Assigned Land Rights Telangana| అసైనీలకు ‘హక్కులు ఇంకెప్పుడు? యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూపు
అసైన్డ్ భూములు! పేద ప్రజలకు ప్రభుత్వం కేటాయించే భూములు! సాధారణంగా చిన్నపాటి భూమి ఉంటే.. కష్టకాలంలో దానిని అమ్ముకొని సమస్య నుంచి బయడపడుతుంటారు. కానీ.. ఈ అసైన్డ్ భూములకు మాత్రం ఆ అవకాశం లేదు. పేదలకు పంచిన భూములు దుర్వినియోగం అవుతాయన్న పేరుతో ప్రభుత్వాలు ఆ భూములపై క్రయ విక్రయాలు సహా ఎలాంటి యాజమాన్య హక్కులూ కల్పించవు. కేవలం వాటిని అనుభవించడం మాత్రమే ఉంటుంది. దీనిని సవరించాలనే విషయంలో చాలా కాలంగా దీర్ఘకాలిక చర్చలు, భిన్నాభిప్రాయాలు వెలువడుతూనే ఉన్నాయి.

రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే.. పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయవిక్రయాలతో సహా అన్ని రకాల యాజమాన్య హక్కులు కల్పిస్తాం.
– గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్
భూ సంస్కరణల ద్వారా గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూ హక్కులను లబ్దిదారులకు కల్పిస్తాం.
– టీపీసీసీ 2023 ఎన్నికల మేనిఫెస్టో
Assigned Land Rights Telangana| హైదరాబాద్, ఆగస్ట్ 13 (విధాత): అసైన్డ్ భూములు! పేద ప్రజలకు ప్రభుత్వం కేటాయించే భూములు! సాధారణంగా చిన్నపాటి భూమి ఉంటే.. కష్టకాలంలో దానిని అమ్ముకొని సమస్య నుంచి బయడపడుతుంటారు. కానీ.. ఈ అసైన్డ్ భూములకు మాత్రం ఆ అవకాశం లేదు. పేదలకు పంచిన భూములు దుర్వినియోగం అవుతాయన్న పేరుతో ప్రభుత్వాలు ఆ భూములపై క్రయ విక్రయాలు సహా ఎలాంటి యాజమాన్య హక్కులూ కల్పించవు. కేవలం వాటిని అనుభవించడం మాత్రమే ఉంటుంది. దీనిని సవరించాలనే విషయంలో చాలా కాలంగా దీర్ఘకాలిక చర్చలు, భిన్నాభిప్రాయాలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్దేశానికి భంగం కలుగకుండా అసైన్డ్ భూములకు క్రయవిక్రయాలతో కూడిన పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలనే డిమాండ్‌లు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని అసెంబ్లీ ఎన్నిలకు ముందు ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్‌తోపాటు.. ఎన్నికల ప్రణాళికలోనూ పొందుపర్చింది. ప్రజలు కాంగ్రెస్ మాట నమ్మారు. ప్రత్యేకించి గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. కానీ.. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల అంశం మాత్రం ఇంకా చర్చల్లో నలుగుతూనే ఉన్నది. అనేక మంది అసైనీలు తమ భూములకు విముక్తి కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎలాంటి కదలిక లేదనిపించుకోకుండా.. ప్రభుత్వం జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీలు వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు చెబుతున్నారు.
13.9 లక్షల మంది అసైన్డ్ రైతులు
రాష్ట్రంలో దాదాపు 13.9 లక్షల మంది రైతులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరికి సుమారు 25 లక్షల ఎకరాల భూమిని గత ప్రభుత్వాలు అసైన్ చేశాయి. ఈ భూముల వారసులు అంతా కలిపి దాదాపు 25 లక్షల మంది వరకు ఉంటారని ఒక అంచనా. అయితే అసైన్డ్ భూముల యజమానులు కొంత మంది ఇంటి అవసరాల కోసం విక్రయించారు. ఇలా విక్రయించిన అసైన్డ్ భూములను గ్రామాలలో చాలా వరకు పక్కనే ఉన్న చిన్న రైతులే కొనుగోలు చేశారు. ఇప్పటికి అలా విక్రయించిన భూములను కొనుగోలు చేసిన పేద రైతులే సాగు చేసుకుంటున్నారు. కానీ వాటిని కొనుగోలు చేసిన వారి పేరున ఎక్కించలేదు. ఇవి కాకుండా హైదరాబాద్ మహానగరం సహా వివిధ పట్టణ శివారు ప్రాంతాలలోని అసైన్డ్ భూములు కొన్ని.. ప్లాట్లుగా మారాయి. వివిధ రకాల వ్యక్తుల చేతిలోకి వెళ్లాయి. కానీ ఎవరికీ ఎలాంటి హక్కులూ రాలేదు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం అసైనీలకు యాజమాన్య హక్కులు కల్పించడమేననే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకేసిన కాంగ్రెస్ పార్టీ పూర్తి యజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది కానీ ఈ దిశగా అడుగులు ముందుకు పడలేదు.
