Hyderabad Water bodies| చెరువుల నగరికి పట్టణీకరణ దెబ్బ.. హైదరాబాద్‌లో 500% తగ్గిపోయిన నీటి వనరులు
హైదరాబాద్ నగరంలో పట్టణీకరణ కారణంగా 500 శాతం చెరువులు లేదా నీటి వనరులు కుంచించుకుపోయాయి. 2020 నుంచి 2022 మధ్య ఇది ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నగర పరిధిలో 12,533 హెక్టార్ల నుంచి 2,280 హెక్టార్లకు నీటి వనరులు పడిపోయాయి. దీంతో హైదరాబాద్లో సహజ నీటి నెట్‌వర్క్‌ను ప్రభావితం చేసింది.

హైదరాబాద్, అక్టోబర్ 5 (విధాత) :
Hyderabad Water bodies| హైదరాబాద్‌ను గతంలో సిటీ ఆఫ్ లేక్స్ అని పిలిచేవారు. హైదరాబాద్‌లో చెరువులు, నీటి వనరులు, చిన్న చిన్న కుంటలు ఎక్కువగా ఉండేవి. అందుకే దీన్ని లేక్ సిటీగా పిలిచేవారు. అయితే హైదరాబాద్‌లో జనాభా పెరిగింది. ఉపాధి కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఇది హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్‌కు కారణమైంది. హైదరాబాద్‌లో ఉండే జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు పెరిగాయి. హైదరాబాద్ నాలుగు వైపులా విస్తరించింది. పట్టణీకరణ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి దోహదం చేసింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్‌ఏ 2024లో విడుదల చేసిన డాటా ప్రకారం 1979 నుంచి 2023 వరకు నగరంలో చెరువులు లేదా నీటి వనరుల విస్తీర్ణం 61 శాతం తగ్గింది. 56 చెరువులు లేదా నీటివనరుల మొత్తం వైశాల్యం 40.35 చదరపు కిలోమీటర్ల నుంచి 16 చదరపు కి.మీ. తగ్గింది. నగరంలోని యూసుఫ్‌గూడ, బంజారా హిల్స్ వంటి అనేక ప్రాంతాలు ఒకప్పుడు నీటి వనరులుగా ఉండేవని చెబుతారు. పికెట్ సరస్సు స్థానంలో జూబ్లీ బస్ స్టేషన్ వచ్చింది. ఇప్పుడు జూ పార్క్ ప్రాంతంలో గతంలో సింగో సరస్సు ఉండేది. అఫ్జల్ సాగర్, తలాబ్ కట్ట వంటి సరస్సులు ఇప్పుడు చరిత్రగానే మిగిలాయి. శివరాంపల్లిలోని 104 ఎకరాల్లోని బమ్ రుక్న్ ఉద్ దౌలా లేక్ 70 శాతం ఆక్రమణకు గురైంది. ఈ చెరువుకు సంబంధించిన ఏడు ఎకరాలను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్‌లో పెరిగిన నిర్మాణాలు
హైదరాబాద్ నగరంలో నిర్మాణ స్థలం పెరిగింది. 2000 సంవత్సరంలో కేవలం 38,863 హైక్టార్లలో నిర్మాణాలు ఉండేవి. 2020 నాటికి ఇవి 80,111 హెక్టార్లకు పెరిగాయి. ఫలితంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, దుర్గం చెరువు వంటి ప్రధాన నీటి వనరుల్లో నీటి మట్టాలు పడిపోయాయి. అంటే ఈ చెరువులు, నీటి వనరులకు వర్షం నీరు వచ్చే మార్గాలు మూసివేశారు. లేదా పాక్షికంగానో, పూర్తిగానో ఆక్రమణకు గురయ్యాయి. మరో వైపు పట్టణీకరణతో నీటి కాలుష్యం కూడా పెరిగింది. డ్రైనేజీ నీటిని చెరువుల్లోకి మళ్లించడం కూడా ఇందుకు కారణం. నీటి వనరులు పడిపోవటంతో భూగర్భ జలాలు కూడా క్షీణించిపోయాయి. ఐటీ హబ్‌లు, వాణిజ్య కేంద్రాలు, వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో ఈ పరిస్థితి నెలకొన్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విస్తరణ కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.
పడిపోతున్న భూగర్భ జలాలు
హైదరాబాద్‌లో రెండు దశాబ్దాల్లో 3500 నీటి వనరులు లేదా చెరువులు 650కి పడిపోయాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 90 శాతం అధికంగా నమోదైనా కూడా భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. మల్కాజ్‌గిరి, అమీర్‌పేట, కూకట్‌పల్లి, అల్వాల్ సహా అనేక ప్రాంతాల్లో ఆగస్టులో భూగర్భ జలాలు అత్యంత దిగువకు చేరుకున్నాయని తెలంగాణ భూగర్భ జల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఏప్రిల్ ,మే నెలల్లో నీటి ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇది రోజుకు దాదాపు 10,000 వరకు పెరిగింది. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు గ్రీన్ జోన్, నీటి వనరులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న వర్షంతో వరదలు
హైదరాబాద్‌లో చిన్న వర్షం కురిస్తే రోడ్డుపై వర్షం నీరు వరదగా ప్రవహిస్తోంది. వర్షం నీరు ఇంకిపోయే పరిస్థితులు లేకుండా పోయాయి. రుతుపవనాల్లో మార్పులు కూడా అసాధారణ వర్షపాతానికి కారణం. అస్థిర వర్షపాతంతో భూమి, నీటి వ్యవస్థలు ఒత్తిడికి గురౌతున్నాయి. దీంతో కొన్ని చోట్ల భూప్రకంపనాలు కూడా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ జోన్ పెంచడంతో పాటు నీటి వనరులను కాపాడడంతో పాటు వాటిని వృద్ధి చేయాలని సూచిస్తున్నారు.