Narender Reddy Controversy | ఒక్కడి కోసం ఇంత రభసా? అయినా రేవంత్ రెడ్డి ఆయన వైపే!

వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా నేతల అంతర్మథనం వెనకాల ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కుట్రలు ఉన్నాయనే వార్తలు కాంగ్రెస్‌లో గుప్పుమంటున్నాయి. రాష్ట్రంలో అధికారం రాక ముందు ఇద్దరు నాయకురాళ్ల సహాయం తీసుకుని, ప్రభుత్వం ఏర్పాటు కాగానే తమ వారికి పైన నరేందర్ రెడ్డి అజమాయిషీని పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Narender Reddy Controversy | ఒక్కడి కోసం ఇంత రభసా? అయినా రేవంత్ రెడ్డి ఆయన వైపే!

హైదరాబాద్, అక్టోబర్‌ 20 (విధాత ప్రతినిధి):

Narender Reddy Controversy | పీసీసీ అధ్యక్షుడి నియామకం సమయంలో, అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారిద్దరూ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. ఎవరేం అనుకున్నా తమకేంటనే విధంగా ఆ ఇద్దరు మహిళా నాయకురాళ్లు ఆయనకు సంపూర్ణ మద్దతు పలికారు. కానీ.. ఒక నాయకుడి కుట్రల కారణంగా ఆ ఇద్దరు మహిళా నేతలు తీవ్ర అంతర్మథనానికి గురవుతున్నారని వారి అనుచరవర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాలతో ఎవరికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారో బట్టబయలు అయిందని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మున్ముందు ఈ పరిణామాలు ఇంకెంత దూరం వెళ్తాయోనని అయోమయానికి గురవుతున్నారు.

వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు ఏడాది కాలంగా అనేక మలుపులు తిరుగుతున్నాయి. ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్ధతుగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గరి నుంచి ఆమె ఆయన వెన్నంటే ఉంటున్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక సమయంలో కూడా ఆయన వైపే ఉన్నారు. ఎక్కడా ఆమె దాగుడు మూతలు ఆడలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. రేవంత్ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ సమావేశాల్లో చెప్పేవారు. ఆయన కూడా సీతక్కను సోదరిగా గౌరవించేవారు. ప్రతి రాఖీ పౌర్ణమికి రేవంత్‌ ఇంటికి వెళ్లి సీతక్క రాఖీ కట్టి వచ్చేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, రేవంత్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌ ఆరా తీయగా అప్పుడు కూడా సీతక్క సంకోచించకుండా రేవంత్‌ రెడ్డికే మద్దతు ప్రకటించారు. ఆదివాసీ బిడ్డగా సీతక్కకు తన క్యాబినెట్‌లో రేవంత్‌ రెడ్డి సమున్నత స్థానం ఇచ్చారు. కీలకమైన పంచాయత్ రాజ్ శాఖతో పాటు గిరిజన సంక్షేమ శాఖను అప్పగించి, ఆమె పట్ల తనకున్న నిబద్ధతను రాష్ట్ర ప్రజలకు తెలియచేశారు. అయితే భద్రాచలంలో ఇసుక దందాలో సీతక్క పీఏ ప్రమేయం ఉందంటూ సోషల్ మీడియాలో, మీడియాలో వార్తలు రావడంతో ఇద్దరి మధ్య కొంత దూరం పెరిగిందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో, మీడియా సమావేశాల్లో రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించేవారు. ఈ విమర్శలను వెంటవెంటనే సీతక్క తిప్పికొట్టేవారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు ఘాటుగా హెచ్చరికలు చేసేవారు. ములుగు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి జోక్యం చేసుకోవడం ఆమెను కొంత మనస్థాపానికి గురి చేశాయంటున్నారు సీతక్క అనుచరులు. తన శాఖలో, తన నియోజకవర్గంలో, ములుగు జిల్లాలో ఆయన పెత్తనం ఏమిటనే భావనలో ఆమె ఉన్నట్టు తెలుస్తున్నది. భద్రాచలంలో ఇసుక దందాలో బద్నాం కావడం వెనకాల ఈయన ప్రమేయం ఉందని సీతక్క అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఆయనతో ప్రత్యక్షంగా తలపడే బదులు, తన పనేంటో తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సీతక్క.

వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ.. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి అండదండగా ఉంటున్నారు. సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావు కూడా ఇదే వైఖరితో ఉన్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని ఎన్నికలకు ముందు కార్యకర్తల సమావేశాల్లో చెప్పేవారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక సందర్భంలో కూడా కొండా సరేఖ దంపతులు బేషరతుగా మద్దతు ప్రకటించారు. రేవంత్ కూడా వారి రుణం తీర్చుకున్నారు. తన క్యాబినెట్ లో సురేఖకు అడవులు, పర్యావరణ, దేవాదాయ శాఖలను అప్పగించారు. తన కోటరీగా గుర్తించి, ముఖ్య విషయాల్లో సంప్రదింపులు జరిపేవారనే వాదనలు ఉన్నాయి. ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం లభించేలా చూసేవారు. గౌరవ, మర్యాదలకు ఎక్కడా భంగం కలిగించేలా చూడవద్దని అధికారులకు సూచించేవారని అంటున్నారు. సినిమా హీరో అక్కినేని నాగార్జున, మాజీ పెద్ద కోడలు సమంత రుత్ ప్రభు విడాకులపై సురేఖ చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్నే రేపాయి. వాటిపై కేటీఆర్‌తోపాటు నాగార్జున కుటుంబం కూడా ఘాటుగా స్పందించింది. ఆ తరువాత సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా.. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డిపై ఏ విమర్శ చేసినా ఎప్పటికప్పుడు సురేఖ తిప్పి కొట్టేవారు. కానీ.. గత ఆరు నెలలుగా సురేఖ గుంభనంగా ఉంటున్నారని ఆమె వర్గాలు చెబుతున్నారు. తన శాఖ, నియోజకవర్గానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో తన ఓఎస్డీ నార్ల సుమంత్ తొలగింపుతో ఇద్దరి మధ్యనున్న విభేధాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాతి పరిణామలు, బుజ్జగింపులు మనం చూశాం. తన తల్లి శాఖకు సంబంధించిన ఫైళ్ల పై సంతకాలు చేయకపోవడం, వ్యక్తిగతంగా తీసుకువెళ్లినా చూడకుండా పక్కన పడేసినట్లు సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఆరోపించారు. రేవంత్ అవమానకరంగా వ్యవహరిస్తున్నారని, సూటిపోటి మాటలంటున్నారని చెబుతూ.. ‘కాళ్లు పట్టుకోవాలా?’ అనికూడా ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు కూడా సురేఖకు ప్రతిబంధకంగా మారాయంటున్నారు.

వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా నేతల అంతర్మథనం వెనకాల ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కుట్రలు ఉన్నాయనే వార్తలు కాంగ్రెస్‌లో గుప్పుమంటున్నాయి. రాష్ట్రంలో అధికారం రాక ముందు ఇద్దరు నాయకురాళ్ల సహాయం తీసుకుని, ప్రభుత్వం ఏర్పాటు కాగానే తమ వారికి పైన నరేందర్ రెడ్డి అజమాయిషీని పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వీరి అనుచరులు సైతం వాదిస్తున్నారు. ఇటీవల సురేఖకు వ్యతిరేకంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఒక గ్రూపుగా ఏర్పడి బహిరంగంగా ప్రకటనలు గుప్పించారు. సురేఖ కావాలో? తాము కావాలో తేల్చుకోవాలని అల్టిమేటం కూడా ఇచ్చారు. ఏ ఒక్కరు కూడా అనుకూలంగా లేకపోవడం ఆమెకు మైనస్ గా మారిందని విశ్లేషకులు అంటున్నారు. పీసీసీ నాయకత్వం జోక్యంతో సమస్య సద్ధుమణిగింది. ఈలోపే ఓఎస్డీ సుమంత్ వ్యవహారం వెలుగుచూడ్డం, అరెస్టు వరకు వెళ్లడంతో సురేఖ అనుమానం మరింత బలపడిందంటున్నారు. నరేందర్ రెడ్డికి మద్ధతుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని వరంగల్ ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమించారని అనుచరులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇద్దరు కలిసి కుట్రలు చేస్తూ మహిళా మంత్రులను బద్నాం చేస్తున్నారని, అయినా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదనేది అభిమానుల వాదన. ఎన్నికలకు ముందు నరేందర్ రెడ్డి జిల్లాలో పార్టీ పటిష్టం కోసం చేసింది ఏమీ లేదని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన తన ప్రాభవాన్ని, పలుకుబడిని చూపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తన కుమారుడిని రాజకీయ వారసుడిగా తయారు చేయడం కోసం అంతర్గతంగా గ్రూపు రాజకీయాలు, కుట్రలు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఒక్క వేం నరేందర్ రెడ్డి కోసం తనకు మొదటి నుంచి అండగా ఉన్న ఇద్దరు మహిళా నాయకురాళ్ల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి సరైంది కాదనే వాదన కార్యకర్తల్లో బలంగా వినిపిస్తున్నది.