బీఆరెస్ హయాలో కదలిక.. అడ్డుకున్న రియల్ ఎస్టేట్ వర్గాలు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. అసైన్డ్ భూములు పేదోడి చేతిలోనే ఉంటే ఉచితంగానే యజమాన్య హక్కులు కల్పించాలని భావించింది. ఒక వేళ చేతులు మారితే వాటికి క్రమబద్ధీకరించాలని యోచించింది. ఈ మేరకు ఫైల్ కూడా రన్ చేసింది. అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేశ్ కుమార్ అసైన్డ్ భూములను క్రమబద్దీకరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 30వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేసీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది. అయితే అసైన్డ్ భూమికి పూర్తి హక్కులు వస్తే లక్షల ఎకరాల భూమి మార్కెట్లోకి వస్తుందని, దీంతో భూముల ధరలు తగ్గుతాయని రియల్ ఎస్టేట్ వర్గాలు అప్పటి ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి నిలిపి వేయించినట్లు ప్రచారం ఉంది. ఆ సమయంలో అప్పటికి ఎన్నికలకు ఆరు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ విషయాన్ని చూద్దామనే భావనతో నాటి ప్రభుత్వం పక్కన పెట్టిందని చెబుతారు. కారణం ఏమైనా అసైనీలకు యజమాన్య హక్కులను కల్పించలేక పోయిన కేసీఆర్ ప్రభుత్వం.. 2017 డిసెంబర్ 31కి ముందు అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన పేదలకు రీ అసైన్డ్ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఒకటి రెండు చోట్ల మినహా దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంలో కేసీఆర్ సర్కారు విఫలమైంది.
రేవంత్ సర్కారులోనూ కదలని అడుగులు!
అసైనీలకు పూర్తి యజమాన్య హక్కులు కల్పిస్తామన్న రేవంత్ సర్కారు ఏడాదిన్నర కాలంగా ఆ దిశగా అడుగులు ముందుకు వేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. యజమాన్య హక్కులు కల్పిస్తే దళితుల చేతుల్లో నుంచి ఆధిపత్య వర్ణాలు, డబ్బులున్న కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే వాదనలు బలంగా ఉన్నాయి. దీంతో తిరిగి దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతుల వాళ్లు భూమిలేని నిరుపేదలుగా మారే ప్రమాదం ఉందని ఒక గిరిజన నేత అభిప్రాయ పడ్డారు. ఇది ఇందిరమ్మ స్ఫూర్తికి వ్యతిరేకమని కూడా అన్నారు. అయితే అసైనీ భూములు సాగులోకి తీసుకురావడానికి దళిత, గిరిజనులకు వ్యవసాయ పనిముట్లు కొనుగోలుకు, బోర్లు వేసుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలని చెపుతున్నారు. ఇలా భిన్నాభి ప్రాయలు వెలువడడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గిందా? అన్న చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులు
రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో నిరు పేదలు పంట పొలాల మధ్యలో ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి సదరు భూమిని అసైన్ చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఆయా మండలాల్లో అధికారులు గ్రామాలవారీగా ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న అర్హత కలిగిన పేదలు, రీ అసైన్ చేయాల్సిన భూముల వివరాలు సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలుకూ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. వాస్తవంగా పేదలకు ప్రభుత్వ భూములు అసైన్ చేయాలంటే విధిగా అసైన్డ్ కమిటీలు వేయాలి. గత బీఆరెస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా అటువైపు దృష్టిసారించలేదు. 2005 జనవరి17వ తేదీన తీసుకు వచ్చిన 98 జీవో ప్రకారం అసైన్ కమిటీలలో స్థానిక ఎమ్మెల్యే చైర్మన్‌గా, ఆర్డీఓ, వివిధ వర్గాలలో పని చేసే ముగ్గురు సోషల్ వర్కర్లు, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒకరు, బీసీల నుంచి ఒకరు, ఇతర వర్గాల నుంచి ఒకరు, స్థానిక ఎంపీపీ, జెడ్‌పీటీసీ, ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నుంచి ఒక ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. మెంబర్ సెక్రటరీగా తాసిల్దార్ వ్యవహరిస్తారు. అయితే జిల్లాల పునర్విభజనతో 33 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. జిల్లాలు చిన్నగా ఉన్నందున కలెక్టర్లు చైర్మన్లుగా అసైన్ కమిటీలు వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఫైల్ సర్క్యులేట్ అయి సీఎం కార్యాలయానికి చేరినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి అసైన్ భూములకు పూర్తిగా యజమాన్య హక్కులు కల్పించాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కారు పక్కన బెట్టిందా? అన్న చర్చ జరుగుతున్నది.
ఇవి కూడా చదవండి..
Dharani | ‘ధరణి’ దోపిడి! రైతులను లూటీ చేసిన పోర్టల్?
తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు – ముఖ్యమంత్రి హై అలర్ట్ ప్రకటన
లిబర్టీ స్టాట్యూను మించిపోయిన మహావిష్టువు విగ్రహం – భారత్లో కాదు