Komatireddy Rajagopal Reddy | అడ్డుపడుతున్న అనేక అంశాలు.. రాజగోపాల్ ఆశ తీరేదెన్నడు?
రాష్ట్రంలో మంత్రి పదవికోసం తీవ్రంగా పరితపిస్తున్న నాయకుల్లో ఆయన మొదటివరుసలో ఉంటారు. ఆయనకు పదవి ఇస్తామని పార్టీ నాయకత్వం తిరుగులేని హామీ కూడా ఇచ్చింది. ఆ హామీ మేరకే ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. కానీ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం ఆయన ఆశ నెరవేరలేదు. ఆశ లేదంటూనే ఎందుకు ఇవ్వరన్న ప్రశ్నలను సంధిస్తున్నారు.

Komatireddy Rajagopal Reddy | హైదరాబాద్, ఆగస్ట్ 13 (విధాత): రాష్ట్రంలో మంత్రి పదవికోసం తీవ్రంగా పరితపిస్తున్న నాయకుల్లో ఆయన మొదటివరుసలో ఉంటారు. ఆయనకు పదవి ఇస్తామని పార్టీ నాయకత్వం తిరుగులేని హామీ కూడా ఇచ్చింది. ఆ హామీ మేరకే ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. కానీ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం ఆయన ఆశ నెరవేరలేదు. ఆశ లేదంటూనే ఎందుకు ఇవ్వరన్న ప్రశ్నలను సంధిస్తున్నారు. ఆయనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి. పార్టీలో చేరే సమయంలో తనకు ఇచ్చిన హామీని అమలు చేయాలని వీలు దొరికినప్పుడల్లా బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన విస్తరణలో చోటు దక్కుతుందని ఆశించినప్పటికీ. సామాజిక సమీకరణాలు, ఇకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు అనే అంశాలు రాజగోపాల్ రెడ్డికి నిరాశనే మిగిల్చాయి. అయితే.. అదే విస్తరణలో గతంలో మంత్రిపదవిపై హామీ పొందిన వివేక్ వెంకటస్వామితోపాటు.. ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరి, సామాజిక సమీకరణాలతో అడ్లూరి లక్ష్మణ్‌లకు అవకాశం కల్పించారు. అయితే.. ఇవే సామాజిక సమీకరణాలు రాజగోపాల్‌రెడ్డికి ఎదురుకొట్టాయన్న అభిప్రాయాలు ఉన్నాయి.
కారణాలనేకం!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సూర్యాపేట మినహా అన్నీ కాంగ్రెస్ గెలిచింది. జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఆ సంఖ్య మూడుకు పెరుగుతుందని, అందుకు ఆయనకు అవకాశం ఇవ్వడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపితే ఇప్పటికే నలుగురు రెడ్లకు క్యాబినెట్‌లో చోటు దక్కింది. రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తే ఈ సంఖ్య ఐదుకు పెరుగుతుంది. ఇది కూడా ఆయనకు అడ్డంకిగా తయారైందని అంటున్నారు. ఇప్పటికే వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇదే కుటుంబం నుంచి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంపై అభ్యంతరాలు ఉన్నాయి. ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులా అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో తెరమీదికి వచ్చింది.
సమర్థులైతే ముగ్గురికి ఇవ్వడంలో తప్పేంటి?
ఈ వాదనలన్నింటినీ రాజగోపాల్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. సమర్థులైతే ఒక జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. మంత్రి పదవి విషయంలో హామీ ఇచ్చే సమయంలో తన సోదరుడు వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారని విషయం గుర్తుకు లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పదికి గాను 9 స్థానాలే గెలిచింది. అయినా అక్కడ ముగ్గురు మంత్రులయ్యారు. నల్లగొండలో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో గెలిస్తే మూడో మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని రాజగోపాల్ నిలదీస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం సహా ముగ్గురు మంత్రులు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ఇలానే నల్లగొండ జిల్లాకు కూడా మూడు మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్ పెట్టేందుకు జానా యత్నం?
మొన్నటి విస్తరణకు ముందు రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పేర్లు తెరమీదికి వచ్చాయి. ఆ సమయంలో రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలని హైకమాండ్‌కు మాజీ మంత్రి జానారెడ్డి లేఖ రాశారు. ఈ లేఖపై రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. జానారెడ్ది ఇద్దరు కొడుకులు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. ఒకరు నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా, మరొకరు నల్లగొండ నుంచి ఎంపీగా గెలిచారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే భవిష్యత్తులో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌లో మరింత కీలకంగా మారే అవకాశం ఉన్నందున రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిథ్యం ఇవ్వాలనే పేరుతో జానారెడ్డితో లేఖ రాయించారనే చర్చ కూడా అప్పట్లో సాగింది.
రాజగోపాల్ వ్యాఖ్యలపై మంత్రుల చర్చ!
మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడులో సీఎంపై వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఈ భేటీ జరిగింది. రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించినట్టుగా చెబుతున్నారు. ఖాళీగా ఉన్న మూడు పోస్టుల్లో కూడా తనకు అవకాశం దక్కదనే సమాచారం రావడంతోనే రాజగోపాల్ రెడ్డి ఒంటికాలిపై విమర్శలు చేస్తున్నారనే ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది.
మద్దతుదారులను కూడగట్టే యత్నాలు?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో మద్దతుదారులను కూడగట్టుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డిని భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి అని అభివర్ణించడం, తాజాగా తనకు మంత్రిపదవిపై హామీ ఇచ్చిన విషయం వాస్తవమేనని అంగీకరించిన మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేయడం వారికి దగ్గరయ్యేందుకేననే చర్చలు నడుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
అసైనీలకు ‘హక్కులు ఇంకెప్పుడు? యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూపు
లిబర్టీ స్టాట్యూను మించిపోయిన మహావిష్టువు విగ్రహం – భారత్‌లో కాదు
Adani | అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లు.. ఆరు నెలలు గడిచినా అందించని భారత్
ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం రాదు: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు