తెలంగాణలో అధికార పక్షానికి మున్సి‘పోల్’ పరీక్ష
త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వివిధ పట్టణాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పట్టణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది.
- పట్టణాల్లో పనులకు మంత్రుల శంకుస్థాపనలు
- ఆఘమేఘాల మీద అభివృద్ధి పనులు ప్రారంభం
- మున్సిపాలిటీల్లో ఇంచార్జ్ మంత్రుల హడావుడి
- ప్రతిష్ఠాత్మకంగాఇ తీసుకుంటున్న అధికార పక్షం
- లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యత మంత్రులకు!
- సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనుల్లో నిమగ్నం
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి పరీక్షగా మారనున్నాయి. పట్టణ ప్రాంత ఓటర్లను తమ వైపు తిప్పుకొని రాజకీయంగా రాష్ట్రంపై గట్టిపట్టు సాధించాలని భావిస్తున్నప్పటికీ వారి నాడిని పసిగట్టడం అంత సులువుగా కనిపించడం లేదు. దీంతో ఎన్నికలకు ముందుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు పట్టణాల్లో అభివృద్ధి పనుల హడావుడి కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. ఫిబ్రవరి రెండవ వారంలో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు ముందే ఆయా మున్సిపాలిటీల్లో తమ ‘అధికార ముద్ర’ వేసేందుకు అభివృద్ధి పనుల ప్రారంభాలు లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్న అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించారు. ఆగమేఘాల మీద పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ సారి సీఎం మంత్రులకు లోక్ సభ నియోజకవర్గాలవారీగా బాధ్యతలు కేటాయించారు. ఈ మేరకు అభివృద్ధి పనులను ఆయా ఇంచార్జ్ మంత్రులు దగ్గరుండిమరీ ప్రారంభిస్తున్నారు. ఆయా శాఖల మంత్రులతో పాటు ఎన్నికల ఇంచార్జ్ మంత్రులు ఉంటున్నారు. దీంతో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగనున్న పట్టణాలు, నగరాల్లో అధికార పార్టీ హడావుడి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల పర్యటనలు, పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఆయా జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతోపాటు, ఇంచార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కలిసి సాగుతున్నారు. దీంతో పాటు నిన్నమొన్నటి వరకు పార్టీలో వర్గ విభేదాలు, గ్రూపులతో ఉన్న నాయకుల మధ్య సమన్వయం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అసమ్మతి నాయకులు, అసంతృప్తులను బుజ్జగించే పనిని ప్రారంభించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఈ కార్యక్రమంలో భాగంగానే భువనగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, ఆలేరు, జనగామ, పాలకుర్తి పట్టణాల్లో ఇంచార్జ్ మంత్రి ధనసరి సీతక్క అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబాబాద్, కేసముద్రం పట్టణాల్లో రూ. 200 కోట్ల నిధులతో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు పర్యటించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, జంక్షన్ల అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీ ప్రారంభించారు. మేడారం జాతర పనులున్నప్పటికీ ఇంచార్జ్ గా సుడిగాలి పర్యటన చేశారు. సోమవారం వరంగల్ లోక్ సభ ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాద్, మరిపెడ, తొర్రూరు, వర్ధన్నపేట తదితర పట్టణాల్లో పనులు ప్రారంభించారు. తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి పొంగులేటి పరిశీలించారు. తొర్రూరు, మరిపెడ, మహబూబాద్లలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు ప్రారంభించారు.వర్ధన్నపేటలో 5 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, సబ్ జైల్, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్టీ సమావేశాలు నిర్వహించి మంత్రులు ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడక్కడ స్థానిక ఎమ్మెల్యేల పై వ్యతిరేకత, పార్టీలోని గ్రూపులు బహిర్గతమవుతున్నాయి. సోమవారం తొర్రూరులో జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అసమ్మతి వర్గం తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మున్సిపోల్ ఇంచార్జ్ మంత్రులు వీరే
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లోక్ సభ నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ మంత్రుల వివరాలిలా ఉన్నాఇ. లోక్ సభ నియోజకవర్గం పెద్దపల్లి – జాపెల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ – సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్– ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కరీంనగర్ – తుమ్మల నాగేశ్వర్ రావు, నల్లగొండ – అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ – పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భువనగిరి –సీతక్క, ఖమ్మం – కొండా సురేఖ, చెవెళ్ళ – శ్రీధర్ బాబు, మెదక్ – వివేక్ వెంకటస్వామి, మహబూబ్ నగర్ – దామోదర రాజనర్సింహా, నాగర్ కర్నూల్ – వాకిటి శ్రీహరిలను బాధ్యులుగా నియమించారు.
90 శాంత సక్సెస్ రేట్ లక్ష్యం
మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ అదే ఉత్సాహంతో ముందుకు కదిలి ఈ సారి అంత కన్నా ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. పీసీసీ పక్షాన అమలు చేసే ప్రణాళికను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో మున్సిపాలిటీల పై పట్టుబిగించేందుకు పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తున్నారు. 90 శాతం విజయం సాధించేందుకు పక్కా ప్రణాళిక, వ్యూహాలు రచించాలని సీఎం రేవంత్ కేబినెట్ మీటింగ్ లో దిశానిర్ధేశం చేశారు. మెజార్టీ మేయర్, చైర్మన్ స్థానాలతోపాటు, 90శాతం వార్డులను గెలుచుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి రెబల్ లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఫిబ్రవరి రెండవ వారంలో ఎన్నికలు జరుగనున్నందున అభ్యర్ధుల ఎంపికలో గెలుపు గుర్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవాలని, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఈ సారి గట్టిదెబ్బ కొట్టాలని సీఎం తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రులకు పార్లమెంటు నియోజకవర్గాలవారీగా ఇంచార్జ్ ల ను నియమించారు. ఒకరిద్దరు మంత్రులు మినహా అందరూ తమ తమ బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. అభివృద్ధి పనులు ప్రారంభించడంతో స్థానికంగా సానుకూల స్పందన వస్తుందని భావించి అవసరమైన నిధులు కేటాయించారు. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించడంతో భరోసా నెలకొనే అవకాశం ఉంది. అధికార పార్టీ అభ్యర్ధులను గెలిపిస్తే అభివృద్ధికి అవకాశం లభిస్తుందని, నిధులు తెచ్చేందుకు ఎక్కువ అవకాశాలుంటాయనే సంకేతాలిచ్చే విధంగా ప్రభుత్వ పక్షాన ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల పర్యటన సందర్భంగా సీఎం కూడా ఇదే సందేశాన్ని ఇస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా జిల్లా పర్యటనలు చేసిన సీఎం రేవంత్ ఎన్నికల నాటికి మరి కొన్ని ప్రాంతాల్లో పర్యటించి, భారీ సభలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram