఖాస్తు సమర్పించారు. ఈలోపు అసెంబ్లీకి ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వం రావడంతో ఆలస్యం అయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దరఖాస్తుల వడపోత కార్యక్రమం జరగలేదు.
ఏప్రిల్ 5వ తేదీన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. లోకాయుక్త, ఉప లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ పదవులపై సెలెక్షన్ కమిటీ సమావేశాలు సచివాలయంలో జరిగాయి. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్ రావు హాజరుకావాల్సి ఉన్నా.. ఆయన రాలేదు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో సమాచార హక్కు మినహా మిగతా పదవులకు కమిటీ సమావేశం అయ్యింది. రాష్ట్ర సమాచార హక్కు ముఖ్య కమిషనర్ పదవి కోసం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పోటీపడ్డారని తెలుస్తున్నది. వాస్తవానికి ఆమె పదవీకాలం ఈ నెలాఖరు వరకు ఉన్నప్పటీకి, సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె సన్నిహితులు వ్యాఖ్యానించారు. ఏమైందో ఏమో కానీ ముఖ్యమంత్రి సమాచార హక్కు ముఖ్య కమిషనర్, కమిషనర్ పదవుల భర్తీకి అంతగా ప్రాముఖ్యం ఇవ్వలేదు.
శాంతికుమారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించేందుకే కమిటీ సమావేశం నిర్వహించలేదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పేషీలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారి మరో నాలుగు నెలల్లో పదవీ విరమణ చేస్తున్నారని, ఆ తరువాత సమాచార హక్కు కమిషన్ పదవులకు కమిటీ భేటీ ఉండవచ్చని అంటున్నారు. రాష్ట్రంలో సమాచార హక్కు కమిషనర్ల పదవీ కాలం 2023 ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరిని కూడా నియమించలేదు. ఇప్పటి వరకు ఇరవై వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక అప్పీళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. వారం రోజుల్లో ఎన్ని దరఖాస్తులు అందాయో తెలియచేయాలని, ఆ తరువాతి వారం లో అభ్యర్థుల పరిశీలన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించి. ఆరు వారాల్లో సెలక్షన్ కమిటీ సమావేశమై ముఖ్య కమిషనర్, కమిషనర్ల పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ లు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.